twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త రీళ్ళలో పాత కథ

    By Staff
    |

    Priyuralu Pilichindi
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ప్రియురాలు పిలిచింది
    నటీనటులు: మమ్ముట్టి, అజిత్‌, టాబు, ఐశ్వర్యరాయ్‌, అబ్బాస్‌
    సంగీతం: ఏ.ఆర్‌.రెహమన్
    నిర్మాత: ఏ.ఎం.రత్నం
    దర్శకత్వం: రాజీవ్‌ మీనన్‌

    పచ్చని పొలాలు, జలపాతాలు, ఉదయం పొగమంచు వీడిన పల్లె అందాలు, ఎడారులు, వర్షంలో తడిసిన అమ్మాయి అందాలు అన్నీ కలగలపి కూర్చిన దృశ్యమాలిక- ప్రియురాలు పిలిచింది. పాత కథను కొత్త రీళ్ళలో చుట్టేందుకు చేసిన దర్శకుని ప్రయత్నం వికటించింది. అందమైన దృశ్యాలు, కెమెరామెన్‌ రవి.కె.చంద్రన్‌ ప్రతిభ తప్ప చిత్రంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. జురాసిక్‌ చిత్రం తరహాలో జలపాతం నుంచి కిందికి పడుతున్న నీటికి అనుగుణంగా హెలికాప్టర్‌ కింద ల్యాండ్‌ సీన్‌ చిత్రించిన తీరు అద్భుతం. అయితే పాత కథను పట్టుకొని సాగదీయడంతో కథనం పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు సమయం, సందర్భం లేకుండా మాటి మాటికీ పాటలను పెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు రాజీవ్‌ మీనన్‌. గతంలో యాడ్‌ ఫిలింమేకర్‌ గా పనిచేసిన రాజీవ్‌ మీనన్‌ ఇంకా ఆ హ్యంగోవర్‌ నుంచి బయటపడనట్లుంది. ఫిక్షర్‌ పరఫెక్ట్‌ దృశ్యాల కోసం శ్రమపడ్డ మీనన్‌ స్క్రీన్‌ ప్లే పై మాత్రం దృష్టి సారించలేదు.

    చిత్రమంతా నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. వారు జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, సుఖాలు, విజయాలు, వైఫల్యాల సమాహారమే- ఈ సినిమా. ఒక ఊళ్ళో పెద్ద ఎస్టేట్‌ యజమానురాలు పద్మ(శ్రీవిద్య) కూతుళ్ళు సౌమ్య (టాబు), మీనాక్షి(ఐశ్వర్యరాయ్‌)లు. ఇద్దరు భిన్న ధ్రువాల్లాంటి వారు. సౌమ్య నిజంగానే సౌమ్యురాలు. ప్రేమ, గీమను నమ్మదు. పెళ్ళి చూపుల్లో తనను చూసి వెళ్ళిన అబ్బాయి చనిపోతాడు. అప్పట్నుంచి సౌమ్య నష్టజాతకురాలు అన్న ముద్ర పడుతుంది. ఇక ఏ సంబంధాలూ రావు తనకి. వాళ్ళ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసుకుంటూ, కాలేజి ప్రిన్సిపాల్‌ గా పనిచేస్తుంటుంది. మీనాక్షి ప్రేమ పిపాసకురాలు. కవిత్వాన్ని తెగ ఇష్టపడే భావకురాలు. ఎవరో ఓ గాంధార్వుడు, మెరుపు లాగా వచ్చి తనను చుట్టేసి కట్టుకుంటాడని కలలుగంటుంది. అజిత్‌ అసిస్టెంట్‌ డైరక్టర్‌. డైరక్టరయి, హాలీవుడ్‌ లెవల్లో సినిమా తీయాలని కష్టపడుతుంటాడు. ఓ సినిమా షూటింగ్‌ కు లొకేషన్‌ కోసం వెతుక్కుంటూ - టాబు వాళ్ళ ఎస్టేటుకు వస్తాడు. మొదటి చూపులోనే అజిత్‌ ప్రేమలో పడుతాడు. టాబు కూడా తనని ప్రేమించేట్టుగా ఒప్పిస్తాడు. తాను మొదటి సినిమా తీసిన తర్వాత పెళ్ళిచేసుకుంటానని చెప్పి మద్రాస్‌ పయనమవుతాడు.( సినిమా పరంగా హైదరాబాద్‌ అనుకొండి).

