Sasivadane Movie Review: శశివదనే మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్ తదితరులు
దర్శకత్వం: సాయి మోహన్ ఉబ్బాన
నిర్మాత: అహితేజ బెల్లంకొండ
సమర్పణ: గౌరీ నాయుడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చోలెటి
మ్యూజిక్: శరవణ వాసుదేవన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫి: సాయికుమార్ దారా
ఎడిటర్: గ్యారీ బీహెచ్
బ్యానర్: ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్
గోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాఘవ (రక్షిత్ అట్లూరి) బాల్యంలోనే తల్లిని కోల్పోవడంతో తండ్రి (శ్రీమాన్) అన్నీ తానై పెంచుతాడు. తండ్రి ప్రేమ, అభిమానాలను పుష్కలంగా పొందుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని పరీక్షలు ప్రిపేర్ అవుతుంటాడు. జీవితం సరదాగా సాగుతుంటే.. అంగన్ వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేసే శశి (కోమలి ప్రసాద్)ను తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. శశి కూడా రాఘవను అంతే మొత్తంలో ప్రేమిస్తుంది. కానీ శశి ప్రేమకు చెడు అలవాట్లు, స్త్రీ లోలుడైన బావ అడ్డుగా మారుతాడు. తాను ఇష్టంగా ప్రేమించే రాఘవ ఊహించని విధంగా జైలుపాలు అవుతాడు.

శశితో రాఘవ లవ్ ట్రాక్ ఎలా సాగింది? రాఘవకు శశి బావకు మధ్య ఉన్న గొడవ ఏంటి? శశితో ప్రేమ వ్యవహారంలో ఆమె బావ ఎలా అడ్డు తగిలాడు? జీవితంలో అన్నీ తానైన తండ్రిని రాఘవ ఎలా కోల్పోయాడు? తండ్రి హత్య తర్వాత రాఘవ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు రాఘవ, శశి ప్రేమ గెలిచిందా? శశి, రాఘవ పెళ్లి జరిగిందా? ఇలాంటి సింపుల్ ప్రశ్నలతో సాగే ప్రేమ కథనే శశివదనే.
ప్రస్తుతం వస్తున్న ప్రేమ కథా చిత్రాలతో పోల్చుకొంటే.. శశివదనే చిత్రం రొటీన్, రెగ్యులర్ మూవీ. 80 దశకం నాటి ప్రేమ కథతో రూపొందిన సినిమా అనిపిస్తుంది. కథ పాతదైనా కథనం కొత్తగా లేదు. సన్నివేశాల్లో నావెల్టీ లేదు. లవ్, రొమాన్స్ అంశాల్లో యూత్‌ను టార్గెట్ చేసే అంశాలు లేకపోవడంతో సినిమా చప్పగా సాగుతుంది. అంతేకాకుండా కథను మలుపు తిప్పే సన్నివేశాలు లేవు. షార్ట్ ఫిలిం తీయాల్సిన కథను రెండున్నర గంటల సినిమాగా తీశారా? అనే అనుమానం వస్తుంటుంది. కథలో వైవిధ్యం లేకపోవడం వల్ల అక్కడక్కడే కథ తచ్చాడుతుంటుంది. కేవలం గోదావరి అందాలను టాప్ యాంగిల్ తీసి చూపించడంలో విశేషం కనిపించేదే గానీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే, పాత్రల డిజైన్ విషయంలో పూర్తిగా డిజపాయింట్ చేస్తుంది.
ఈతరం ప్రేక్షకులకు ఏ మాత్రం క్యూరియాసిటీ కలిగించే అంశాలు లేని సినిమా కథను కూడా రక్షిత్, కోమలి ప్రసాద్ తమ ప్రతిభతో కొంత మేరకు లాక్కొని రావడంలో సక్సెస్ అయ్యారు. ఉన్నంతలో మంచి నటన, యాక్టింగ్ టాలెంట్‌తో న్యాయం చేసే ప్రయత్నం చేశారు. కమర్షియల్ వయబుల్ ఉన్న పాత్రలకు నాసిరకం యాక్టర్లను, ఊరు పేరు లేని ఆర్టిస్టులను పెట్టడం వల్ల రీచ్ రావడానికి ఉన్న అవకాశాలను చేజార్చుకొన్నారు. శ్రీమాన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. లోకల్ ఆర్టిస్టులు తమ యాస, భాషతో మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఆడియో పరంగా, విజువల్ పరంగా పాటలు బాగున్నాయి. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ సాయికుమార్ దారా అందించిన సినిమాటోగ్రఫి. గోదావరి అందాలను అద్బుతంగా చూపించాడు. టాప్ యాంగిల్ షాట్స్ బాగున్నాయి. గౌరీ నాయుడు, అహితేజ బెల్లంకొండ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాల ఎంపికపై జాగ్రత్త పడి ఉంటే.. టెక్నికల్ అంశాల బలంతో మంచి ప్రేమ కథా చిత్రంగా మారి ఉండేది అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











