twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రోబో' రామాయణం(రివ్యూ)

    By Srikanya
    |
    Robo
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    చిత్రం: రోబో
    బ్యానర్: సన్ పిక్చర్స్
    తారాగణం: రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, తదితరులు.
    మాటలు: శ్రీరామకృష్ణ
    కెమెరా: ఆర్.రత్నవేలు
    ఎడిటింగ్: ఆంధోని
    కళ: సాబు సిరిల్
    సౌండ్ ఎఫెక్ట్స్: రసూల్ పూకుట్టి
    సంగీతం: ఎ.ఆర్.రహమాన్
    కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్
    నిర్మాత: కళానిధి మారన్
    విడుదల తేదీ: 01/10/2010

    రజనీకాంత్..సైన్స్ ఫిక్షన్...నిజానికి ఈ రెండూ ఒకదానికొకటి పొంతన కుదవనిపిస్తాయి. ఎందుకంటే రజనీ మాస్ కి మంత్రమైతే, సైన్స్ ఫిక్షన్..క్లాస్ కి తంత్రం. ఈ రెండూ కలగపిన మాంత్రికుడు శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని రోబో కోసం రెండు ఏళ్ళుగా జనం ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ప్రతిఫలం దక్కింది. అయితే కథా పరంగా చిన్న చూపే మిగిలింది. రజనీ కాంత్ ద్విపాత్రల్లో అద్వితీయంగా చేసిన ఈ చిత్రాన్ని ఇండియన్ తెరపై చేసిన ఇంద్రజాలం అనటంలో సందేహం లేదు. కానీ కథలో నెగిటివ్ హీరోగా ఉన్న రోబో...పాజిటివ్ హీరో సైంటిస్టుని డామినేట్ చేయటం, అతనికి సీన్స్, సీన్ లేకుండా చేయటం ఇబ్బందికర అంశం. అయితేనేం కూర్చున్నంతసేపూ ఓ హాలీవుడ్ చిత్రం చూస్తున్న ఫీల్ తెచ్చిన దర్శకుడుని,టెక్నికల్ టీమ్ ని అభినందించకుండా ఉండలేం.

    ఓ ఫేమస్ సైంటిస్టు డా.వశి (రజినీకాంత్) కి ఓ లవర్ సన(ఐశ్వర్య రాయ్). ఓ ప్రక్క ఆమెతో ప్రేమ వ్యవహారం నడుపుతూ...ఎంతో కష్టపడి తయారుచేసిన శక్తివంతమైన రోబో చిట్టి(మళ్ళీ రజనీ). ఆ రోబోని సైన్యానికి అంకితమిచ్చి దేశభక్తి ని చాటుకోవాలనుకుంటాడు. అయితే విలన్ డా భోర(డానీ)కి ఆ రోబోని తీవ్రవాదులుకి అమ్ముకుని సొమ్ముచేసోవాలని ఉంటుంది. వీరి గొడవ ఇలా ఉంటే...రోబోకి విచక్షణా జ్ఞానం లేకపోతే సైన్యానికి సమస్య అవుతుందని ఇండియన్ ఆర్మి రిజక్టు చేస్తుంది. ఆ పరిస్ధితుల్లో వశి..మళ్లీ తన తెలివినంతా వినియోగించి ఆ రోబోకి భావోద్వేగాలు(ఎమోషన్స్) ని ఏర్పాటు చేస్తాడు. దాంతో ప్రతీ విషయానికి స్పందించటం మొదలెట్టిన రోబో...వెళ్ళి తనను సృష్టించిన వశి ..ప్రియురాలు సనతో ప్రేమలో పడుతుంది. కాదన్న వశిని ప్రక్కకు నెట్టి సనను కిడ్నాప్ చేస్తుంది. మరో ప్రక్క ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న విలన్ సైంటిస్టు దీన్నో అవకాశం తీసుకుని ఏం చేసాడు. చివరకు రోబో...ప్రేమ సఫలమయిందా అన్న ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే. నిజానికి ఈ ప్రశ్న కన్నా గ్రాఫిక్స్ తో రోబో ఎలా విన్యాసాలు చేసింది. ఏం వినాసనం తెచ్చిపెట్టిందన్నదే ఆసక్తి కరం.

    భస్మాసురుడు హస్తం కథను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథనం రోబో. తాను తయారు చేసి శక్తులు ఇచ్చిన రోబో తనకే సమస్యగా తయారవటమే ఈ కథలో ఉన్న హాట్ పాయింట్. అయితే కథను ప్రేమ వైపు తిప్పి మళ్లీ రామాయణాన్ని గుర్తు చేయటంలో శంకర్ గాడి తప్పాడనిపిస్తుంది. విలన్ గా మారిన రోబో...హీరోయిన్ ని కిడ్నాప్ చేయటం, పెళ్ళి చేసుకోమని బలవంతపెట్టడం, చివరకు ఆమె కోసం పెద్ద యుద్దం చేయటం ఇవన్నీ రామాయణాన్ని తలపించే అంశాలే. అలాగే అద్బుతంగా గ్రాఫిక్స్ సమకూర్చినా కథలో హీరో పాత్ర అయిన సైంటిస్ట్ రజనీకాంత్ కి న్యాయం చేయలేదనిపిస్తుంది. అయితే తెరపై విలన్ అయిన రోబో కూడా రజనీకాంతే కద అని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. అయితే ఎంత రజనీ డబుల్ అయినా హీరో అయిన సైంటిస్టు రజనీ పాత్రనే జనం ఐడింటిఫై చేసుకుని ప్రేక్షకులు ఫాలో అవుతారు. దాంతో విలన్ రోబో రెచ్చిపోయి వినాసనం సృష్టిస్తూంటే...హీరో నిమ్మకు నీరెత్తినట్లు ఏమీ చేయలేక నిశ్సహాయ స్ధితిలో ఉండి క్లైమాక్స్ లో మాత్రమే చిన్న ఎత్తుతో గెలవటం సమంజసం అనిపించదు.

    ఇక ఫస్ట్ హాఫ్ లో కామిడీ బాగా ఆకట్టుకుంటుంది. రోబో డ్రైవ్ చేస్తూంటే...ఏం మందు కొట్టి డ్రైవ్ చేస్తున్నావా అని అడిగితే..కాదు పెట్రోలు కొట్టి డ్రైవ్ చేసున్నాననటం. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి లంచం అడిగితే..రోబో కి అర్దం కాక బిక్క మొహం వేయటం. అలాగే మంగళ షాపులో పుస్తకాలు ఉంటే రోబో ఒక్క క్షణంలో స్కానింగ్ చేసి అన్నీ చదివేసాననంటం వంటి సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. అలాగే రౌడీలతో ఫైట్ చేస్తన్నప్పుడు రోబో..అమ్మవారి రూపంలో...కత్తులు కటారుతో ఉంటే జనం పూజించే సీన్ బాగుంది. ఇక ఐశ్వర్యారాయ్ ముద్దు పెట్టుకున్నప్పుడు రోబో లో కలిగే స్పందన ని బాగా చిత్రీకరించారు. పాటల్లో మొదటి పాట వినటానికి చాలా బాగుంది. అయితే రజనీకాంత్ అభిమానులకు మాత్రం ఆయన రెగ్యులర్ మ్యానరిజంలు, హీరోయిజం లేకపోవటం ఇబ్బంది అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ దాదాపు అరగంట మాత్రం ఇండియన్ తెరపై ఎదురు చూడని అద్బుతం కనిపిస్తుంది.

    ఫైనల్ గా రోబో అంటే మరమనిషి అని అచ్చ తెలుగులో చెప్పినంత స్పష్టంగా శంకర్ ఈ సైన్స్ ఫిక్షన్ ని తెరకెక్కించినందుకు అభినందించాలి. ఎంత లాభాలు ఆసించినా రిస్క్ చేసి అలాగే ఆ రేంజిలో ఖర్చు పెట్టినందుకు నిర్మాతకు కూడా సినీ ప్రియులు ధాంక్స్ చెప్పాలి. అయితే కథపై మరింత కాన్సర్టేట్ చేసుంటే మరింత బాగా వచ్చుండేదనేది మాత్రం నిజం. ఎందుకంటే కథలో గ్రాఫిక్స్ కలపటం వేరు...గ్రాఫిక్స్ అనుకుని కథను దాని చుట్టూ అల్లుకోవటం వేరు కదా. ఏదైమైనా రోబోని ఒక్కసారి చూసి వచ్చేయచ్చు. డబ్బు దండగ అని పొరపాటున కూడా అనిపించదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X