For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్స్ కే 'డార్లింగ్' (రివ్యూ)

  By Srikanya
  |
  Darling
  Rating
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
  నటీనటులు: ప్రభాస్‌, కాజల్‌, ప్రభు, ధర్మవరపు, ఎమ్మెస్‌ నారాయణ,
  ఆహుతి ప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, రాజా శ్రీధర్‌ తదితరులు.
  సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
  ఫైట్స్: పీటర్ హెయిన్స్
  డైలాగులు: స్వామి
  ఆర్ట్స్: అశోక్
  కెమెరా: ఆండ్రూ
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  నిర్మాత: బి.వి.యస్‌.యన్‌. ప్రసాద్‌
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణాకరన్‌
  విడుదల తేది: 23, ఏప్రియల్ 2010

  'తొలిప్రేమ' వంటి ప్రేమకథను,'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి ఎంటర్టైనర్ ను అందించిన దర్శకుడు కొత్త సినిమా అదీ పెద్దహీరోతో అంటే ఏదో అద్బుతం జరగబోతోందని ఆశిచంలో ఆశించటం సహజం. అయితే అంతసీన్ లేదని హీరో ఇంట్రడక్షన్ సీన్ ఓ కొరియా సినిమా మొదటి సీన్ నుంచి లిప్ట్ చేసినప్పుడే (అదీ అంత ఇంప్రసివ్ గా ఉండదు) అర్దం చేసుకుంటాం. అయితే ఇలాంటి ఎత్తిపోతల పధకాలు కామనే అనుకుని ముందుకు వెళ్ళితే అక్కడ 'డైసీ' అనే మరో కొరియా చిత్రంలోని హైలెట్ సీన్స్ వస్తూంటాయి. సర్లేండి అని మళ్ళీ సర్దుకుని చూస్తూ ఇంటర్ వెల్ కొస్తే...అబ్బబ్బే ఇప్పటికి వరకూ మీరు చూసింది అబద్దం అని తేల్చేస్తాడు. అది అదిరిపోయే ఇంటర్వెల్ ట్విస్టో...లేక అంతసేపు మనల్ని వెర్రి వెధవలను చేయటానికి స్క్రీన్ టైం వేస్ట్ చేసాడనుకునో మిగతాది చూస్తాం. అక్కడా పొరపాటున కొత్త కథ, కథనం కనపడదు. మరేంటి ఈ చిత్రంలో ఏ గొప్పతనం లేదా అంటే ప్రభాస్ కొత్తగా కనపడతాడు. అతని డ్రెస్ సెన్స్, స్టైల్స్ బాగుంటాయి. అంటే ప్రభాస్ అభిమానులుకు సంతృప్తి పరచటానికి చేసిన చిత్రం అని అర్దమవుతుంది.

  కథలో 1980లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కొందరు కాలేజ్ మేట్స్ తర్వాత లైఫ్ లో సెటిలయ్యాక కలవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే ఆ స్నేహితుల్లో ఇద్దరు పిల్లలు 'మనసంతా నువ్వే' టైపులో దగ్గరయి విడిపోతారు. వాళ్ళు పెరిగి పెద్దయే సరికి దశాబ్దం గడిచి మళ్ళీ కలవటం జరగుతుంది. ఆ పెరిగి పెద్దయిన వారే....ప్రభు కొడుకు ప్రభా(ప్రభాస్). మరో స్నేహితుడు ఆహుతి ప్రసాద్ కూతురు నందిని(కాజల్). ప్రభా ఇండియాలో చదువుకుని అన్ని సినిమాల్లో హీరోలాగానే బరువు భాద్యతలు లేకుండా తిరుగుతూంటాడు. ఇక నందిని స్విజ్జర్ లాండ్ లో చదువుకున్న బుద్దిమంతురాలైన గోల్డ్ మెడలిస్టు. మళ్ళీ వీరంతా కలిసినప్పుడు ఆ అమ్మాయిని ఎట్రాక్ట్ చేయటానికి ప్రభా నానారకాలుగా ప్రయత్నిస్తాడు. వీరి మధ్యలోకి వారి మరో స్నేహితుడు ఎమ్.ఎస్.నారాయణ కుమారుడు(అంటే విలన్) వస్తాడు. వాడ్ని అడ్డుకుని సమస్యను పరిష్కరించే లోపలే...ప్రభా వెనక పడి రిజక్టు అయిన అమ్మాయి నిషా(శ్రధ్దాదాస్) తండ్రి ముఖేష్ రుషి(పెద్ద విలన్) తన మనుష్యులతో పడతాడు. వీటిని ఛేదించుకుని ప్రబా...తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.

