twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చరిత్ర పునరావృతం కాదు' (రక్త చరిత్ర-2 రివ్యూ)

    By Srikanya
    |
    Rakta Charitra 2
    Rating
    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సంస్థ: సినర్జీ ప్రొడక్షన్స్‌
    నటీనటులు: వివేక్ ఒబెరాయ్, రాధిక అప్టే, ప్రియమణి, సూర్య, శత్రుఘ్న సిన్హా, సుదీప్, అభిమన్యు సింగ్
    సినిమాటోగ్రఫీ: అమోల్ రాథోడ్
    ఎడిటింగ్: నిపుణ్అశోక్ గుప్త/భానోదయ
    సంగీతం: ధరమ్-సందీప్
    నిర్మాత: మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్,చిన్న వాసుదేవ రెడ్డి, రాజ్ కుమార్
    దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

    "ప్రతికారమే పరమ సోపానం-మహాభారతం, ప్రతికారమే లోక వినాసకం - మహాత్మా గాంధీ" అంటూ రెండు విరుద్దమైన స్టైట్ మెంట్స్ ను ఒకేసారి ప్రస్దావిస్తూ..వర్మ రక్త చరిత్రను మరో సారి తెరమీదకు తెచ్చారు. అయితే ఈ సీక్వెల్ మొదటి రక్త చరిత్ర అంత గాఢత, నిబద్దత, ఆసక్తత లేకుండా ప్లాట్ గా ఓ విరాగి చెప్తున్న కథలా కనీస కుతూహలం కూడా రేపకుండా కొనసాగి..సాగి..సమాప్తమవుతుంది. ఫస్ట్ పార్ట్ చూసినవారంతా చిత్రం క్లైమాక్స్ అనంతరం సూర్య ఎంట్రీని చూసి..ఓహో సెకెండాఫ్ ఇంకే రేంజిలో ఉంటుందో, యాక్షన్ స్టార్ సూర్య ఏ రేంజిలో అదరకొడతాడో అని భావించి ఓపినింగ్స్ అదిరిపోయేలా ఇచ్చారు. అయితే దాదాపు సినిమా మొత్తం సూర్య పాత్రని జైల్లో నే ఉంచి కథ నడుపుదామని చేసిన ప్రయత్నంలో ఆ పాత్ర ఏమీ చేయటానికి లేకుండాపోయింది. ఎంత వాస్తవ కథ చెప్తున్నా జైల్లో కూర్చుని ప్లాన్స్ వేసే వ్యక్తి కథని చూడటం కష్టమే కదా. అయితే సూర్య మాత్రం తన కళ్ళతోనే నటన చూపించిన సన్నివేశాలు మాత్రం హైలెట్ గా నిలుస్తాయి. అలాగే సినిమాలో వర్మ తీసిన కొన్ని షాట్స్ కొత్తగా ఉండి సినీ అభిమానులకు నచ్చుతాయి. మరి ప్రేక్షకుల సంగతేమేమిటంటే...

    "చరిత్ర ఎప్పుడూ కొత్తగా తయారు కాదు...అది ఎప్పుడు అవే సంఘటనలతో పునరావృతం అవుతూంటుది" అన్నది నానుడి. ఇదే పాయింటుని అనుసరిస్తూ ఈ సెకెండా పార్ట్ కథనం కొనసాగుతుంది. ప్రతాప్ రవి (వివేక్ ఒబరాయ్)తన తండ్రిని చంపారని పగతో చేసిన హత్యతో తనలాంటి మరో వ్యక్తిలో పగకి ప్రాణం పోసానని ఆలస్యంగా తెలుసుకుంటాడు. అతనెవరో కాదు ప్రతాప్ రవి మొదట చంపిన నరసింహరెడ్డి కొడుకు సూర్యభాను రెడ్డి అలియాస్ సూర్య (తమిళ హీరో సూర్య). అయితే సూర్య...తన తండ్రిని ప్రతాప్ చంపాడని తెలసినా మొదట పగ, ప్రతీకారాలే జీవితం కాదని వాటికి దూరంగా బ్రతుకుదామనుకుని నిర్ణయించుకుంటాడు. అయితే రక్త చరిత్ర అతన్ని పగవైపే మళ్ళిస్తుంది. ప్రతాప్ పెట్టిన టీవీ బాంబుతో తన తల్లి, తమ్ముడు, చెల్లి చచ్చిపోయారని తెలుసుకున్న సూర్య రగిలిపోయి..ప్రతాప్ ని చంపాలని బయిలుదేరతాడు. అయితే అది నెరవేరక పోలీసులకు లొంగిపోయి..జైలులోంచే ప్రతాప్ చావుకు ప్లాన్ చేస్తాడు.దానకి జైల్లోనే పరిచయమైన కిరాయి హంతకుడు ముద్దుకృష్ణ సాయిపడతాడు..అంతేగాక రాజకీయంగానూ దెబ్బ కొట్టాలని తన భార్య భార్యభవాని (ప్రియమణి)ని ప్రతాప్ కు పోటిగా ఎలక్షన్లలో నిలబెడతారు. అప్పుడు ప్రతాప్..తనకు అడ్డమవుతున్న సూర్య భార్యని చంపాలనుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది. సూర్య తన భార్యని రక్షించుకోగలిగాడా...ప్రతాప్ ని చంపటమే తన జీవత ధ్యేయమనే సూర్య కోరిక తీరిందా అనేది తెరపై చూడాల్సిందే.

