twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మణి' పూస 'సఖి'

    By Staff
    |

    Sakhi
    -సౌమిత్‌
    మణిరత్నం నుంచి మరో ఆణిముత్యం జాలువారింది. అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. 'సఖి' - వాస్తవిక ప్రేమకథ. రాజకీయవివాదాలు, దేశ సమస్యలను ఆధారంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న మణిరత్నం ఈసారి ఆ తప్పు చేయలేదు. పకడ్బందీ స్క్రీన్‌ ప్లే తో అందమైన లవ్‌ స్టోరీగా మలిచాడు. రెహమన్‌, పి.సి.శ్రీరాంల సాంకేతిక ప్రతిభ కూడా దీనికి తోడవ్వడంతో- చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపారేస్తుంది. తొలిచూపు ప్రేమ, గిల్లికజ్జాలు, చిలిపి తగాదాలు, అలకలు, కోపాలు,తాపాలు, అపార్థాలు, తిరిగి ఒకటవ్వడాలు..... ఇలా ప్రేమలోని అన్ని పార్శ్వాలనూ మణి ఇందులో స్పృశిస్తారు.

    కార్తీక్‌ (మాధవన్‌) డాట్‌ కామ్‌ జెనరేషన్‌ యువకుడు. కంప్యూటర్స్‌ చేస్తూ, హాయిగా, జాలీగా గడుపుతుంటాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను సిగరెట్లకు తగలెస్తుంటాడు. ఇలాంటి కార్తీక్‌ - ఒక పెళ్లిలో తొలిచూపులోనే శాంతి( షాలిని) ప్రేమలో పడతాడు. శాంతి మెడికో. మద్రాస్‌ లోకల్‌ ట్రైన్‌ లో కాలేజికు వెలుతుంటుంది. పనీ,పాటా లేకుండా ట్రైన్‌ లో తిరిగే కార్తీక్‌ కు శాంతి మళ్ళీ తారసపడుతుంది. ఇక మనవాడు- రోజు ఆమె వెంటపడుతుంటాడు. పాటలు పాడుతుంటాడు. ఒకరోజు డైరక్టగా వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు.

    'ప్రేమ' అనేది ఏ పనీ, పాటా లేని వాళ్ళ కోసం ఏర్పడ్డది అని నమ్మే శాంతి మొదట కార్తీక్‌ ప్రపొజల్‌ కు ఒప్పుకోదు. కానీ మనసు లాగుతుంటుంది- ఒప్పుకోవాలని. చివరికి ఎలాగైతేనేమి, సరే అంటుంది. అమ్మాయిని చూసేందుకు కార్తీక్‌ తల్లిదండ్రులు శాంతి వాళ్ళింటికి వస్తారు. శాంతిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రైల్వేలో ఉద్యోగి. కార్తీక్‌ వాళ్ళ నాన్న క్రిమినల్‌ లాయర్‌. ఉన్నత కుటుంబం.ఈ లాయర్‌ ఈగో, రైల్వే ఉద్యోగి 'అభిమానం' కలవడంతో ప్రేమజంట విడిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.( ఇలాంటి సినిమా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? అయితే, మీరు ఏమీ పొరపాటు పడనట్లే) ఇక ఉన్న మార్గం ఒక్కటే- దొంగపెళ్ళి. శాంతి అక్క పూర్ణ దగ్గరుండి వీరి పెళ్ళి జరిపిస్తుంది. పెళ్ళైనా ఇద్దరు ఎవరింట్లో వారు ఉంటారు.

    సమస్య అక్కడే మొదలవుతుంది. పూర్ణకు పెళ్ళి సంబంధం రావడం, పెద్దమ్మాయితోపాటు చిన్నమ్మాయిని కూడా తమ రెండో కోడలుగా చేసుకుంటామని పెళ్ళిచూపులకు వచ్చిన వారు అనడంతో - శాంతి అసలు విషయం బయటపెడుతుంది. దీంతో సంబంధం ఎగిరిపోతుంది. శాంతిని వాళ్ళ నాన్న వెళ్ళగొడుతాడు. కార్తీక్‌,శాంతిలు వేరు కాపురం పెడుతారు. కార్తీక్‌ ఫ్రెండ్స్‌ తో కలిసి ఓ సాప్ట్‌ వేర్‌ సంస్థ ప్రారంభిస్తాడు. హీరోయిన్‌ ప్రాక్టీస్‌ మొదలెడుతుంది. చిలిపి తగాదాలతో, గిల్లికజ్జాలతో హాయిగా సాగే వారి కాపురం- శాంతి తండ్రి మరణంతో ఒక్కసారిగా మారిపోతుంది. తండ్రి మరణానికి తనే కారణం అని శాంతి కుమిలిపోతుంటుంది. తన వల్లే ఇలా పూర్ణ సంబంధం చెడిపోయిందని భావించిన కార్తీక్‌ అదే అబ్బాయితో పూర్ణను కలిపేందుకు ప్రయత్నిస్తాడు. ఆ అబ్బాయి ఆమెను పెళ్ళిచేసుకునేందుకు ఒప్పుకుంటాడు. ఆ సంతోషంలో పూర్ణను కార్తీక్‌ కౌగిలించుకుంటాడు. ఈ దృశ్యాన్ని శాంతి చూస్తుంది. ఇక అపార్థాల పర్వం మొదలు. తగాదాలు ముదిరి, ప్రేమ బీటలు వారుతుంది. ఒకరోజు పూర్ణ అసలు విషయం చెప్పడంతో- శాంతి పట్టరాని సంతోషంతో కార్తీక్‌ ను కలుసుకునేందుకు పరిగెడుతుంది. స్పీడ్‌ గా కారు డ్రైవ్‌ చేస్తున్న కుష్బూ ఆమెను గుద్దేస్తుంది. శాంతి కోమాలోకి వెళ్ళిపోతుంది. కుష్బూ ను కాపాడేందుకు ఆమె భర్త అరవింద్‌ స్వామి పడే పాట్లు చూసి మన హీరో సిగ్గుపడుతాడు. నిజమైన భర్త ఇలా ఉండాలి అని అనుకుంటాడు. చివరికి శాంతి కోమా నుంచి బయటకి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు హాయిగా గడిపేస్తారు.

    ఒక మామూలు కథను భిన్నంగా చిత్రీకరించడంలో మణిరత్నం సక్సెస్‌ అయ్యాడు. రెహమన్‌ టెక్నో మ్యూజిక్‌ చిత్రానికి ఎస్సెట్‌. పాటల చిత్రీకరణ అద్భుతం.కాశ్మీర్‌, అండమాన్‌ దీవులతో పాటు,మధ్యప్రదేశ్‌ లొని ఇండోర్‌, అందమైన మనేశ్వర్‌ డ్యాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. చిన్ని తెరకు కొత్త కాకపోయినా, మాధవన్‌ కు ఇది మొదటి చిత్రం. తొలి చిత్రంలోనే పరణతి చెందిన నటుడు లాగా నటించాడు. పక్కింటి అమ్మాయి పాత్రను షాలిని అద్భుతంగా పోషించింది. షాలిని అమ్మగా నటించిన జయసుధ తన పాత్రకు న్యాయం చేశారు. మొత్తమ్మీద, చూడదగ్గ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X