twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలింది ('నిప్పు' రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: బొమ్మరిల్లు
    నటీనటులు: రవితేజ, దీక్షాసేథ్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్‌, కృష్ణుడు, బ్రహ్మాజీ, సుప్రీత్‌, జయప్రకాష్‌ రెడ్డి, ప్రగతి తదితరులు
    సంగీతం: తమన్‌
    కెమెరా: సర్వేశ్ మురారి
    ఎడిటింగ్ :కోటగిరి వెంకటేశ్వరరావు
    నిర్మాత: వై.వి.ఎస్‌.చౌదరి
    దర్శకత్వం: గుణశేఖర్‌
    విడుదల: 17.02.2011

    రవితేజని పెట్టుకోండి... ఎలాగూ బ్రహ్మానందం ఉండనే ఉంటాడు.. కామెడీ సీన్స్ కుమ్మేద్దాం... మధ్యలో తమన్ మ్యూజిక్... ఆ బీట్ కు స్టెప్ లేసేందుకు గ్లామర్ ఒలకపోసే హీరోయిన్... ఇవి చాలాదా సినిమా సూపర్ హిట్టవటానికి అని అనుకొని, నమ్మి తీసినట్లున్న చిత్రం నిప్పు. వరస ఫెయిల్యూర్లలలో ఉన్న గుణశేఖర్ ఈసారి రవితేజను ఎంచుకుని.. ఓ నావల్టి స్టోరీ లైన్ తో వచ్చాడు. అయితే స్టోరీ లైన్ గా బాగానే ఉన్నా.. దాన్ని ట్రీట్ మెంట్ చేసేటప్పుడు రవితేజ గత హిట్ సినిమాల స్పూర్తితో తో మార్చుకుంటూ కిచిడిలా చేసారు. ముఖ్యంగా హీరో,విలన్ క్యారెక్టరైజేషన్ లని సరిగ్గా డిజైన్ చేయకపోవటంతో సినిమాలో ఉన్న ఎమోషనల్ కాంప్లిక్ట్ హైలెట్ కాకుండా పోయి.. బోర్ సినిమాగా తయారైంది.

    లక్ష్యమంటూ లేకపోవడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యమంటూ తిరిగే సూర్య (రవితేజ)కి క్లోజ్ ప్రెండ్ శ్రీరాం (శ్రీరాం). అతను ప్రమాదవశాత్తు సౌదీలో ఓ అమ్మాయి హత్య కేసులో ఇరుక్కుంటే అక్కడ ప్రభుత్వం ఉరిశిక్ష వేస్తుంది. అయితే ఉరిశిక్ష నుంచి తప్పుకోవాలంటే ఎవరైతే చనిపోయారో వాళ్ల తల్లి.. తండ్రి క్షమాబిక్ష పెట్టాలి. ఆ విషయం తెలుసుకున్న సూర్య తన స్నేహితుడుని రక్షించటానికి.. క్షమాపణ పత్రంపై సంతకం చేయించుకోవటానికి చనిపోయిన అమ్మాయి ఇంటికి వెళతాడు. అయితే ఆ అమ్మాయి తండ్రి రాజాగౌడ్‌ (ప్రదీప్‌రావత్‌) పెద్ద విలన్ .. ఆయన దానికి ఒప్పుకోడు. అప్పుడు సూర్య ఎలా ఒప్పించాడు అన్నది తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

    ఫస్టాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచిన ఈ చిత్రం ఇంటర్వెల్ వరకూ కథలోని కీ పాయింట్ లోకి రాదు. దాంతో ఇంటర్వెల్ వరకూ కథను సెటప్ చేస్తూ ఊసుపోని సీన్లతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది. అలా చేయటంతో పస్టాఫ్ పసలేకుండా పోయి సీన్స్ రిపీట్ అయ్యాయి. ఇక సెకండాఫ్ కి వస్తే ఇంటర్వెల్ లో వేసిన ముడి... (హీరో తన స్నేహితుడుని రక్షిస్తానని ఇండియా రావటం) నుంచి పరగుపెట్టాల్సిందే. అయితే తన కూతురు చనిపోయిందన్న బాధలో ఉన్న కుటుంబం వద్దకు పోయి హీరో ఎలాగైనా తన ప్రెండ్ ని సేవ్ చేసుకోవాలని ఒప్పించాలని ప్రయత్నిస్తూంటాడు. నిజానికి చాలా ఎమోషనల్ గా ఉండాల్సిన సీన్స్ ఇవి. కాని చనిపోయిన అమ్మాయి తండ్రిని పెద్ద విలన్ గా చూపించి... హీరో అతన్ని బెదిరించి... భయపెట్టి క్షమాపణ పత్రాల మీద సంతకం కోసం ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉండే సీన్స్ పెట్టారు. దాంతో హీరో క్యారెక్టరైజేషన్ మీద ఇంట్రెస్ట్ పోయి... కూతురు పోయిన బాధలో ఉన్న తండ్రి పాత్ర మీద సింపతీ పెరుగటం మొదలైంది. అలా హీరోయిజం నెగిటివ్ హీరోయిజంగా మారి చెలరేగుతూంటే చూడలేని స్దితి వచ్చింది.

    ఇక నటీనటుల్లో హీరో రవితేజ ఎప్పటిలాగే చలాకీగా, కంటిన్యూగా డైలాగులు చెప్తూ పోయాడు. హీరోయిన్ కూడా రెగ్యులర్ రవితేజ సినిమాల్లోలాగానే అందాల ప్రదర్సనే జీవితాశయం అన్నట్లు దూసుకుపోయింది. విలన్ గా ప్రదీప్ రావత్ నప్పలేదు. అందులోనూ కూతురుని పోగొట్టుకున్న తండ్రిగా, విలన్ గా రెండు పార్శ్వాలను చూపించలేకపోయాడు. బ్రహ్మానందం విషయానికి వస్తే నవ్వించాలని విపరీతంగా ప్రయత్నించాడు. మాస్టర్ భరత్ కూడా ఏజ్ గ్రోత్ బాగా కనపడి ఫన్ పండ లేదు. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలకు షిప్ట్ అయ్యి గుమ్మడిలా రెగ్యులర్ తండ్రిగా మారిపోతున్నాడనిపించింది. డైలాగులు అస్సలు పేలలేదు. తమన్ సంగీతం ఓకే. టైటిల్ సాంగ్, మరో పాట మాత్రమే బాగున్నాయి. మిగతా సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. దర్శకుడుగా గుణశేఖర్ తన సత్తాను యాక్షన్ సన్నివేశాలు, ఛేజ్ సీన్స్ లో చూపించినా కామిడీలో ఫెయిలయ్యాడు. సినిమాలో ఎక్కువ మార్కులు వేయించుకుంది నిర్మాతగా వైవియస్ చౌదరి మాత్రమే.

    ఫైనల్ గా ఈ సినిమాని ఏ వర్గాన్ని అయితే టార్గెట్ చేసారో ఆ వర్గం కూడా రీచవటం కష్టమనిపిస్తోంది. కథ, కథనం సరిగాలేని కామిడీ, పంచ్ డైలాగులు సినిమాను ఎంతో సేపు మొయ్యిలేవని మరోసారి ప్ర్రూవ్ అయ్యింది.

    English summary
    Ravi Teja's Nippu released with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X