  నిజానికి డార్లింగ్ చిత్ర కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు కొన్ని వందల సార్లు చూసిందే. అయితే ఈ కథకు పాత ప్రెండ్స్ పిల్లల ప్రేమ అనే కొంత కొత్త టచప్ ఇచ్చాడు దర్శకుడు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఇప్పటివరకూ మీరు చూసింది నిజం కాదు...అది హీరో నోటికొచ్చింది, ఊహించి చెప్పిన కథే అని తేల్చేసి ట్విస్ట్ ఇద్దామని చూసాడు. దాంతో అంటే అప్పటివరకూ సినిమా కథ ఇంకా పొరపాటున కూడా మొదలవలేదని అర్ధమవుతూంది. దాంతో ఫస్టాఫ్ లో రావాల్సిన కథ మెలిక, మొదలవ్వాల్సిన కాంఫ్లిక్ట్ లేకుండా పోయాయి. దాంతో సెకెండాఫ్ లో ప్రెష్ గా కథ ప్రారంభమయి, హీరో, హీరోయిన్స్ మధ్య సమస్యను ఏర్పాటు చేసి సెటప్ పూర్తి చేసేటప్పటికే ప్రి క్లైమాక్స్ వచ్చేసింది. అప్పుడు కథలో మరో స్టెప్ తీసుకోవటానికి సమయం లేకుండా పోయింది. అదే ఈ చిత్రానికి మైనస్ గా మారింది. అంటే ఎవరయినా లేటయి ఇంటర్వెల్ తర్వాత ధియోటర్ లోకి వెళ్ళినా కథ కొంచెం కూడా సినిమా మొత్తం అర్ధం అవుతుందన్నమాట.

  ఇక ఈ చిత్రానికి స్వయంగా కథకుడు అయిన కరుణాకరన్ కేవలం సీన్స్ వరస చెడకుండా వేసుకోవటానికి, ప్రభాస్ ని ఎట్రాక్టివ్ గా చూపటానికి సమయం, క్రియేటివిటీ మొత్తం వెచ్చించాడు. అలాగే డైలాగుల రచయిత స్వామి ఎక్కడా ఏమీ పేలకుండా జాగ్రత్తలు తీసుకుని రాసాడు. అలాగని టచింగ్ గానూ ఉండవు. ఇక ప్రబాస్ ఈ సినిమాను మొత్తం తన భుజాలపై మోసాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాజల్ బాగా చేసింది కాని కొన్ని చోట్ల ఎందుకనో ఎమోషన్స్ సీన్స్ లో పండించలేకపోయింది. ఇక విలన్ గా వేసిన ముఖేష్ రుషి ని చూస్తే జాలేస్తుంది. అంత చెత్తగా అతని పాత్రను రూపొందించారు. అది దర్శకుడు సమస్యే అని అర్దమవుతుంది. యాక్షన్ సన్నివేసాలను అతను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు.

  మిగతా పాత్రల్లో చంద్రమోహన్, ఎమ్.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, ప్రభు వంటి సీనియర్స్ ఎప్పటిలాగే మెప్పించారు. ఇక అమృతం ఫేమ్ శివన్నారాయణ ఒకే మాడ్యులేషన్ లో 'తిన్నారా' అనే డైలాగుని చెపుతూ నవ్వించే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు. ఇక సంగీతం బాగాలేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఎందుకంటే ఆడియో కూడా సక్సెస్ కాలేదు కదా. ఇక చివరగా శ్రధ్దా దాస్ గురించి చెప్పుకోవాలి. పాపం ఆమె హీరోని ప్రేమించి భంగపడే పాత్రలకు స్పెషలిస్టు లాగా తయారైంది. మిగతా విభాగాల్లో యాక్షన్ పీటర్ హెయిన్స్ బాగా చేసారు. అలాగే హైదరాబాద్ అందాలని మంచులో ముంచినట్లుగా చూపిన గ్రాఫిక్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా స్విజ్జర్ లాండ్ లో కొన్ని లొకేషన్స్ ని బాగా చూపెట్టింది. ఎడిటింగే మరింత క్రిస్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

  ఏదైమైనా ప్రభాస్ అభిమానులుకు ఈ డార్లింగ్...డార్లింగ్ లా కనిపిస్తాడు. మిగతా వారికి అతి మామూలుగా...ఇంకా చెప్పాలంటే కొంచెం బోరుగా అనిపిస్తాడు. పెద్దగా ఆశించకుండా వెళ్తే పెద్దగా నిరాశపరచడు. పెద్ద హీరో, ఎక్సపెక్టేషన్స్, ఎంటర్టైన్ మెంట్ ఫరవాలేదనిపించటం, పబ్లిసిటీ ఈ చిత్రాన్ని కొద్ది వారాలపాటు ధియోటర్ లో ఉండేటట్లు చేసే అవకాశం ఉంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X