    ఇక ఈ పార్ట్ టు..మెదటి చిత్రంలా ఆకట్టుకోవటంలేకపోవటానికి కారణం...చిన్న కథని పెద్దగా సాగతీయటమే అనిపిస్తుంది. అందులోనూ రెండు వైపులా బ్యాలెన్స్ చేయాలనే వర్మ తాపత్రయం కూడా కథనాన్ని నీరస పరచింది. ఫస్టాఫ్ లో హీరోగా అనిపించిన ప్రతాప్ రవి పాత్ర సెకెండ్ పార్ట్ కి వచ్చేసరికి విలన్ లా కుటిలత్వంతో కనిపిస్తూంటాడు. అలాగే సూర్య పాత్ర కూడా కట్టె..కొట్టె..తెచ్చె అన్నట్లు చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టి మమ అనిపిస్తాడు. అంతేగాని అతనికి తన కుటుంబంతో అల్లుకున్న ఎమోషన్స్ చూపి..అలాంటి ప్రేమమయిమైన కుటుంబం దూరమైపోయిన నేఫద్యంలో అతను ఇలా స్పందించాడు అన్న కోణం కనపడదు. అలాగని కుటుంబం తన కళ్ళెదురుగా చనిపితే ఎవరైనా అలాగే స్పందిస్తారు.. అందుకు పెద్దగా చూపేదేముంది అనొచ్చు కాని, అస్సలు ఆ కుటుంబాన్ని, దానితో అతని రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడు. మరో ప్రక్క ప్రతాప్ రవి పాత్ర మొదటి పార్ట్ లో ఎంతో ఉదాత్తంగా కనిపించి అతను చేసేది కరెక్టే అనిపించి జైలు కొట్టించి హిట్ అయ్యేలా చేసుకుంది..ఇక్కడకొచ్చేసరకి కేవలం ఆ పాత్ర ఎత్తులు, పై ఎత్తులు, కుటిల రాజకీయం అనే కోణంలో కనపడి మింగుడుపడదు. అలాగే ప్రియమణి పాత్రకు ముగింపు కనపడదు.

    అలాగే ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా ఆకట్టుకున్న అంశాల్లో విలన్ గా వేసిన బుక్కారెడ్డి(తెరపై మళ్ళీ ప్లాష్ బ్యాక్ లో కనపడగానే జనాలు విపరీతంగా స్పందించారు), అతని తండ్రి కోట క్యారెక్టర్, ఎన్టీఆర్ ని అనుకరిస్తూ వేసిన శతృఘ్నసింహా పాత్ర. ఈ సెకెండ్ పార్ట్ లో అవేమీ మచ్చుకైనా కనపడవు. దాంతో అందరూ మంచివాళ్ళే..కేవలం పరిస్ధితులే అలా వాళ్ళ మధ్యన తగువు పెట్టాలని చూసింది అని చెప్పాలని చేసిన ప్రయత్నం పెద్దగా పట్టేటట్లు కనపడటం లేదు. ఇక నేరేషన్ పరంగా..ఈ చిత్రం మెల్లగా..నేషనల్ జియాగ్రఫీలో డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ తో సాగుతుంది. కొన్ని షాట్స్ వర్మకే సాధ్యం అనిపించినా టోటల్ గా గ్రిప్ మిస్సయిందనిపిస్తుంది. డైలాగుల్లో శతృఘ్న సింహా..రైపిల్, మాట ఒకటే అని చెప్పే డైలాగు, సుదీప్ పాత్ర సూర్య తో చెప్పే భార్య కోసం నువ్వు లొంగిపోతావనుకోలేదు వంటివి అక్కడక్కడ పేలాయి. ఇక స్క్రిప్టు పరంగా సినిమాలో సూర్యని కోర్టులో హాజరు పరిచేటప్పుడు వచ్చే సీన్, సూర్య భార్య. భవాని(ప్రియమణి) ని చంపమని ప్రతాప్ రవి పురమాయించినప్పుడు, ప్రతాప్ రవి, అతని భార్య మద్యన వచ్చే డిస్కషన్ బావుంటుంది. టెక్నికల్ గా ఎక్కడా వంకలు పెట్టలేని విధంగా ఉంది అలాగే వర్మ పాడిన పాట ఎండ్ క్రెడిట్స్ లో రావటం బావుంది. ఇక వర్మ వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి కూడా మైనస్ గా మహా నసగా నిలుస్తుంది. వీటితో పాటు ఫస్ట్ పార్ట్ లో కంప్లైంట్ అయిన రాయలసీమ వాతావరణం, యాస లేకపోవటం ఈ సీక్వెల్ లోనూ రిపీట్ అయింది. నటీనటుల్లో ప్రియమణి, సుదీప్, సూర్య పోటీపడి నటించారు. టెక్నికల్ గా సినిమా వర్మ రెగ్యులర్ స్టాండర్డ్స్ లోనే ఉంది.

    ఏదైమైనా ఫస్ట్ పార్ట్ చూసి ఆ రేంజిలో ఊహించుకు వెళితే పూర్తి స్ధాయి నిరాస తప్పదు. అలాగే సూర్య, ఆర్.జి.వి కాంబినేషన్ అని కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నా అదే ఇబ్బంది. ఏ ఎక్సపెక్టేషన్ లేకుండా వర్మ కొత్త సినిమా అనుకుని వెళ్ళితే ఫరవాలేదనిపిస్తుంది. మరీ ఫ్లాప్ కాదనిపిస్తుంది. ఈ సూచనలు వర్మ ఫ్యాన్స్ కు మాత్రం కాదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X