twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌండు లేని 'శంఖం'

    By Staff
    |
    Shankam
    Shankam
    -కులదీప్ రాయళ్ల
    చిత్రం: శంఖం
    తారాగణం: గోపీచంద్, త్రిష, సత్యరాజ్, కోటా శ్రీనివాసరావు, తెలంగాణా శకుంతల, ఆలీ, చంద్రమోహన్,
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, బెనర్జీ తదితరులు.
    సంభాషనలు: అనిల్
    పాటలు: వేటూరి, భాస్కరబట్ల రవికుమార్
    సంగీతం: తమన్ యస్
    నిర్మాత: జె భగవాన్, జె పుల్లారావు
    కథ, స్ర్కీన్-ప్లే, దర్శకత్వం: శివ
    విడుదల తేదీ: సెపెంబరు 11, 2009

    మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ వున్న కథానాయకుడు గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'శంఖం'. ఇన్నాళ్లు యాక్షన్ మూవీస్ తో అలరించిన గోపీచంద్ 'యజ్ఞం' తర్వాత మరో రాయలసీమ బ్యాగ్రౌండ్ లో నడిచే ఫ్యాక్షన్ కథతో మనముందుకు వచ్చాడు. కథ, కథనంలో వైవిధ్యం లేకపోయినప్పటికీ గోపీచంద్ నటన సినిమాకు జీవాన్నిచ్చిందని చెప్పవచ్చు.

    కథ విషయానికొస్తే చందు(గోపీచంద్) తన మామయ్య(చంద్రమోహన్)తో కలసి ఆస్ర్టేలియాలో వుంటాడు. చందుకు తన తల్లిదండ్రులు మరణించారని చెప్పుంటాడు వాళ్ల మామయ్య. కానీ చందు తండ్రి రాయలసీమ శివన్న(సత్యరాజ్) మాత్రం బతికేవుంటాడు. ఇదిలా వుంటే చందు పెళ్లికి పిల్లను వెతికే పనిలో వుంటాడు వాళ్ల మామయ్య. ఇలా అమ్మాయిని వెతుకుతున్న క్రమంలో మహాలక్ష్మి(త్రిష) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు చందు. కానీ మహాలక్ష్మి చందుని ప్రేమించదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మహాలక్ష్మి కూడా తనని ప్రేమించేలా చేస్తాడు చందు. మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని చందుకి చెప్పాలనుకున్నప్పుడే మహాలక్ష్మి అత్తయ్య(తెలంగాణా శకుంతల) ఆస్ట్రేలియా వచ్చి తన తనయుడి(వేణుమాధవ్)కి ఇచ్చి పెళ్లి చేయాలని మహాలక్ష్మిని బలవంతంగా ఇండియాకు తీసుకెళ్తుంది. విషయం తెలుసుకున్న చందు మహాలక్ష్మి కోసం ఇండియాకు వస్తాడు.

    ఇదిలా వుంటే ఫ్లాష్ బ్యాక్ లో పశుపతి(కోటా శ్రీనివాసరావు)కి, శివన్నకు వైరం వుంటుంది. పశుపతి పేద ప్రజల భూములు లాక్కుని, వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తుంటాడు. దీనికి శివన్న అడ్డు పడటమే కాకుండా పశుపతిని జైలుపాలు చేస్తాడు. దీంతో శివన్న పై పగ పెంచుకున్న పశుపతి శివన్న కవల పిల్లల్లో ఒకరిని, ఆయన భార్య(సీత)ని చంపేస్తాడు. దీంతో శివన్న భార్య తనకున్న ఒక్క కొడుకుని తన అన్నయ్య(చంద్రమోహన్)కు అప్పజెప్పి తనని ఇక్కడి నుండీ దూరంగా తీసుకెళ్లమని చెప్పి కన్నుమూస్తుంది. దీంతో ఆమె అన్నయ్య ఆ పిల్లాన్ని తీసుకొని ఆస్ట్రేలియా వచ్చేస్తాడు. అలా పెరిగిన పిల్లాడే చందు.

    ఇక చందు ప్రేమించిన మహాలక్ష్మి పశుపతి కూతురే. చందు శివన్న కొడుకేనని తెలిసిన పశుపతి చందుకి తన కూతురుని ఎర చూపి శివన్నపై ఉసిగొల్పుతాడు. శివన్న తన తండ్రి అన్న విషయం తెలియని చందు అతని పై దాడి చెయ్యబోయి ఖంగుతింతాడు. కానీ చందుని చూసిన శివన్న చందు తన కొడుకేనని తెలుసుకొని ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ఆ తర్వాత తన మామయ్య ద్వారా అసులు విషయం తెలుసుకున్న చందు తన తల్లిని హతమార్చిన పశుపతి, అతని తమ్ముడిని అంతమొందించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో శివన్నను కూడా హతమారుస్తారు పశుపతి మనుషులు. ఇక మిగిలిన కథ చందు పశుపతిని ఎలా అంతమొందిచి, తన ప్రేమను గెలిపించుకున్నాడనేది...

    ఇక నటీనటుల విషయానికొస్తే కథానాటకుడు గోపీచంద్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఇన్నాళ్లు కామెడీ చెయ్యడానికి ఇబ్బంది పడ్డ గోపీచంద్ ఈ సినిమాతో ఆ అడ్డంకిని అధికమించాడు. సినిమా ప్రథమార్థంలో వచ్చే కామెడీ సీన్లలో మంచి ఈజ్ ను ప్రదర్శించాడు. ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్లలో కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. కథానాయిక త్రిష గ్లామర్ కొద్దిగా తగ్గినట్టుంది. నటన ఫర్వాలేదు. ఇక తమిళ నటుడు సత్యరాజ్ శివన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయారు, హుందాగా నటించారు. కానీ కోటా శ్రీనివాస్ రావుని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ప్రథమార్థంలో ఆలీ కామెడీ, ద్వితియార్థంలో వేణుమాధవ్ కామెడీ బాగున్నా, డబల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులకు రుచించవు. సెటైర్లు వేయడంలో సిద్దహస్తుడైన కృష్ణ భగవాన్ కు మాత్రం ఈ చిత్రంలో ఆ అవకాశం రాలేదు. ఆయన పాత్ర వృధాగా పోయింది.

    ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే నూతన సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం ఫర్వాలేదు. మూడు పాటలు బాగున్నాయి. అనిల్ అందించిన సంభాషనల్లో పదును కొరవడింది. ఫర్వాలేదనిపించే స్థాయిలో వున్నాయి. ఇక దర్శకుడు శివ తను చెప్పాలనుకున్న కథను బాగానే చెప్పగలిగాడు. కానీ కథలోనే కొత్తదనం లేదు. కథనం కూడా సాదాగా వుంది. తర్వాత ఏమి జరగబోతోందనేది ప్రేక్షకుడు ముందుగానే పసిగడతాడు. 'ఆది', 'జయం మనదేరా' లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఇక ఫ్యాక్షన్ సినిమా అనగానే గుర్తొచ్చేది ఏరులై పారే రక్తపాతం. ఈ చిత్రంలో కూడా అదే కోవలోకే వస్తుంది.

    మొత్తానికి ఈ చిత్రం యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే వారికి, గోపీచంద్ అభిమానులకి మాత్రమే నచ్చుతుంది. మిగిలిన వారికి ఈ సినిమా చూడాలంటే కొంత ఇబ్బందే, కానీ గోపీచంద్ నటన ప్రభావితం చెయ్యవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X