»   » శమంతకమణి మూవీ రివ్యూ: థ్రిల్లింగ్‌గా రోల్స్ రాయిస్ వేట

శమంతకమణి మూవీ రివ్యూ: థ్రిల్లింగ్‌గా రోల్స్ రాయిస్ వేట

Posted By:
Subscribe to Filmibeat Telugu

Rating: 2.75/5

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల జోరు పెరుగుతున్న నేపథ్యంలో నలుగురు హీరోలు నారా రోహిత్, ఆది సాయికుమార్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్ కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రం శమంతకమణి. సినిమా టైటిల్ వినగానే ఓ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ మంచి జోష్‌ను పెంపొందించింది. ప్రమోషనల్ పోస్టర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారు చోరికి గురైన వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకోని దర్శకుడు శ్రీరాం ఆదిత్య కథను అల్లుకొన్నాడు. కేవలం ఇద్దరి హీరోలను ఒప్పించడం కష్టంగా మారిన నేపథ్యంలో తన కథను నలుగురు హీరోల చేత ఊ కొట్టించి శమంతకమణిగా మలిచాడు. ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల్లో ఆసక్తిరేపిన చిత్రంగా టాక్‌ను సంపాదించుకొన్న శమంతకమణి జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిగనిగలాడే శమంతకమణి ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


శమంతకమణి కథ ఇలా సాగింది..

శమంతకమణి కథ ఇలా సాగింది..

హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగన్నాథం (సుమన్) కుమారుడు కృష్ణ ( సుధీర్ కుమార్). చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకొన్న కృష్ణ ఆమె జ్ఙాపకాలతోనే జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. కోటిపల్లి అనే గ్రామంలో థియేటర్ నడిపే శివ ( సందీప్ కిషన్) ప్రియురాలి మోసానికి గురై పట్నం చేరుకొంటాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కార్తీక్ (ఆది) గొప్పింటి యువతిని పెళ్లి చేసుకోవాలని కలలు కని భంగపాటుకు గురవుతాడు. నగరంలోనే ఉమామహేశ్వర్‌రావు ఉరఫ్ మహేశ్ (రాజేంద్రప్రసాద్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా జగన్నాథం వేలంలో ఐదుకోట్లు వెచ్చించి వింటేజ్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేస్తాడు. తన తల్లి, తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడానికి రోల్స్ రాయిస్ కారును తీసుకొని నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్తాడు. వీరంతా ఆ హోటల్‌లోని పబ్‌లో మత్తులో మునిగి తేలుతారు.


ఎవరు దొంగ.. దాగుడుమూతల స్క్రీన్ ప్లే

ఎవరు దొంగ.. దాగుడుమూతల స్క్రీన్ ప్లే

పార్టీ అనంతరం ఆ కారు చోరికి గురైంది పోలీస్ ఇన్స్‌పెక్టర్ రంజిత్ కుమార్ ( నారా రోహిత్)కు ఫిర్యాదు అందడంతో అసలు కథ ఊపందుకొంటుంది. రోల్స్ రాయిస్‌‌ను ఎవరు దొంగిలించారనే కోణంలో రంజిత్ కుమార్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఆ పార్టీకి వచ్చిన శివ, కార్తీక్, సుధీర్ కుమార్, ఉమామహేశ్వర్ రావు అనుమానితులుగా మారుతారు. అయితే ఈ నలుగురికి కారు చోరికి సంబంధం ఉందా? వారిలో ఎవరు దొంగిలించారు? వారికి కారు చోరితో సంబంధం లేకపోతే కారు ఏమైపోయింది లాంటి ప్రశ్నలకు సమాధానమే శమంతకమణి చిత్ర కథ.


ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

శమంతకమణి మల్టీస్టారర్ కథ కావడంతో పాత్రల పరిచయంతోనే ఫస్టాఫ్‌లో కొంత భాగం గడిచిపోతుంది. మిగితా సగభాగంలో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, ఆ పాత్రల కష్టసుఖాలతో కథ చకచకా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు రాల్స్ రాయిస్ చోరి కావడం అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో మొదటి భాగంలో ప్రేక్షకుడిని ఆసక్తి కలిగించడంలో దర్శకుడు శ్రీరాం ఆదిత్య తన ప్రతిభను తెరపైన ఆవిష్కరించుకొన్నాడు. ఈ సినిమాకు ముందు ఒకే సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీరాం నలుగురు హీరోలు, సీనియర్ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ పాత్రల చిత్రీకరణలో బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం సినిమాకు ప్లస్ అయింది.


సెకండాఫ్‌లో రేసింగ్

సెకండాఫ్‌లో రేసింగ్

సెకండాఫ్‌లో ఆసక్తిని కలిగించే పాయింట్ ఉండటంతో ఏమి జరిగిందనే అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైన ప్రేక్షకుడికి ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కథలో అనేక ట్విస్టులు, టర్నింగ్‌లు ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేస్తాయి. పాత్రల పరిధి మేరకు దర్శకుడు ఆయా నటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. నారా రోహిత్ ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానాన్ని చక్కగా రాసుకొన్నారు. బలమైన సన్నివేశాల కారణంగా సినిమా ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడగలిగింది. క్లైమాక్స్‌లో ఊహించని విధంగా కథను మలుపు తిప్పి శమంతకమణిని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ అనే ఫీలింగ్‌ను కల్పించాడు.


