For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తూచ్.... ('మిర్చి' రివ్యూ)

  By Srikanya
  |

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  2.0/5
  ఆ మధ్యన కమర్షియల్ తెలుగు సినిమాకు వరంలా మారిన ఫ్యాక్షన్ నేపధ్యం ప్రేక్షకులకు పరమ బోర్ గా మారి,రిజెక్టు చేస్తూండటంతో...... అప్పటివరకూ వెండి తెరపై ఫ్యాక్షన్ నరుకులాటలు, రక్తపుటేరులు ప్రవహింపచేసిన దర్శక, నిర్మాతలు ఒక్కసారిగా రూటు మార్చి కామెడీపై పడ్డారు. అయితే రచయిత నుంచి దర్శకుడుగా మారిన కొరటాల శివ మాత్రం.. మళ్లీ పాత పగని(ప్రేక్షకులపై) రేపినట్లు.. ఫ్యాక్షన్ కత్తులతో విరుచుకు పడ్డాడు. మిస్టర్ ఫెరఫెక్ట్ వంటి కథలతో ఫ్యామిలీ హీరోగా మారుతున్న ప్రభాస్ కు మాస్ హిట్ ఇస్తానంటూ రక్తం ఓడుతున్న కత్తిని ఇచ్చాడు. అయితే ఆ కత్తికి కధా పదును సరిగ్గా పెట్టలేకపోయాడు. ఫస్టాఫ్ ని ఎంటర్టైన్మెంట్ తో బాలెన్స్ గా నడిపిన దర్శకుడు సెకండాఫ్ కి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ పేరుతో శివమెత్తిపోయాడు. దానికి తోడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏ పాపుగంటతోనో సరిపెట్టకుండా సెకండాఫ్ మొత్తం దాంతో నడిపించేసి హమ్మయ్య అనుకున్నాడు. అయితే ప్రేక్షకుడు ప్లాష్ బ్యాక్ లు చూడ్డానికి ధియోటర్ కి రారనే విషయం మర్చిపోయాడు. అప్పటికీ ప్రభాస్...తనదైన శైలిలో మంచి ఎనర్జీతో నటించి సినిమాని పూర్తిగా తన భుజాలపై మోసే ప్రయత్నం చేసాడు.

  ఇటలీలో ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న జై (ప్రభాస్‌)... వీలైతే ప్రేమిద్దాం.. పోయేదేముంది డ్యూడ్ అనే మనస్తత్వం ఉన్న యువకుడు. అక్కడే చదువుకుంటున్న మానస (రిచా గంగోపాధ్యాయ) జై ఏటిట్యూడ్ నచ్చి ప్రేమలో పడుతుంది. అంతేగాక తమ ప్రేమకు అడ్డుగా నిలిచే తన ఫ్యాక్షన్ కుటుంబం గురించి జై కు వివరిస్తుంది. దాంతో... జై వెంటనే తట్టాబుట్టా సర్దుకుని... ఇండియా వచ్చేసి, ఆమె ఇంటిలో వాలిపోయి... ప్యాక్షన్ పగలతో రగిలిపోతున్న వారి కుటుంబాన్ని సంస్కరించే పనిలో అమాంతం పడిపోతాడు. ఆ క్రమంలో అతని గురించి ఓ నిజం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇంతకీ జై ఆ ఇంటికి వచ్చింది.. తన ప్రేమ కోసం కాదు.. మరొక పనిమీద అని.. ఇంతకీ ఆ పని ఏమిటి... ఇంతకీ జై ఎవరు...మరో హీరోయిన్ వెన్నెల (అనుష్క) లతో జైకి ఉన్న బంధమేమిటి? వాళ్లిద్దరిలో ఎవరిని ప్రేమించాడు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

  ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో చెప్పిన ఈ కథని దర్శకుడు, రచయిత అయిన కొరటాల శివ సాధారణ ప్రేక్షకుడికి సైతం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం తెలిసిపోయేలా ఊహకు అందే స్క్రీన్ ప్లే తో తయారు చేసాడు. దానికి కారణం.. రొట్టకొట్టడు స్టోరీ లైన్ ఎన్నుకోవటం.. దాంతో ఎన్నో సార్లు తెరపై చూసిన సీన్స్ ఆ స్టోరీ నుంచి పుట్టడం. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ తోనే సెకండాఫ్ మొత్తం నింపేసాడు. తమ ఇంటికి అతిథి గా వచ్చిన హీరో గురించి నిజ స్వరూపం తెలుసుకున్న విలన్స్ ఏం చేసారు... అన్న విషయమై సెకండాఫ్ ఎక్కువ భాగం నడవాల్సి ఉండగా... దాన్ని క్లైమాక్స్ ఫైట్ తో ముగించేసాడు. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ కథల్లో... హీరో గతం తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది.. అనేదే ఆసక్తికరం. కీలకమైన దాన్ని వదిలేయటంతో సెకండాఫ్ బోర్ గా తయారైంది. అందులోనూ ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ తో చక్కగా నడిపిన దర్శకుడు ఆ ప్లో ని సెకండాఫ్ లో మెయింటైన్ చెయ్యలేకపోయాడు. అలాగే సెకండాఫ్ ని పూర్తిగా హింసతో నింపేయటం కూడా ఇబ్బందికరంగా మారింది. అలాగే... హీరో.. తన వ్యక్తిగత లక్ష్యం కోసం ఒక అమ్మాయిని ప్రేమలో దించి, చివరకు ఆమెను ఆమె మానాన ఆమెను వదిలేయటం కూడా హీరోయిజం అనిపించుకోదు.

