»   » జ్యూస్ తీసారు('ఆరెంజ్' రివ్యూ)

జ్యూస్ తీసారు('ఆరెంజ్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating
Rating
జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: అంజనా ప్రొడక్షన్స్
తారాగణం: రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకష్ రాజ్ తదితరులు
కెమెరా: కిరణ్ రెడ్డి
ఆర్ట్: ఆనంద్ సాయి
మాటలు: తోట ప్రసాద్
పైట్స్: పీటర్ హెయన్స్
కొరియోగ్రపీ: బాస్కో కైజార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: హ్యారీస్ జయరాజ్
నిర్మాత: కె. నాగేంద్ర బాబు
కధ, స్క్రీన్,ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్

"మగధీర" వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయో తెలిసే భాస్కర్ కి అప్పచెప్పారంటే ఆ కథ ఓ రేంజిలో ఉండి ఉంటుందని అందరూ ఎంతో ఎక్సపెక్ట్ చేసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆరెంజ్ ఓ రేంజి వాదోపవాదాలతో ధియోటర్స్ లో దిగింది. అప్పటికీ అన్ని వర్గాలను ఆకర్షించాలనేమో గాని అనవరసరమైన ఫైట్స్, కథకు సంభంధం లేని బ్రహ్మనందం కామిడీ వంటి మషాలాలు కలిపారు. కానీ విషయం తక్కువ అవటంతో విశ్లేషణ ఎక్కువై విసుగు తెప్పించింది. ఎత్తుకున్న పాయింట్ పై దర్శకుడు కన్ఫూజన్ మొత్తం ప్రేక్షకుడుకి మెగా కన్ఫూజన్ గా మారిపోయింది. రామ్ చరణ్ కొత్త లుక్ తో కనపించటం,పాటలు ఈ సినిమాని ఆ మాత్రమైనా భరించేలా చేసాయి.

జీవితాంతం ఒకే వ్యక్తితో ప్రేమలో ఉండటం అనేది అబద్దమని,ఎప్పుడూ ఎవరో ఒక కొత్త అమ్మాయిలని వెతుక్కునే కుర్రాడు రామ్ (రామ్ చరణ్). సిడ్నీ(ఆస్ట్రేలియా) లో గ్రాఫిటీ ఆర్టిస్టు అయిన అతను తాను నమ్మిన ఫిలాసపీని ప్రమోట్ చేసుకుంటూ రెగ్యులర్ గా అమ్మాయిలతో ప్రేమలో పడుతూ లేస్తూ హ్యాపీగా గడిపిస్తూంటాడు.తొమ్మిది మందితో ప్రేమాయణాలు పూర్తి చేసిన అతనికి పదో అమ్మాయిగా పూర్తి భిన్నమైన జానికి(జెనీలియా) పరిచయం అవుతుంది. మొదట్లో ప్రేమలో పడినా ఆ తర్వాత అతని మెంటాలిటీని జీర్ణించుకోలేక విడిపోతుంది. ప్రేమించే వ్యక్తిని అలా చేయి..ఇలా ఉండు అని చెప్పటమే తప్పని వాదించే రామ్ ఆ స్ధితిలో ఏం నిర్ణయం తీసుకున్నాడు..వారిద్దరూ ఎలా కలిసారనేది మిగతా కథ.

Orange Movie Review in English

ప్రేమికుల్లో ఒకరు అవతల వారిని ఇలాంటి ఉద్యోగం చేయి..నీ స్నేహితులను వదిలేయి. ఈ ఆటే ఆడు వంటి కండిషన్స్ పెడితే లైఫ్ లాంగ్ భరించటం కష్టం. అవతలి వ్యక్తి ప్రేమ కోసం జీవితంలో తన కిష్టమైనవి త్యాగాలు చేయలేక అబద్దాలు ఆడుతూ బ్రతకలేక మానసిక సంఘర్షణకు లోనవటం అందరి జీవితాల్లో జరిగేదే . అలాంటి సున్నితమైన విషయాన్ని తెరకెక్కించాలనే భాస్కర్ ఆలోచన నిజంగా మెచ్చుకోతగ్గదే. అయితే ఇలాంటి సెంట్రల్ ఐడియాని ఎంతో బలమైన సీన్స్ తో చెబితే గాని రక్తి కట్టదు. సరైన సీన్స్ లోకపోతే స్టోరీ పాయింట్ చెప్పటం కోసం డైలాగుల కుప్పని పోయాల్సి ఉంటుంది. టీవీ ఛానెల్స్ లో డిస్కషన్స్ లా చర్చా గోష్టిని పెట్టాల్సి ఉంటుంది. ఆరెంజ్ చిత్ర కథలో అదే పొరపాటు జరిగింది.

అంతేగాక డైరక్టర్ తాను చెప్పదలుచుకున్న విషయంపై స్పష్టత ఉంటే ఆ కథలోనూ, ఆ తర్వాత సీన్స్ లోనూ, తెరపైనా స్పష్టత వచ్చి ప్రేక్షకుడుకి స్పష్టంగా అర్దమయ్యే అవకాసం ఉంటుంది. ఈ చిత్రంలో అదే లోపించింది. అయినా హీరో ప్లాష్ బ్యాక్ విప్పి చెప్పే దాకా అతను ఎందుకలా అమ్మాయిలు వెనుక షార్ట్ టైమ్ లవ్ అంటూ ఎందుకు పడతాడో అర్ధం కాదు. ఆ ప్లాష్ సెకెండాఫ్ దాకా ప్లాష్ కాదు. అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరో ..తను వెంటబడి ఎంతగానో ప్రేమించిన అమ్మాయి అతనికి కండీషన్స్ పెడుతోందని వదిలేస్తాడు. ఆ తర్వాత అతను రియలైజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఊసే ఎత్తడు. కొత్తగా ప్రేమలో పడ్డ అమ్మాయి వెనకే పడుతూండటం మింగుడుపడని విషయం.

ఇక ఈ కథకి సంభందం లేని ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ ఎందుకనే డౌట్ వచ్చినా అక్కడ లొకేషన్స్ ని మాత్రం చాలా అందంగా చూపించటంతో మెచ్చుకోబుద్దేస్తుంది. అలాగే సినిమాలో హ్యారీస్ జైరాజ్ పాటలు హైలెట్ గా నిలబడతాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే షాజన్ పదాంసి,రామ్ చరణ్ ల మధ్య రొమాన్స్ సీన్స్ బాగున్నాయి. అయితే మెయన్ పెయిర్ రామ్ చరణ్, జెనీలియా మద్య ఆ కెమిస్ట్రీ అస్సలు పండలేదు. బ్రహ్మానందం కామిడీ పై మొదట నుంచీ ఆధారపడ్డారు కానీ అదీ పెద్ద పండలేదు. ఇక డైలాగులు అక్కడక్కాడా మెరిసాయి కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా మొత్తం మీద హైలెట్ గా చెప్పుకోవాల్సింది నాగబాబు ప్రొడక్షన్ విలువలనే. ఎక్కడా మొహమాటపడకుండా బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతుంది.

ఫైనల్ గా ఆరెంజ్ ..జెనిలియా, రామ్ చరణ్, భాస్కర్ వంటి మెగా ప్యాకేజితో చూడ్డానికి బాగానే ఉంది కాని, తొక్క తీసి తినబోతే మాత్రం చప్పగా ఉంది. ఎంతో ఆశగా అడుగుపెట్టిన ప్రేక్షకుల జ్యూస్ తీసారనిపిస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu