For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహిళలసినిమా సంక్రాంతి- రివ్యూ

  By Staff
  |

  Sankranthi
  సినిమా: సంక్రాంతి

  పంచ్‌లైన్‌: తిరగమూత పెట్టిన తమిళ సాంబార్‌

  నటీనటులు: వెంకటేష్‌, ఆర్తి అగర్వాల్‌, స్నేహ, శారద, శ్రీకాంత్‌,

  శివబాలాజీ, శర్వానంద్‌, చంద్రమోహన్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ళ భరణి,

  సుధాకర్‌, రాళ్ళపల్లి, రావి కొండలరావు, దిల్‌ రమేష్‌, సాయి హర్ష,

  గౌతంరాజు, సంగీత, రతి, శివపార్వతి, బేబి శ్రీలేఖ తదిఅతరులు.

  కథ: లింగుస్వామి

  రచన: పరుచూరి బ్రదర్స్‌

  పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, ఇఎస్‌ మూర్తి, పోతుల రవి కిరణ్‌

  సంగీతం: ఎస్‌ఎ రాజ్‌కుమార్‌

  ఛాయాగ్రహణం: బి.బాలమురుగన్‌

  ఆర్ట్‌: కుమార్‌

  ఎడిటింగ్‌: నందమూరి హరి

  ఏగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వాకాడ అప్పారావు

  నిర్మాత: ఆర్‌బి చౌదరి

  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ

  విడుదల తేదీ: 18-2-2005

  ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ముల ఆప్యాయతానురాగాలు, ప్రధాన పాత్రల త్యాగం, వడ్డించిన విస్తరి లాంటి హిట్‌ ఫార్ములా- వీటన్నిటినీ దట్టించిన తమిళ 'ఆనందం' తెలుగు రీమేక్‌ ఒక ఓకే చిత్రం. 'ఘర్షణ'తో గాయపడి ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేసుకున్న వెంకటేష్‌ మళ్ళీ రీమేక్‌నే నమ్ముకున్నప్పటికీ 'సంక్రాంతి' మినిమం గ్యారంటీ సినిమాగా నిలుస్తుంది.

  కథ: రాఘవేంద్ర (వెంకటేష్‌)కు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళు శ్రీకాంత్‌, శివ బాలాజీ, సర్వానంద్‌. కుటుంబాన్ని బాధ్యతగా, ప్రేమగా చూసుకునే రాఘవేంద్రకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఉండ దు. వెనుక ఉన్న తమ్ముళ్ళని, ముందు ఊడుతున్న జుట్టుని చూసుకుని ఇకనైనా పెళ్ళి చేసుకోమని తల్లి (శారద), తండ్రి (చంద్రమోహన్‌) బతిమాలుతూ ఉంటారు. ఆ ఇంటికి దొంగతనానికి వచ్చి, వారి మంచితనానికి లొంగిపోయిన సుధాకర్‌ ఆ ఇంట్లోనే పనిమనిషిగా సెటిలై పోతాడు. రాఘవేంద్ర ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటని తల్లి శారదను అడుగుతాడు. హీరో రాఘవేంద్ర ఆర్తి అగర్వాల్‌ను ప్రేమించాడని, అనుకోకుండా ఆస్ధి మొత్తం పోవడంతో నిశ్చయమైన పెళ్ళి ఆగిపోయిందని తెలుసుకుంటాడు. ఆనాటి నుంచి రాఘవేంద్రలో పట్టుదల పెరుగుతుంది. ఏ ఆస్ధినైతే తాను కోల్పోయాడో దానిని సంపాదించుకోడానికి కష్టపడిపని చేస్తాడు. ఆ విషయమంతా ఒక డ్యూయట్‌తోనే తమిళ తరహాలో ప్రేక్షకులకు తెలిసేలా చేశారు.

