twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీత తప్పిన 'రాధాగోపాళం'

    By Staff
    |

    Radhagopalam
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    ిసినిమా: రాధాగోపాళం
    నటీనటులు: శ్రీకాంత్‌, స్నేహ, రంగనాథ్‌, బ్రహ్మానందం,
    ఎవియస్‌, రావి కొండలరావు, రాళ్లపల్లి, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు
    కథ, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ
    స్క్రీన్‌ప్లే: ముళ్లపూడి వెంకటరమణ
    పాటలు: జొన్నవిత్తుల, వేటూరి, రమణ
    సంగీతం: మణిశర్మ
    ఛాయాగ్రహణం: పి. ఆర్‌.కె. రాజు
    ఎడిటింగ్‌: కె.యన్‌. రాజు
    నిర్మాత: కె. అనిల్‌కుమార్‌
    దర్శకత్వం: బాపు
    విడుదల తేదీ: 24-2-2005

    భార్యాభర్తల్లో ఎవరు గొప్పవారు, ఇద్దరూ సమానమే అనే మాటలు సమాజంలో చెల్లుబాటవుతాయా? ఈ ప్రశ్న ప్రతి సంపారంలో తలెత్తుతున్న ప్రస్తుత సమయంలో బాపు రమణల రాధాగోపాళం రావడం సమంజసమే. కానీ తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విరామానంతరం బాపు తీసిన చిత్రం పాత చిత్రాల రేంజ్‌లో ఉండకపోవడం వల్ల అభిమానులను తీవ్ర నిరాశకు లోను చేస్తుంది.

    కథ ప్రకారం అనగనగా ఓ రాధమ్మ (స్నేహ). తపస్సు చేసి ఆమెను గెలుచుకున్న గోపాలం (శ్రీకాంత్‌). వారి సరదాల సంసారం సాగనివ్వకుండా గోపాలంలోని మగాడు అప్పుడప్పుడు బయటకు వచ్చి పురుషాహంకారం ప్రదర్శించబోయే బోల్తా పడి బోరుమంటుంటాడు.

    అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయిన గోపాలం తన భార్యను లా చదివించి తనలా లాయర్‌ను చేస్తాడు. ఓ రోజు వచ్చిన ఓ కేసును వాదించడానికి ఇరు వైపులా భార్యాభర్తలిద్దరూ వకాల్తా పుచ్చుకుంటారు. ఆ కేసులో వేణుమాధవ్‌ తన భార్య దివ్యవాణిని పక్కన పెట్టి వేరే అమ్మాయి జ్యోతితో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం తెలిసిన దివ్యవాణి వేణుమాధవ్‌పై చేయి చేసుకుంటుంది. కోపం వచ్చిన వేణుమాధవ్‌ భార్యపై కేసు పెట్టి గోపాలాన్ని లాయర్‌గా పెట్టుకుంటే, దివ్యవాణి తరఫున వాదించడానికి రాధ సిద్ధపడుతంది. ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు - కేసు వదులుకోమని రాధమ్మను గోపాలం బెదిరించడం - ఆ కేసు విషయంలో ఇరువురి వుధ్య గొడవలు చెలరేగి సంసారం చిక్కుల పాలవుతుంది. ఈ గొడవలకు ఆజ్యం పోసినట్లు రాధమ్మ ఫ్లాష్‌బ్యాక్‌లోని షాకింగ్‌ వార్త తెలిసి గోపాలం ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆమెను మరింత మానసిక హింసకు గురి చేస్తాడు. ఈ పరిస్థితిలో రాధమ్మ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కేసు వదులుకుంటుందా, కేసు వదలకపోతే విడాకులు తప్పవనే గోపాలం చేశాడు అనేవి తెరపై చూడాల్సిందే.

    బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరాముడికి బదులు కృష్ణుడు దర్శనమివ్వడం ఒక ప్రత్యేకత. బాపు మార్కు శృంగార, హాస్య సన్నివేశాలు ఆహ్లాదపరుస్తాయి. స్నేహ డైరీని శ్రీకాంత్‌ అనుమానంతో దొంగచాటుగా చూసే సీన్‌ బాగా పండింది. రాధమ్మనిచ్చి పెళ్లి చేస్తాను గానీ తేడా వచ్చిందో అని ప్రతిసారీ బెదిరించే భగవాన్‌ కృష్ణుడి పాత్ర తెలుగు సినిమాకు కొత్త. స్నేహ మొదటి సారి కోర్టుకు వెళ్లేటప్పుడు చీర కట్టుకుని వెళ్లమనే బామ్మ డైలాగ్‌ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. శ్రీకాంత్‌, స్నేహలు తమ పాత్రలను చక్కగానే పోషించారు. 'వాలు జడ' పాట బాగుంది. సంగీతం రక్తి కట్టిస్తుంది.

    ఇంటర్వెల్‌ వరకు కథలో ఉన్న శ్రీకాంత్‌, స్నేహల రెండు పాత్రలనే ఎస్టాబ్లిష్‌ చేయడానికే సమయం సరిపోవడంతో కథలో రావాల్సిన మలుపు రాక బోర్‌ ఫీలింగ్‌ వస్తుంది. సినిమాలో కామెడీ క్యారెక్టర్లను పక్కన పెడితే శ్రీకాంత్‌, స్నేహలే ఇద్దరే ఇంటి సీన్లు, కోర్టు సీన్లు ఒకదాని తర్వాత ఒకటి రావడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. సినిమాకు కీలకమైన క్లైమాక్స్‌ తేలిపోవడం విజయానికి దూరం చేస్తుంది. బ్రహ్మానందం స్నేహ దగ్గర పని చేసే గుమాస్తా అంటారు గానీ ఇద్దరూ కలిసే ఒక్క సీను కూడా లేదు. బ్రహ్మానందం ఒప్పుకునే అన్యాయమైన కేసులు స్నేహ వాదిస్తుందనేది ఆమె పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బ తీసింది.

    అజాగ్రత్తతో ఒక ప్రధానమైన పొరపాటు బాపు నుంచి జరగడం విచారకరం. ఒక కేసులో సాక్ష్యం ఇవ్వడానికి రాధమ్మ ఒక రోజు నాన్నగారి ఊరికి వెళ్తుంది. అక్కడ సాక్ష్యం ఇచ్చేసి, అందరి మెప్పులు పొంది మర్నాడు ఆమె తిరిగి వస్తుంది. రాధమ్మకు ఒక రోజంతా గడిచిపోతే గోపాలం పాత్రకు ఒక రోజు కూడా గడవకపోవడం ప్రేక్షకులకు ఇట్టే దొరికిపోతుంది. గోపాలం ఉన్న సన్నివేశం మనకు ఆ విషయాన్ని పట్టిస్తుంది.

    బాపు, రమణల సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూసిన అభిమానులకు 'రాధాగోపాళం' ఏ మాత్రం రుచించే స్థాయిలో లేకపోవడం విచారకరం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X