twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెగ్యులర్ (‘రెబల్’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    హీరో తండ్రిని విలన్స్ దారుణంగా చంపేస్తారు. అప్పుడు హీరో తన శక్తి యుక్తులన్నీ ఉపయోగించి విలన్ గ్యాంగ్ ని పట్టుకుని చంపేస్తాడు. ఇందులో కొత్తేముంది రెగ్యులర్ కథే, సినిమా పుట్టిననాటి నుంచి ఇలాంటివి ఎన్నో వేల సినిమాలు చూసాం అంటారా... అయితే ఇదీ చూసేయండి... ఓ పనై పోతుంది... అంటూ ముందుకొచ్చిన చిత్రం'రెబల్'. టైటిల్ లోనే 'రెబల్'అని పెట్టుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఏదో ఫవర్ ఫుల్ సినిమా చూడబోతున్నాం అని ఆసక్తి రేపింది. దానికి తగ్గట్లే దర్శకుడు వారిని అలరించేలా ఫైట్స్, పాటలు, కామెడీ అంటూ పూర్తి కమర్షియల్ ఫార్ములాని వెంటేసుకుని ప్యాకేజ్ రెడీ చేసాడు కానీ అందులో అసలైన దినుసు అయిన కథ,కథనం వదిలేసాడు. అయితే ప్రభాస్ మాత్రం తన ఇమేజ్ కు తగ్గట్లే సినిమాను తన భుజాలపై వేసుకుని నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

    సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియా
    నటీనటులు: ప్రభాస్‌, తమన్నా, దీక్షాసేథ్‌, కృష్ణంరాజు, బ్రహ్మానందం, అలీ, సుప్రీత్‌, ముఖేష్ రుషి, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ తదితరులు.
    మాటలు: డార్లింగ్ స్వామి,
    ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్,
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
    ఫైట్స్: రామ్ లక్ష్మణ్,
    ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్,
    ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు,
    కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్,
    నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు,
    కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్
    విడుదల: సెప్టెంబర్ 28,2012.

    రిషి(ప్రభాస్) స్టీఫెన్ రాబర్ట్ అనే మాఫియా డాన్స్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. వారి ఎడ్రస్ ట్రేస్ చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా బ్యాంకాక్ వెళ్లి మరీ వారి అసెస్టెంట్ నాను కూతరు నందిని(తమన్నా)ని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తాడు. ఇంతకీ రిషి అంత డెస్పరేట్ గా స్టీఫెన్ రాబర్డ్ ని వెతకాల్సిన పనేంటి...వారికి అతని కుటుంబానికి సంభందం ఏమిటి...ఇంతకీ రిషి ని రెబెల్ అని ఎందుకు పిలుస్తారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఛత్రపతి ని దాటే సినిమా అవుతుందంటూ ప్రచారం చేసిన ఈ సినిమా ఓ రెగ్యులర్ రొటీన్ మసాలా సినిమాగా కూడా ప్రేక్షకుడుని అలరించటం కష్టమే అనిపిస్తుంది. దానికి కారణం దర్శకుడు లారెన్స్ ఎంచుకున్న కథ,కథనం. తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవటం అనే పురాతనమైన, అతి రెగ్యులర్ కాన్సెప్టుకు అతి సాధారణమైన స్క్రీన్ ప్లే సమకూర్చటంతో సినిమాలో కిక్ లేకుండా పోయింది. అందులోనూ సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా తనకి తెలియని (మనకూ తెలియని) స్టీఫెన్ రాబర్ట్ కోసం హీరో వెతుకులాటే సరిపోతుంది. ఫలానా వాళ్లే విలన్స్, అలాగే వాళ్లు ఎందుకు విలన్స్ అయ్యారు అని తెలిసే సరికే సినిమా ప్రి క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. దాంతో హీరో,విలన్ ముఖాముఖీ పోరాటం కేవలం క్లైమాక్స్ కే పరిమితం అయ్యిపోయింది. దానికి తోడు విలన్ కి సైతం ఫలానా వాడు తన గురించి వెతుకుతున్నాడు అని తెలిసే సరికే సినిమా సీన్ అయిపోతుంది. దాంతో హీరో కు విలన్ వైపు నుంచి ఏ విధమైన అడ్డంకి(ధ్రెట్ ) లేక నిరంతర అన్వేషిలా కూల్ గా తనకు ఎదురేలేదు అన్నట్లు వెతుక్కుంటూ వెళ్తూ సహనానికి పరీక్ష పెడుతూంటాడు. ఇది స్కీన్ ప్లే సమస్యే. అలాగే చాలా చోట్ల హీరోయిజం ఎలివేట్ చేసే ఎలిమెంట్స్ ని పెట్టుకున్నట్లుగా సీన్స్ ని పేర్చుకోలేకపోవటం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.

    ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే అసలు కథకు సంభధం లేకుండా సపరేట్ గా ఉన్న ఫీల్ తెస్తుంది. అదే ఛత్రపతిలో హీరోకి మొదటినుంచి సమస్యలు తన కుటుంబం వైపునుంచి, విలన్స్ వైపు నుంచి ఎదుర్కొంటూ ఇంటర్వెల్ కి వారిపై తిరగబడి..సామాన్యుడు.. ఛత్రపతి అనిపించుకుని జేజేలు కొట్టించుకుంటాడు. ఇక్కడ అదే మిస్సైంది. గాఢ్ ఫాదర్ ని గుర్తు చేసేలా కృష్ణంరాజు పాత్రను మలిచి, అల్ పచినో పాత్రను ప్రభాస్ కి డిజైన్ చేసినట్లుంటుంది. అయితే కృష్ణంరాజు వయస్సు అయిపోవటం వల్లనో,లేక దర్శకుడు సరిగ్గా చూపకో గానీ (పెద్ద)రెబెల్ గా చాలా డల్ గా ఉంటారు. ఆయన పైట్ చేస్తూ యువకులని సైతం చావకొడుతూంటే అస్సలు నమ్మబుద్ది కాదు. ఇక రెబెల్ లా ఆయన ప్లేస్ లోకి వచ్చే ప్రభాస్ వల్ల వారసత్వం మార్పిడి తప్ప కథ లో పెద్దగా ఒరిగిందేమీ కనపడదు. రెబెల్ అనే టైటిల్ మొదట అనుకుని దానిచుట్టూ అల్లుకున్న కథలా అనిపిస్తుంది. ఇక నటీనటుల్లో ప్రభాస్ తన రెగ్యులర్ ఫ్యాన్స్ ని తన ఫైట్స్ తో తృప్తి పరుస్తాడు. తమన్నా డాన్స్ టీచర్ గా బాగా చేసింది. అయితే కొన్ని పాటల్లో ఐటం గర్ల్ లా ఆమె కనిపించటం దర్శకుడు ప్రతిభే(ఐటం సాంగ్ లేని లోటు ఆ రకంగా తీర్చుకున్నట్లున్నాడు).

    ఫస్టాఫ్ లో బ్రహ్మానందం,కోవై సరళ కామెడీ ఓ మాదిరిగా పేలింది. సెకండాఫ్ లో అలీ తో వచ్చే కామెడీ ఫరవాలేదనిపిస్తుంది. దీక్షాసేధ్ పెద్దగా కథకు,కానీ పాత్రకు గానీ ఉపయోగపడలేదు. దర్శకుడుగా లారెన్స్...కేవలం తమన్నా డాన్స్ టీచర్ పాత్రకు మాత్రమే న్యాయం చేయగలిగారు. ఆయన ఇంకా కాంచన నుంచి బయిటకు వచ్చినట్లు లేదు. ఫైట్స్ లో మగాళ్లకు చీరలు కట్టించటం, లేడీ ఫైటర్స్ (రష్యన్) ని వాడటం వంటివి చేసాడు. స్వామి డైలాగుల్లో పంచ్ మిస్సైంది. ఒకటి రెండింటికి మాత్రమే ధియోటర్ లో రెస్పాన్స్ వచ్చింది. ప్రదీప్ రావత్, ముఖేష్ రిషి విలనీ ఓకే. ఈ సినిమాలో లారెన్స్ కొత్తగా ట్రై చేసింది ఏమిటీ అంటే...విలన్స్ కు విచిత్రమైన పేర్లు(ఫారినర్స్ నేమ్స్) పెట్టడం. సినిమా ఏ మాత్రం బాగుంది అనిపించిననా ఆ క్రెడిట్ కేవలం ఫైట్ మాస్టర్స్ కే చెందుతుంది. సినిమా లెంగ్త్ కూడూ ప్రేక్షకుడుకి మరో పరీక్షే. దాదాపు రెండు గంటలు యాభై నిముషాలు ఉంది.

    ఫైనల్ గా రెగ్యులర్ గా ఏదో ఒక సినిమాకు వెళ్ధాం అనుకునే వారిని నిరాసపరచదీ సినిమా. అలా కాకుండా ఏదన్నా కొద్దిగా అయినా ప్రత్యేకత ఆశించి వెళితే మాత్రం అది మీ తప్పే అని మీ ముఖం మీద చెప్పేస్తుంది. అలాగే రెబెల్ గా కృష్ణం రాజుని చాలా కాలం తర్వాత చూడాలనుకున్నవారికి కూడా ఈ సినిమా వారికి విందు భోజనమే. బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడి వారికి నచ్చటం అనే అంశంపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    English summary
    Prabhas's latest movie Rebel, which has been written and directed by Raghava Lawrence released today with divide talk. It is a revenge story. The hype surrounding the movie has soared up to sky high. The trailers, posters and music of the film starring Prabhas, Tamanna Bhatia and Deeksha Seth in leads, have created a lot of craving among the film goers, who cannot wait to watch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X