  కథ, స్క్రీన్ ప్లే విషయం ప్రక్కన పెడితే... కొరటాల శివ తన బలం అయిన డైలాగులు మాత్రం అదరకొట్టాడు. ‘నువ్వు మా ఊరు రావాలంటే స్కెచ్ వేసుకుని రావాలి. నేను మీ ఊరుకి హ్యంగర్ కు ఉన్న షర్ట్ వేసుకుంటే చాలు' వంటి డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

  సినిమాలో హైలెట్ ఏమిటంటే ప్రభాస్ అని చెప్పాలి. చాలా స్మార్ట్ లుక్స్ తో,ఫార్మల్ వేర్స్ వేసుకుని ఫ్యాన్స్ కు పండుగ చేసాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతని నటనలో మెచ్యూరిటీ కనపుడుతూంటుంది. యాక్షన్, డాన్స్, కామెడీ, సెంటిమెంట్ సీన్స్ ఇలా ప్రతీ ఏమోషన్ ని తడబాటు లేకుండా పలికించాడు.

  సెకండాఫ్ లో వచ్చే అనూష్క పల్లె అమ్మాయిగా, అమాయికత్వం మొహంలో ప్రతిఫలించే ప్రయత్నం చేసింది కానీ... పెద్దదానిలా కొన్ని చోట్ల కనపడింది. ఇదేదో బాగుంది పాటలో మాత్రం ఆమె చాలా బాగా చేసింది.

  సెకండ్ హీరోయిన్ లా కాకుండా రిచా గంగోపాధ్యాయ పాత్ర ఫస్టాఫ్ మొత్తం కనిపించింది. ఓకే అనిపించింది.

  సత్యరాజ్, నదియా, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మానందం, సుబ్బరాజు, నాగినీడు వంటి సీనియర్స్ రెగ్యులర్ గా తమదైన శైలిలో చేసుకుపోయారు. కానీ సుబ్బరాజే కాలేజీ స్టూడెంట్ అంటే కాస్త ఆడ్ గా అనిపించింది. అలాగే కామెడీ పరంగా బ్రహ్మానందం, ప్రభాస్ మద్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ కాకపోయినా థియోటర్ వరకూ నవ్విస్తాయి.

  టెక్నికల్ గా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మిర్చి టైటిల్ సాంగ్ బాగా పేలింది. ఇదోదో బాగుంది కూడా బాగుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే సినిమాకు మరింత బలం చేకూర్చినట్లయ్యేది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫ్లాష్ బ్యాక్ చాలా చాలా ట్రిమ్ చెయ్యాలి.

  సినిమాకు మరో హీరో సినిమాటోగ్రాఫర్ మది అనే చెప్పాలి. సాంగ్ సీక్వెన్స్ లో అద్బుతంగా లొకేషన్స్ ని హైలెట్ చేస్తూ చిత్రీకరించారు. ఇటలీలో సీన్స్ కూడా విజువల్ ట్రీట్ గా మార్చటానికి తన వంతు సాయిం చేసాడు.

  దర్శకుడుగా పరిచయమువుతున్న కొరటాల శివ.. సీనియర్స్ తో నడిచే కాంబినేషన్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేసినా, యాక్షన్ సన్నివేశాలు కూర్చటంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. కామెడీ సన్నివేశాలు మాత్రం బాగానే పండించారు. అయితే వాటిపై ఎక్కువ కాన్సర్టేట్ చెయ్యలేదు.

  ఇంత పాత కథని, పాత పద్దతిలో చెప్పినా చివరి దాకా కూర్చోబెట్టగలిగాడంటే అది హీరో ప్రభాస్ గొప్పతనమే. నిర్మాతలు కూడా కొత్త వారైనా బాగా ఖర్చుపెట్టి రిచెనెస్ తెచ్చారు. ప్రభాస్ ప్యాన్స్ బాగా నచ్చే చిత్రం ఇది.

  సంస్థ: యు.వి.క్రియేషన్స్‌
  నటీనటులు: ప్రభాస్‌, అనుష్క, రిచా గంగోపాధ్యాయ, సంపత్‌, నాగినీడు, బ్రహ్మానందం, రఘుబాబు, రాజేష్‌, హేమ, శ్రీనివాసరెడ్డి, కాశీవిశ్వనాథ్‌, వినోద్‌ తదితరులు.
  సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
  నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌
  దర్శకత్వం: కొరటాల శివ
  విడుదల తేదీ: పిబ్రవరి 8, 2013

  ఏదైమైనా రెబెల్ వంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులకు బాగా నచ్చుతుంది. సెకండాఫ్ మరింత మెరుగుగా చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేది. మాస్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రంలో హింస ఎక్కువ అవటంతో ప్యామిలీలకు కూడా కష్టమనిపిస్తుంది. దర్శకుడుగా మారిన రచయిత శివ.. రొటీన్ స్కీమ్ లతో కాకుండా కాస్త కొత్త తరహా కథాంశంతో వచ్చి ఉంటే బాగుండేది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Mirchi is a romantic action entertainer, which is rich in commercial aspects. Prabhas' electrifying performance is the main highlight of the movie. Koratala Siva's beautiful story and punch dialogues, Devi Sri Prasad's trendy music, Madhi's beautiful picturisation, amazing choreography of dance and action sequences, Brahmanandam and Raghubabu's comedy, beautiful artwork, costumes and locations are the highlights of the movie. The predictable plot with some outdated and cliched scenes and weak climax are its drawbacks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X