శ్రీరాం ఆదిత్య.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

శ్రీరాం ఆదిత్య.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

తొలి చిత్రం భలే మంచి రోజు సినిమాతో అభిరుచి ఉన్న దర్శకుడిగా శ్రీరాం ఆదిత్య పేరు సంపాదించుకొన్నారు. తన మలిచిత్రం మల్టీ స్టారర్ కథను ఎంచుకోవడం అతని టాలెంట్‌కు అద్దం పట్టింది. ఐదు ప్రధాన పాత్రలతో మ్యాజిక్ తెర మీద మ్యాజిక్ చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకొన్నాడు. కాకపోతే ఫస్టాఫ్‌ను కొంత ఆసక్తిగా మలిచి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది. డైలాగ్స్ పార్ట్ వరకు ఓకే కానీ.. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ ఉండాల్సింది. తనకు నచ్చేది కాకుండా ప్రేక్షకులకు ఏది నచ్చుతుందనే అంశాలను మరోసారి బేరీజు వేసుకోవాల్సింది. ఓవరాల్ సినిమాను పరిశీలిస్తే ప్రేక్షకుడికి పైసా వసూల్ అనే ఫీలింగ్‌ను కల్పించడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పవచ్చు.


పోలీస్ క్యాప్‌గా మరోసారి మెరిసిన నారా రోహిత్

పోలీస్ క్యాప్‌గా మరోసారి మెరిసిన నారా రోహిత్

ఇటీవల కాలంలో విభిన్న పాత్రలతో ఆకట్టుకొంటున్న నారా రోహిత్‌ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఆయన కెరీర్‌లో పోలీస్ పాత్రను పోషించడం ఇది ఆరోసారి. ఇన్వెస్టిగేషన్ కోణంలో సాగే కథలో రోహిత్ మరోసారి చక్కని నటనను ప్రదర్శించాడు. సెకండాఫ్‌లో తనదైన శైలిలో చెప్పిన డైలాగులు ఆకట్టుకొన్నాయి. కీలక సన్నివేశాల్లో రోహిత్ నటన సినిమాకు బలంగా మారింది.


మాస్ మహారాజాగా సందీప్

మాస్ మహారాజాగా సందీప్

శివ పాత్రలో కనిపించిన సందీప్ కిషన్‌ది పక్కా మాస్ క్యారెక్టర్. గ్రామీణ యువకుడిగా, నగరానికి వచ్చి దొంగతనం కేసులో ఇరుక్కుపోయిన యువకుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రకు సందీప్ న్యాయం చేశాడు. ముఖ్యంగా జైలులో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి చేసిన సన్నివేశాల్లో తాను మంచి ఫెర్హార్మర్ అనే భావనను సందీప్ కలిగిస్తాడు. మాస్, క్లాస్ కోణాలున్న పాత్రతో ప్రేక్షకులను మెప్పించడం ఖాయం.


సెంటిమెంట్‌ను పండించిన సుధీర్

సెంటిమెంట్‌ను పండించిన సుధీర్

కృష్ణ అనే పాత్రలో కనిపించిన సుధీర్‌బాబుది సినిమాలో కీలకమైన పాత్ర. తల్లి ప్రేమకు దూరమైన పాత్ర ద్వారా భావోద్వేగాలను పండించే అవకాశం సుధీర్‌కు దక్కింది. సెకండాఫ్‌లో పబ్‌లో తన కథను వివరించే సీన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. అప్పటివరకు వినోదాత్మకంగా సాగుతున్న కథకు సెంటిమెంట్‌ జోడించి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాడు. రొమాంటిక్, యాక్షన్ హీరోగానే కాకుండా సెంటిమెంట్ పాత్రలను పండించే నటుడు నాలో ఉన్నాడని నిరూపించుకొనే అవకాశం సుధీర్‌కు దక్కింది.


ఆదికి మరో మంచి పాత్ర..

ఆదికి మరో మంచి పాత్ర..

తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకొవాలని ప్రయత్నించే కార్తీక్ అనే యువకుడి పాత్రను ఆది పోషించాడు. లవర్ బాయ్‌గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆదికి ఇది ఓ డిఫరెంట్ క్యారెక్టర్. కామెడీ టచ్‌తో ఆది అలరించాడు. తన పాత్ర మేరకు ఆది పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చాడు.


నామమాత్రంగానే హీరోయిన్లు..

నామమాత్రంగానే హీరోయిన్లు..

శమంతకమణి ప్రధానంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావడంతో హీరోయిన్లకు పెద్దగా పనిలేకుండా పోయింది. అన్యన్య, జెన్నీ హీరోయిన్లుగా కనిపించినప్పటికీ పెద్దగా గుర్తుంచుకొనే పాత్రలు కావు. కథ అంతా సస్పెన్స్, థ్రిల్లర్ కావడంతో ఆ పాత్రలకు పెద్దగా నటించే స్కోప్ కలుగలేదు. కాబట్టి వారు నామమాత్రంగానే మిగిలిపోయారు.


