For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చిపోయిన రాజావారు..(రివ్యూ)

  By Staff
  |

  -జోశ్యుల సూర్య ప్రకాష్
  చిత్రం: రాజావారి చేపల చెరువు
  బ్యానర్: లక్ష్మీ గణపతి ఫిలింస్
  నటీనటులు: పోసాని కృష్ణ మురళి, గైనా, జుబైన్ ఖాన్, బృహ్మానందం, అలీ,
  కోట శ్రీనివాసరావు, రఘుబాబు, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, సునీల్,
  వేణు మాధవ్, గిరిబాబు, కొండవలస, బ్రహ్మాజీ, ఈటీవి ప్రభాకర్, సన తదితరులు.
  సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  నిర్మాతలు: వై రూపేష్, బి.సుబ్రమణ్యం
  కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి
  రిలీజ్ డేట్: 15, మే 2009

  నాకు లంచంగా నీ పెళ్లాం కావాలి, ఓటున్న రిక్షావాడూ మెగాస్టారే ,చూసింది గోరంత,చూడాల్సింది కొండత వంటి వ్యంగ్య పూరిత డైలాగులుతో పోసాని ఈ సారి ముందుకొచ్చాడు.కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా,ప్రజారాజ్యం ప్రచార చిత్రంగా సినిమా తీసారంటూ ప్రచారం జరిగిన 'రాజావారి చేపల చెరువు' అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ (అటువంటివేమీ లేకుండా)ఈ రోజు రాష్ట్ర మంతటా రిలీజైంది. అందులోనూ పోసాని రాజకీయాల్లోకి రావటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తారని అంతా ఆశించారు.కానీ ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం రకరకాల కారణాలతో ఎలక్షన్ రిజల్టుకు ఒక రోజు ముందు రిలీజైంది. ఇక గత చిత్రం మెంటల్ కృష్ణలా మెంటలెత్తించకుండా ఈ సినిమా పూర్తి గ్రిప్ తో పోసాని తీసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయటం విశేషం. అయితే ఫస్టాఫ్ ఒక పాయింట్ తోనూ, సెకెండాఫ్ మరో విధంగానూ సాగటం ఈ చిత్రంలో మరో విచిత్రం. అయినా ఎక్కడా బోర్ కొట్టకపోవటం, స్పీడ్ నేరేషన్, పదునైన సంభాషణలు ఈ సినిమాకు ప్లస్సు అవుతాయనటంలో సందేహం లేదు.

  'ఆపరేషన్ దుర్యోధన'ను గుర్తు చేసేలా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తనను ఇబ్బంది పెట్టిన పై అధికారులకు, రాజకీయనాయకులకు తెలివిగా బుద్ది చెప్పటమే ఈ చిత్ర కధాంశం. లోకల్ ఎమ్మల్యే తమ్ముడు తనను రిజెక్టెడ్ చేసినందుకు ఓ అమ్మాయి కళ్ళు పోగెడతాడు. అవినీతిని సహించలేని పవర్ ఫుల్ ఎస్సై రాజా(పోసాని) ఆ కేసును టేకప్ చేస్తాడు. ఎమ్మల్యే తమ్ముడు(కళ్ళు పోగెట్టాడని)అతని కళ్ళు బలవంతంగా తీసి ఆ అమ్మాయికి పెట్టించి న్యాయం చేస్తాడు. దాంతో పగపట్టిన ఎమ్మల్యే..రాజా ఉద్యోగాన్ని, అతని భార్య(గైనా) గర్భకోశాన్ని తీసేసి పగ తీర్చుకుంటాడు. ఆ స్ధితిలో రాజా బ్రతుకు తెరువు కోసం ఎందరికో లంచాలు అవీ ఇచ్చి ఓ చేపల చెరువు పెట్టుకుంటాడు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న స్ధితిలో తన అందమైన చేపలు చెరువును ఎవరో కిడ్నాప్ చేసారంటూ రాజా పోలీస్ స్టేషన్ కి వెళతాడు. వాళ్ళు ఆ కేసు నమోదు చేసుకోరు. అప్పుడు మీడియా వారి సాయంతో ఆ కేసును రిజస్టర్ చేస్తాడు. ఆ తర్వాత ఆ చేపల చెరువు ని ఎవరు కిడ్నాప్ చేసారు..పోలీసులు పట్టుకోలగిలిగారా..అసలేం జరిగింది అనేది మిగతా కథ.

  ఫస్టాఫ్ మొత్తం పోలీస్ ఎపిసోడ్స్ తో స్పీడుగా వెళ్ళిపోయిన కథనం సెకెండాఫ్ లో చేపల చెరువు మాయిమైందంటూ మలుపు తిరుగుతుంది. అందులోనూ శత్రవు చిత్రలో (బిల్డింగ్ కట్టకుండా కట్టామని చూపిన విలన్స్ పై ఆ బిల్డింగ్ కూలిపోయి పిల్లలు చనిపోయారని హీరో కేసు వేయటం)చూపిన లాజిక్ లాంటిదే ఇందులోనూ చూపి నవ్వులు పూయించాడు పోసాని. అయితే కథలో కీలకమైన ఈ మలుపు సెకెండాఫ్ వరకూ రాకపోవటం లోపమనిపించినా తన పదునైన సంభాషణలతో, వ్యంగ్యంతో దాన్ని అధిగమించారు. అలాగే 'భగవంతుడి పాలన'(వైయస్ ప్రభుత్వంపై),జనం టీవీలు లంచం తీసుకుంటారు(టీడీపి) వంటి డైలాగులు అని డైలాగు రాసినా ఎక్కువ చురకలు వెయ్యలేదు. కానీ చిరంజీవిని గుర్తు చేసేలా మొగల్తూరు శివప్రసాద్(గిరిబాబు)అనే పాత్రను ప్రవేశపెట్టాడు. ఆయనో నిజాయితీ పరుడని, కొత్తగా పార్టీ పెడుతున్నారని,రక్తదానాలు అవీ చేసిన అబిమానులున్నారని, అతని కుటుంబంలో చెల్లెలు(శ్రీజను గుర్తు చేయటం) వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందని,అతని కొడుకు,కోడలు కుటుంబపరమైన గొడవలతో విడిపోయాని(పవన్ వివాహాన్ని గుర్తు చేస్తూ) డైలాగులు పెట్టాడు. ప్రక్క పార్టీ వాళ్ళు శివప్రసాద్ కుటుంబ విషయాలు ఎత్తటాన్ని తప్పు అని చెప్పించాడు. ఇక క్లైమాక్స్ కాస్త వీక్ గా ఉండటం ఈ సినిమాలో మరో ఇబ్బందికర అంశం.

  ప్లస్ లలో పబ్లిక్ గా రేప్ చేస్తానంటూ బెదిరించిన విలన్ రఘుబాబు ని అలా రేప్ చేయి అంటూ రోడ్డుపై ప్రక్క వేసి ఆ అమ్మాయిని తీసుకువచ్చి బెదిరించే సీన్ బాగుంది. అలాగే తన పై అధికారి ఇలా తిక్కగా వెళితే సస్పెండు చేస్తానన్నప్పుడు పోసాని తాను టెన్షన్ భరిస్తూ ఉద్యోగం చేయలేనని వారి ఎదురుగానే బట్టలు విప్పే సీన్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చింది. టీవీ9 ప్రయోక్త రజనీకాంత్ ని అనుకరిస్తూ గజనీ కాంత్ (సునీల్) అంటూ,'చూసింది గోరంత,చూడాల్సింది కొండత' అంటూ మరో టీవీ ఛానెల్ వారి ట్యాగ్ లైన్ ని సైటర్ చెయ్యటం బాగుంది. ఓటున్న రిక్షావాడు మెగాస్టారే, నీకేం లంచం కావాలి అంటే నీ పెళ్లాం కావాలి అనే డైలాగులు టప్పట్లు కొట్టించుకున్నాయి. అంతేగాక కాస్ట్ ఫీలింగ్ గురించి వెటకారంగా కోట చేత చెప్పించిన డైలాగులు పేలాయి. మరో ప్రక్క వేణు మాధవ్ పాత్ర చేత ప్రతీ సారి నా కులం ..నా కులం అనిపించి కుల పిచ్చోళ్ళుకు చురకలు అంటించారు. ఇక బ్రహ్మానందం పాత్ర నవ్విస్తే...అలీ పాత్ర పెద్దగా పేలలేదు. బ్రోకర్ గా కృష్ణ భగవాన్ ఎప్పటి లాగే చేసాడు. ఇక పోసాని కొన్ని చోట్ల సాయికుమార్ ఆవేశం గా బిహేవ్ చేసే పాత్రలను గుర్తు చేసారు. హీరోయిన్ గా చేసిన కొత్త అమ్మాయి ఫేస్ లో ఫీలింగ్ లు లేకపోయినా అందాలు ప్రదర్నన బాగానే చేసింది.పాటలు రెండే కాబట్టి ఇబ్బది లేదు. కెమెరా, ఎడిటింగ్ దర్శకత్వంకి తగనిట్లే ఉన్నాయి.

  సెకెండాఫ్ డ్రాగై, క్లైమాక్స్ వీకైనా డైలాగుల అండతో పోసానీ ఈ సినిమాను లాగేస్తాడనిపిస్తుంది. ముఖ్యంగా బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని నిరాశపరచదు. అలాగే పోసాని గత చిత్రాలు కన్నా ఈ చిత్రం చాలా నీట్ గా, నస లేకుండాఉండటం మరో కలిసి వచ్చే అంశం. కాబట్టి ఒకసారి రాజుగారి చేపల్ని చక్కగా పలకరించి ప్రస్తుత రాజకీయాల్ని మరో సారి గుర్తు చేసుకుని అందులో మన పాత్ర తలుచుకుని బయిటకు రావచ్చు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X