  ఒక రోజు భద్రాచలంలో నలుగురు అన్నదమ్ములు రాముల వారి కళ్యాణంలో పల్లకి మోస్తుండగా రాఘవేంద్రకు తారసపడిన స్నేహ అతడిని బాగా ఆకర్షిస్తుంది. వెంటనే అతని చేత తాళి కట్టించుకుంటుంది. ఈలోగా ఆర్తి అగర్వాల్‌ ప్రత్యక్షం. 'నా చెల్లెల్ని అయినా మీ కుటుంబంలో కలుపుకోండి' అని అడుగుతుంది. ఆమె చెల్లెలు సంగీతను శ్రీకాంత్‌కు ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఈలోపు శివ బాలాజీ రతిని ప్రేమిస్తాడు. ఆమె విలన్‌లా కన్పించే ప్రకాష్‌రాజ్‌ కూతురు. రెండో కోడలుగా కాపురానికి వచ్చిన సంగీత 'పెదరాయుడు'లో సౌందర్యలా హీరోని తక్కువ చేసి చూస్తుంటుంది. బావ మీదికి భర్తను రెచ్చగొడుతూ ఉంటుంది. అన్న, భార్యల మధ్య శ్రీకాంత్‌ నలిగిపోతుంటాడు. ఓరోజు బీరువాలో సంగీతకు రాఘవేంద్ర పేరుతో పది లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్నట్టు పాస్‌బుక్‌ దొరుకుతుంది. మరో వైపు శ్రీకాంత్‌ బావమరిది సొంతంగా వ్యాపారం చేసుకోమని శ్రీకాంత్‌ మీద వత్తిడి చేస్తుంటాడు. ప్రకాష్‌రాజ్‌ శివబాలాజీని ఇల్లరికం రమ్మని షరతు పెడతాడు. ఇవన్నీ పెద్దన్న రాఘవేంద్రకు బాధ కలిగించే విషయాలే. వీటన్నిటినీ రాఘవేంద్ర ఎలా పరిష్కరించి ఉమ్మడి కుటుంబంలో సంతోషాల సంబరాన్ని నింపాడన్నది తెర మీద చూడవలసిందే.

  ఉమ్మడి కుటుంబాల్లోని ఆనందం, ఉన్నత విలువల గురించి నేటి తరానికి తెలియజెప్పేలా సినిమా తీయడం హర్షణీయమే. అయితే అన్ని పాత్రలను 'గుడ్‌ ఫీల్‌'గా మలచడానికి తాపత్రయపడడంతో పాత్రల మధ్య పూర్తి స్ధాయి సంఘర్షణ లోపించింది. వెంకటేష్‌ పేరున ఉన్న పది లక్షల బ్యాలెన్స్‌ విషయం రివీల్‌ అయిపోయాక, శివబాలాజీ పాటతో మరికొన్ని సన్నివేశాలతో సినిమాను మరో అరగంట సాగలాగడం పెద్ద లోపం. కొడుకు రాఘవేంద్రను చూసి తలిదండ్రులే భయపడడం తమిళ తరహా ఓవరాక్షన్‌కు నిదర్శనం. ఇటువంటి సన్నివేశాలు తమిళంలో సహజంగా ఉంటాయి కానీ తెలుగు వారికి నప్పవు. ఆర్తి అగర్వాల్‌ను ప్రేమించి భగ్నప్రేమికుడుగా మిగిలిపోయిన వెంకటేష్‌ స్నేహను చూసిన వెంటనే ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అతని పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బతీసింది.

  వెంకటేష్‌ తన వయసుకు తగిన పాత్రలో చక్కగా నటించాడు. స్నేహ నటన కూడా పాత్రోచితంగా బాగుంది. శ్రీకాంత్‌ 'స్వరాభిషేకం' క్యారక్టరే అయినా ఫర్వాలేదు. వెంకటేష్‌ అన్నం తినేటప్పుడు కుటుంబసభ్యులంతా అతనిని బ్యాంకు బ్యాలెన్స్‌ విషయంలో నిలదీసే సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా పండించారు. చిన్న పాప పాత్ర ద్వారా రైసు మిల్లుకు పేరు పెట్టే విషయంలో సంఘర్షణ తెప్పించడం మంచి ఆలోచన. వేణుమాధవ్‌ 'మాస్‌', 'ఘర్షణ', 'శంకర్‌దాదా' పేరడీ పాత్రల పేరడీ బాగుంది. కానీ ఈ పేరడీల వల్ల సినిమాను నిజజీవితమమనుకుని చూసే సామాన్య ప్రేక్షకుడికి ఇది సినిమా అన్న స్పృహ వచ్చి అతను పాత్రల్లో లీనం కావడం జరగదు. ఇది మరో లోపం. ఇలాంటి సినిమాలకు రాజ్‌కుమార్‌ పాటలు షరామామూలే. కెమెరా పనితనం పాటల చిత్రీకరణలో బాగుంది.

  'మా అన్నయ్య' లాంటి ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా 'సాగింది'. సినిమా మహిళలను, పల్లెటూరి ప్రేక్షకులను ఆకర్షించవచ్చు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X