twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్తికట్టని రామదాసు

    By Staff
    |

    Sri Ramadasu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: శ్రీ రామదాసు
    విడుదల తేదీ: 30-3-2006
    నటీనటులు: నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, స్నేహ,
    సుమన్‌, సుజాత, అర్చన, సమీర్‌, నాజర్‌, నాగబాబు,
    శరత్‌బాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, సునీల్‌, వేణుమాధవ్‌,
    ఎవిఎస్‌, తనికెళ్ళ, హేమ తదితరులు సంగీతం: ఎంఎం కీరవాణి
    రచన: జెకె భారవి
    కెమెరా: ఎస్‌ గోపాల్‌ రెడ్డి
    ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవేంద్రరావు
    నిర్మాత: కొండా కృష్ణంరాజు

    'అన్నమయ్య' అఖండ విజయ స్ఫూర్తితో అదే టీం అందించిన మరో చారిత్రక, భక్తిరస చిత్రం 'శ్రీ రామదాసు'. ప్రచారంలో ఉన్న జానపద కథలకు కల్పన జోడించి నాటకీయ అంశాలతో చిత్రీకరించారు. గొప్ప వ్యక్తిత్వంగల ఆనాటి మహనీయులను ఈ తరానికి పరిచయం చేయడం హర్షణీయమే. హడావిడిగా కథను తయారు చేసుకోకుండా, మరింత కృషి చేసి వాస్తవాలను అందించి ఉంటే ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చారిత్రక చిత్రంగా వాసికెక్కి ఉండేది. అలా కాకుండా వ్యాపారం డామినేట్‌ చేయడంతో 'భక్తి' స్ధానంలో 'రక్తి' ముందుకొచ్చింది. అయితే నాగార్జున మంచి నటన సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయింది.

    కథగా పండిత పామరులకు బాగా తెలిసిన భక్త రామదాసు చరిత్ర ఇది. కంచర్ల గోపన్న (రామదాసు) భద్రాద్రి రాముడికి గుడి కట్టించడం అందరికీ తెలిసిందే. నేలకొండపల్లి నివాసి గోపన్న (నాగార్జున) వయసు వచ్చినా ఏ వ్యాపకం లేక మరదలు (స్నేహ)తో సరసాలాడుతూ తండ్రి (రంగనాథ్‌) చేసే దాన ధర్మాలను సమర్ధిస్తూ కాలం గడుపుతుంటాడు. మామయ్య (తనికెళ్ళ) ను మెప్పించి మరదలు కమలను పెళ్ళాడుతాడు. 'చాలు... చాలు విరహాలు చాలు..' అంటూ రాఘవేంద్రరావు ట్రేడ్‌ మార్క్‌ శృంగార గీతాలతో ప్రేమలోకంలో విహరిస్తూ ఒక బిడ్డకు తండ్రి అవుతాడు. కుటుంబ పోషణ కోసం మేనమామలు అక్కన్న, మాదన్నల సలాహా మేరకు తానీషా (నాజర్‌)ను కలుస్తాడు. 'మనసిచ్చి చూడు' సినిమాలో ప్రకాష్‌రాజ్‌ని అనుకరిస్తూ, ప్రభుత్వ నిధులు ప్రజలకు చేరేలోపలే ఎలా కరిగిపోతున్నాయో ఐస్‌ గడ్డతో వివరిస్తాడు. తానీషా అతడి ప్రతిభను మెచ్చుకుని హుస్నాబాద్‌ తహసీల్దారు పదవి పొందుతాడు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తాడు. గతంలో ఆ పోస్టు నిర్వహించిన మట్టేభాయ్‌ (జయప్రకాష్‌రెడ్డి)కి కోపం వస్తుంది. కథ ఇలా కుటుంబం, ఉద్యోగం అంటూ తిరుగుతుంది. ఉన్నట్టుండి దమ్మక్క (సుజాత) అనే ముసలి భక్తురాలి వల్ల మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి గోపన్న భక్త రామదాసుగా ఎలా మారాడన్నది తెర మీద చూడాల్సిందే.

