For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పందెం కాయచ్చు... ('రేసుగుర్రం' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  3.0/5
  ---సూర్య ప్రకాష్ జోస్యుల

  యాక్షన్ ఎంటర్టైనర్ , మైండ్ గేమ్, బ్రహ్మానందం అనే మూడు అంశాల చుట్టూ ఎడతెగకుండా తిరుగుతున్న తెలుగు పరిశ్రమ ...'అత్తారింటికి దారేది' తో ఫ్యామిలీ ప్రేక్షకుల వైపు టర్న్ తీసుకుంది. దాంతో అటు ఫ్యామిలను రాబడుతూనే, ఫ్యాన్స్ ని, మాస్ ప్రేక్షకులను అలరించేలా తెలుగు సినిమా రూపొందించటం దర్శకులుకు టాస్క్ గా మారింది. మరో ప్రక్క అల్లు అర్జున్ గత కొంతకాలంగా కేవలం డాన్స్ లు,స్టైల్ మీదే కాకుండా మిగతా ఎలిమెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి తన మార్కెట్ విస్తరించుకుంటున్నాడు. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని ట్రెండ్ ని వదలకుండా...కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మానందంని దింపి, అన్నదమ్ముల అనబంధం అనే ఫ్యామిలీ మసాలా దినుసు వేసి మరీ సురేంద్రరెడ్డి వండిన వంటకమే ఈ చిత్రం. కథలో కొత్తదనం ..ఊహించని ట్విస్ట్ లు లేకపోయినా...రెండు గంటల సేపు ఎంటర్ట్నైన్ చేయటంలో సఫలీకృతమయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో బ్రహ్మానందం, అలీతో చేసిన కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ గుర్రం మీద పందెం కాయచ్చు... టిక్కెట్ డబ్బుకు తగ్గ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అనే భరోసా కలిపించింది.

  అన్నదమ్ములైన రామ్(శ్యామ్),లక్ష్మణ్ అలియాస్ లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ఎసిపి గా ఎదిగిన రామ్ ... తన నిజాయితీతో లోకల్ రాజకీయనాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదిస్తాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు. తన అన్నను ఎలా ఆ కుటిల రాజకీయనాయకుడు నుంచి రక్షించాడు...ఆ క్రమంలో కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం) ఎలా ఉపయోగపడ్డాడు అన్నది మిగతా కథ. అలాగే...లక్కీ తొలిచూపులోనే ప్రేమలో పడిన స్పందన(శృతి హాసన్)ని ఎలా దక్కించుకున్నాడు...సినిమాలో సలోని పాత్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  స్టోరీ లైన్ గా సునీల్, నాగచైతన్య నటించిన 'తడాఖా' గుర్తుకు వచ్చినా దాన్ని విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్, కామెడీ సన్నివేశాలతో మైమరిపించగలిగారు. ఫక్తు కామెడీ వ్యవహారం కావటంతో ట్విస్ట్ లు లేకపోవటమే కలిసివచ్చింది. 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించాలన్న దర్శకుడు నిర్ణయం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం మరోసారి విజృంభించాడు. అలీ.. 'బాలీ ఫ్రమ్ మలేషియా'(కిక్ లో పాత్ర కంటిన్యూషన్) గా బాగా నవ్వించాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు. అయితే ఇంటర్వెల్ ఫైట్ లెంగ్త్ మరింత ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. అలాగే ఫస్టాప్ లో కొన్ని డల్ మూవ్ మెంట్స్ ని సైతం తొలిగిస్తే బాగుండేది.

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

  ఇదే సినిమాకు బలం

  ఇదే సినిమాకు బలం

  ఈ సినిమాకు ప్రధాన బలం...అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్, బ్రహ్మానందం కామెడీ. సురేంద్రరెడ్డి ఈ రెండిటినీ ఫెరఫెక్ట్ గా మిక్స్ చేస్తూ సినిమాని లాక్కొచ్చాడు. రిపీట్ ఆడియన్స్ కు కూడా కామెడీనే ఉపయోగపడేటట్లు ఉంది.

  వీక్ పాయింట్స్...

  వీక్ పాయింట్స్...

  ఎప్పుడు గొడవలు పడే అన్నదమ్ములు కథగా మొదలై...చివరకు అన్నను రక్షించి, అన్నదమ్ముల అనుబంధం అంశంతో ముగిసే కథనాలు తెలుగులో ఇప్పటికే బోల్డు చూసాం. అలాగే రెగ్యులర్ సురేంద్ర రెడ్డి నుంచి ఆశించి ...ట్విస్ట్ లు లేవు. అలాగే పబ్లిసిటీ వైజ్ గానూ ఎందుకనో నిర్మాతలు పూర్తి దృష్టి పెట్టలేదనిపిస్తోంది. జనాల దృష్టి సినిమాలపై లేని ఎలక్షన్ సీజన్ ఇది. ఐపీఎల్ సీజన్ కూడా మొదలవుతోంది.

  కలిసివచ్చే అంశం :

  కలిసివచ్చే అంశం :

  వేసవి శెలవలు సీజన్ కావటం, ఫ్యామిలీలు వెళ్లగలిగే ఎంటర్టైనర్ కావటం, లెజండ్ బిజినెస్ దాదాపు పూర్తై పోటీ లేకపోవటం కలిసివచ్చే అంశాలు. ముఖ్యంగా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు చిత్రాన్ని డిజైన్ చేయటం కూడా ప్లస్ అయ్యింది.

  అల్లు అర్జున్ అదుర్స్

  అల్లు అర్జున్ అదుర్స్

  స్టైల్ కి ప్రతిరూపంలా కనిపించే అల్లు అర్జున్ మరోసారి తనలోని ఎనర్జీని పూర్తిగా వినియోగించి మరీ క్యారెక్టర్ కి నిండుతనం తెచ్చాడు. తన అన్నతో గొడవపడేటప్పుడు మన ఇంట్లో కుర్రాడిలా ఎలా ఉన్నాడో...విలన్ తో టగ్ ఆఫ్ వార్ సీన్స్ లో అంత సీరియస్ గా అదరకొట్టాడు. పాత్ర,ఎమోషన్స్ పరంగా గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గుర్తుకు వచ్చాడు. పోలీస్ గా కొద్ది సేపే ఉన్నా...గుర్తుండిపోయాలా కుదిరాయి సీన్స్.

  శృతిహాసన్

  శృతిహాసన్

  స్పందనగా...ఎప్పుడూ మెడిటేట్ చేసుకుంటూ..ఎమోషన్స్ ని ఓపెన్ గా చెప్పని పాత్రలో శృతి హాసన్ ఇమిడిపోయిందనే చెప్పాలి. అలాగే శృతి హాసన్ తన గ్లామర్ ని వెండి తెరపై ప్రవహింపచేసిందనే చెప్పాలి. ఆమె క్యారెక్టర్ సైతం చాలా డిఫెరెంట్ గా డిజైన్ చేసారు. తండ్రి ప్రకాష్ రాజ్ వచ్చే సీన్స్, బన్నీతో వచ్చే రొమాంటిక్ సీన్స్ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ పండించింది.

  కొత్త విలన్..పాత విలనీ

  కొత్త విలన్..పాత విలనీ

  భోజపురి సూపర్ స్టార్ రవికిషన్ ఈ చిత్రంతో విలన్ గా పరిచయమయ్యాడు. శివారెడ్డి గా ఆయన ఫెరఫెక్ట్ గా మాచ్ అయ్యాడు కానీ ఆయన్ని నెగిటివ్ గా ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ మాత్రం కాస్త పాతకాలంవి కావటం జరిగింది. అలాగే సెకండాఫ్ లో వచ్చే విలన్ అన్న ముఖేష్ రుషి సైతం ఎప్పటిలాగే డైలాగ్స్, మ్యానరిజంస్ తో అదరకొట్టాడు.

  మిగతా పాత్రలు..

  మిగతా పాత్రలు..

  సినిమాలోని మిగతా పాత్రల్లో తణికెళ్ల భరణి, ప్రగతి,ఎమ్ఎస్ నారాయణ, పవిత్ర, రఘుబాబు వంటి వారు ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోయినా,తాము చేసిన పాత్రకు న్యాయం చేసారు. సలోని గురించి పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేదు. పోసాని పాత్రకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది.

  బ్రహ్మీ, అలీ

  బ్రహ్మీ, అలీ

  బ్రహ్మానందం, అలీ మరోసారి తమ విశ్వరూపం చూపించారు. వారు లేకపోతే ఈ సినిమా సెకండాఫ్ లేదు అన్నంతగా సినిమాని లాక్కెళ్లిపోయారు. ముఖ్యంగా బ్రహ్మానందం కిల్ బిల్ పాండేగా దాదాపు ఇరవై నిముషాలు పాటు సినిమాని అలా పట్టుకుని నిలబెట్టాడు. సురేంద్ర రెడ్డి తనలోని కామెడీ పంచ్ ని కిక్ తర్వాత మరోసారి రుచి చూపించారు.

  పాటలు...కొరియోగ్రఫీ

  పాటలు...కొరియోగ్రఫీ

  రిలీజుకు ముందే హిట్టైన సినిమా చూపిస్తా మామ పాట...ఆడియో పంరగానే కాక కొరియోగ్రఫీగానూ చాలా బాగా డిజైన్ చేసారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. బన్నీ డాన్స్ లు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు కాబట్టి ప్రస్దావించటం లేదు.

  రాంగ్ ప్లేస్ మెంట్...

  రాంగ్ ప్లేస్ మెంట్...

  సినిమా మైనస్ లలో పాటల ప్లేస్ మెంట్ ఒకటిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే 'గల గల...' పాట, 'డౌన్ డుప్పా డౌన్' పాట రెండూ రాంగ్ ప్లేస్ మెంట్ అనిపిస్తాయి. పాటలు తియ్యటం రిచ్ గా,స్టైల్ గా తీసినా కథనంకు అడ్డు వచ్చిన ఫీలింగ్ వచ్చింది.

  టెక్నికల్ గా...

  టెక్నికల్ గా...

  ఈ సినిమాకు మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం మేజర్ గా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ...ఫస్టాఫ్ లో మరింత షార్ప్ గా చేస్తే బాగుండను అనిపించింది. ఇక తమన్ పాటల కన్నా....బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ముఖ్యంగా బూచాడే..బూచాడే ట్రాక్ హాంట్ చేస్తోంది. డైలాగులు కూడా బాగున్నాయి.

  ఎవరెవరు

  ఎవరెవరు

  బ్యానర్ :శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
  నటీనటులు: అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని, కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు
  రచన: వక్కంతం వంశీ,
  కెమెరా: మనోజ్ పరమహంస,
  సాహిత్యం: చంద్రబోస్, వరికుప్పల యాదగిరి, విశ్వ
  సంగీతం: ఎస్.తమన్,
  కూర్పు: గౌతంరాజు,
  నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు,
  విడుదల తేదీ: 11, ఏప్రియల్ 2014

  జూలాయి,కిక్,తడాఖా కలిపినట్లున్న ఈ చిత్రం ఏ మాత్రం ఢోకా లేని వినోదాన్ని ఇస్తుంది. మితి మీరిన హింస, అసభ్యత లేకపోవటంతో ఫ్యామిలీలకు మంచి ఆప్షన్. ఫైనల్ గా అల్లు అర్జున్...ద్యాముడా(దేముడా) అనే ఊతపతం చెప్పే విధానం కోసమైనా చూడొచ్చు.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Race Gurram is a big-ticket commercial entertainer released today with hit talk, which has been produced by Nallamalapu Srinivas (Bujji) and Dr Venkateswara Rao under the banner of Sri Lakshmi Narasimha Productions. Race Gurram has made in Bunny's regular style and it has all masala ingredients like romance, action, comedy, music, dance, beautiful locales and trendy costumes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X