    యుద్ధంలో ఒక కాలును కోల్పోయిన మేజర్‌ మమ్ముట్టి మీనాక్షిని ప్రేమిస్తుంటాడు. మీనాక్షి పాటలంటే మమ్ముట్టికి చాల ఇష్టం. కానీ మన భావకురాలు ఓ వర్షం కురుస్తున్న సమయాన ప్రకృతిని ఆరాధిస్తుంటే- అబ్బాస్‌ అనే గాంధర్వుడు మెరుపులా చుట్టేసి వాళ్ళింటికి తీసుకువెళుతాడు( ఇలాంటి క్రేజి సంఘటనలు సినిమాల్లోనే జరుగుతుంటాయి). శ్రీవిద్య వాళ్ళ నాన్న చనిపోతూ ఎస్టేట్‌ ను తనయుడు నిళల్‌ గల్‌ రవి పేర వీలునామా రాస్తాడు. దీంతో పరిస్థితి తారుమారైన శ్రీవిద్య కూతుళ్ళతో కలిసి హైదరాబాద్‌ వెళ్ళి సెటిలవుతుంది. టాబు ఓ సాప్ట్‌ వేర్‌ కంపెనీలో రిసెప్షనిస్ట్‌ గా జాయనవుతుంది. ఐశ్వర్య మేజర్‌ సాయంతో ఓ మ్యూజిక్‌ కాలేజిలో లెక్చరర్‌ గా చేరుతుంది. అజిత్‌ అష్టకష్టాలు పడి టాప్‌ స్టార్‌ నందినీ వర్మ( పూజాబాత్రా)తో సినిమా తీస్తాడు. నందినీ తో అజిత్‌ వ్యవహారాన్ని నడుపుతున్నాడన్న పత్రికల్లో గాసిప్‌ లు చూసి టాబు- అజిత్‌ కు దూరంగా ఉండడం మొదలుపడుతుంది. మరోవైపు, ఫైనాన్స్‌ కంపెనీ నడుపుతున్న అబ్బాస్‌ నష్టాలపాలై బోర్డు తిప్పేస్తాడు.

    డిపాజిటర్లు నుంచి తప్పించుకొని తిరుగుతున్న అబ్బాస్‌ ను, ఐశ్వర్యను మమ్ముట్టి మళ్ళీ ఒకటి చేస్తాడు. అయితే అప్పులిచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ ఎమ్మెల్యే కూతురును అబ్బాస్‌ పెళ్ళిచేసుకుంటాడు. దీంతో షాక్‌ తిన్న ఐశ్వర్య వర్షంలో తడుచుకుంటూ నడిచి వెళ్తూ మ్యాన్‌ హోల్‌ లో పడి ఆస్పత్రిపాలవుతుంది. తను గాయని అయ్యేందుకు తోడ్పడమే కాకుండా, ఆస్పత్రిలో తనకు సేవలు చేసిన మమ్ముటినే పెళ్ళి చేసుకుంటుంది. అపార్థాలన్నీ తొలగిపోయాక అజిత్‌, టాబులు పెళ్ళి చేసుకుంటారు.

    చిత్రంలో ప్రధాన లోపం తమిళ వాసన. ప్రతి సన్నివేశం- డబ్బింగ్‌ చిత్రమన్న విషయాన్ని గుర్తుకుతెస్తుంది. డబ్బింగ్‌ క్వాలిటీ అసలు బాగలేదు. లిప్‌ సింక్‌ ఏ మాత్రం కుదరలేదు. పైగా కృతకమైన భాష. ఐశ్వర్యరాయ్‌ మినహా ఎవరి నటన అంతగా ఆకట్టుకోదు. మమ్ముట్టి, టాబు, అజిత్‌ లాంటి మంచి నటుల నుంచి రాజీవ్‌ మీనన్‌ నటనను రాబట్టుకోలేపోయాడు. ఈ చిత్రం చూడకపోతే నష్టమేమీ లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X