    మంచి రిసెర్చి చేసిన తర్వాతే ఇటువంటి చారిత్రక చిత్రాలను నిర్మించాలి. నాటకీయత కోసం అవాస్తవాలను చిత్రీకరించడం హర్షణీయం కాదు. కథలో ఆవిష్కరించాల్సిన వాస్తవిక అంశాలను కొత్త కోణంలో చిత్రీకరించాలి. కానీ ఈ సినిమాలో అవి కన్పించవు. తెలిసిన కథనే కొత్తగా చెప్పాల్సి రావడంతో ఇబ్బంది వచ్చింది. ముఖ్యంగా కథాకాలం నాటి చారిత్రక, సాంఘిక, ఆర్ధిక పరిస్ధితులు సినిమాలో ప్రతిబింబించలేదు. ఆ ఫీల్‌ రాలేదు. సినిమాను హిట్‌ చేసుకునేందుకు చౌకబారు హాస్యాన్ని ఆశ్రయించడం విచారకరం. ఒక చారిత్రక సినిమాకు ఇటువంటి హాస్యం శోభనివ్వదు. ఇక స్క్రీన్‌ప్లే చూసుకుంటే సీన్ల మధ్య సరైన అనుసంధానం లేదు. ఇంటర్‌వల్‌ అయ్యాక కథ మరీ బలహీనపడింది. సంఘటనలను పేర్చుకుంటూ కథనాన్ని కూర్చడమే కారణం. సంగీతం చూస్తే గతంలో పాపులర్‌ అయిన కీర్తనల ట్యూన్లను ఉన్నవి ఉన్నట్టు వాడినవి బాగున్నాయి. మార్చిన ట్యూన్లు ఆకర్షణీయంగా లేవు. సినిమాలో చాలా భాగం టీవీ సీరియల్‌లా పేలవంగా సాగింది.

    ఈ సినిమాలో నాగార్జున నటన ఎప్పటిలాగానే బాగుంది. కబీర్‌దాస్‌గా అక్కినేని నాగేశ్వరరావు బాగా నటించారు. రాముడిగా నటించిన సుమన్‌ మేకప్‌ అతిగా కన్పించింది. అతని రంగస్ధల నటుడిగా కన్పిస్తాడు. ఫస్టాఫ్‌ చివర్లో రామాయణ ఘట్టాలు రావడం బాగుంది. రచయిత భారవి ప్రతిభకు ఇది నిదర్శనం. 'అంతా రామమయం' పాట చిత్రీకరణలో కొలను నీళ్ళలో రామనామాన్ని చూపించడం మంచి ఆలోచన. రామదాసుకి కబీర్‌ రామ తారకం చెప్పేటప్పుడు బ్యాక్‌ డ్రాప్‌లో రెండు నావలు కలుసుకున్నట్టు చూపిన సన్నివేశం బాగుంది. మాటల విషయంలో ఒక పొరపాటు జరిగింది. యాసలు క్రమబద్ధంగా లేకుండా మార్పులకు గురయ్యయి. అలాగే లక్ష్మణుడు తానీషాతో నువ్వొక్కడివి, మేమిద్దరం అనడం పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బతీసింది. సినిమాను బాగా ట్రిమ్‌ చే యవలసి రావడంతో కొన్ని చోట్ల లింక్స్‌ మిస్‌ అయ్యాయి.

    ఒక మంచి భక్తిరస, చారిత్రక చిత్రాన్ని అందించిన నిర్మాత, దర్శకులను అభినందించాలి. భక్తులను ఈ సినిమా కొంత నిరాశ పరిచినా కథ తెలియని వారికి కనువిందే. ఎక్కువ ఊహించుకోకుండా వెళ్ళి చూస్తే ఫర్వాలేదనిపించే సినిమా ఇది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X