రాజేంద్ర ప్రసాద్ సెంటరాఫ్ అట్రాక్షన్

రాజేంద్ర ప్రసాద్ సెంటరాఫ్ అట్రాక్షన్

ఉమామహేశ్వర్ రావు పాత్రలు రాజేంద్ర ప్రసాద్ కొట్టినపిండి. రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న రాజేంద్రప్రసాద్ తన పాత్రతో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. మనలాంటి యూత్, నా పేరు మహేశ్‌బాబు అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకొంటాయి. ఇంద్రజతో ప్రేమలో పడే సన్నివేశాల్లో తన మార్కును ప్రదర్శించాడు. ఓ మంచి పాత్రతో నటకిరీటి ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాడు.


రఘు కామెడీ అదుర్స్

రఘు కామెడీ అదుర్స్

ఈ సినిమాలో మిగితా పాత్రల్లో సుమన్, సురేఖవాణి, హేమ, తనికెళ్ల భరణి, రఘు, ఇంద్రజ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో కమెడియన్ రఘు కారుమంచి గురించి చెప్పుకోవాలి. నారా రోహిత్‌తో కలిసి రఘు నడిపిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పండించింది. తనదైన మార్కు డైలాగ్స్‌తో రఘు అదరగొట్టాడు. హైదరాబాదీ యాసలో రఘు చెప్పిన డైలాగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. సుధీర్ తండ్రిగా సుమన్ ఓ స్వార్ధపూరితమైన పాత్రలో కనిపించాడు. సుమన్ పాత్రకు పెద్దగా స్కోప్‌ లేకపోయినా క్లైమాక్స్‌లో సెంటర్ పాయింగ్ కావడం ఆయన పాత్రకు ఊరట.


సమీర్ ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణ

సమీర్ ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణ

సాంకేతి నిపుణుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సమీర్ సినిమాటోగ్రఫీ గురించి. చాలా రేసింగ్‌గా సాగే కథనానికి ఆయన తెరకెక్కించిన సీన్లు మరో ప్లస్ పాయింట్స్, పబ్ సీన్లు, జైల్లో సీన్లు చాలా సహజంగా కనిపించాయి. ఆయన అనుభవం ఈ సినిమాకు, దర్శకుడికి అదనపు బలమని చెప్పవచ్చు.


ఫీల్‌గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

ఫీల్‌గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

శమంతకమణి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుకు అత్యంత ప్రాధాన్యం ఉన్న చిత్రం. ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంగా సాగే సీన్లకు ఆయన అందించిన రీరికార్డింగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. కానీ పాటలు ఆకట్టుకునే విధంగా లేక పోవడం ఓ మైనస్ పాయింట్. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డు రచయిత. కానీ ఆయన మార్కు పాటలు ఎక్కడా కనిపించవు. పాటలకు సరైన ప్లేసింగ్ లేకపోవడమే అందుకు కారణమై ఉండవచ్చునేమో.


ఫైనల్‌గా ఈ సినిమా గురించి..

ఫైనల్‌గా ఈ సినిమా గురించి..

శమంతకమణి చిత్రం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రం కాదు. ఈ చిత్రం స్క్రీన్ ‌ప్లే ఆధారంగా సాగే చిత్రం. కొత్త దర్శకుల రూపొందించే సినిమాలు పాతతరం దర్శకుల మేకింగ్‌, సంప్రదాయ పద్దతలకు దూరంగా ఉంటాయి. అయితే సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు, కామెడి అంశాలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటే చిత్రం. ప్రస్తుతం బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల టేస్ట్‌ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతుందనే అంశం ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు రుజువు చేశాయి. ఒకవేళ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయితే భవ్య క్రియేషన్స్ బ్యానర్‌, దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఖాతాలో మరో విజయం చేరడం ఖాయం. ఈ సినిమా హిట్ అయితే నలుగురి హీరోలకు పెద్దగా పేరు వచ్చే పరిస్థితి కనిపించదనే మాటను బలంగా చెప్పవచ్చు.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్


నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్ ఆది ఫెర్ఫార్మెన్స్
శ్రీరాం ఆదిత్య టేకింగ్
సెకండాఫ్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్


మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
స్క్రీన్ ప్లే


సినిమా పేరు: శమంతకమణి

సినిమా పేరు: శమంతకమణి

నటీనటులు: నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌, ఆది, రాజేంద్రప్రసాద్‌, సుమన్‌, ఇంద్రజ, చాందినీ చౌదరి, అనన్య సోని, జెన్నీ హనీ, రఘు కారుమంచి, సురేఖవాణి, హేమ, తనికెళ్ల భరణి
నిర్మాత: వీ ఆనంద్‌ ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్‌
రిలీజ్ డేట్: 2017 జూలై 14


English summary
shamantakamani is the another multi starrer movie in tollywood. Young heroes Nara Rohith, Aadi, Sudheerbabu, Sandeep Kishan, Senior Actor Rajendra Prasad are played lead roles. This movie hits the theatre on July 14th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu