For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెంటిమెంటల్‌ 'స్టైల్‌'

  By Staff
  |

  Style
  -జోశ్యుల సూర్యప్రకాష్‌

  సినిమా: స్టైల్‌

  విడుదల తేదీ: 12/1/2006

  నటీనటులు: లారెన్స్‌, ప్రభుదేవా, రాజా, కమలినీ ముఖర్జీ,

  చార్మి, భానుచందర్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, సమీర్‌, కొండవలస తదితరులు

  అతిధిపాత్రలు: చిరంజీవి, నాగార్జున

  సంగీతం: మణిశర్మ

  కెమెరా: కబీర్‌లాల్‌

  మాటలు: కులశేఖర్‌

  కథ, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

  నిర్మాత: శ్రీమతి లగడపాటి శిరీష్‌ శ్రీధర్‌

  'మెరుపై సాగరా- గెలుపే నీదిరా' అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన 'స్పీడ్‌ డ్యాన్సర్‌' లారెన్స్‌ తన 'మాస్‌' టచ్‌తో చేసిన నృత్య ప్రయోగం 'స్టైల్‌' చిత్రం. కొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలి డ్యాన్సులతో అలంకరించినా కథ, కథనంలో పూర్తి స్ధాయి బిగి లేనందున ఆశించిన రీతిలో అలరించదు. కానీ సృజనాత్మక ప్రయోగం చేసిన దర్శక, నిర్మాతలు అభినందనీయులు.

  నృత్య నేపధ్యంలో సాగే ఈ సినిమా కళ్ళు చెదిరే డ్యాన్స్‌ కాంపిటీషన్‌తో ప్రారంభమవుతుంది. కథలోకి వస్తే రాఘవ (లారెన్స్‌) డ్యాన్సే ప్రాణంగా బతుకుతుంటాడు. పెద్ద డ్యాన్స్‌ర్‌ని అవుతానని తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. డ్యాన్స్‌ స్కూలులో పనిచేసుకుంటూ బతికే అతను గణేష్‌ (ప్రభుదేవా)కు ఏకలవ్య శిష్యుడు. చిరంజీవికి వీరాభిమాని. ఆ స్కూలులో చేరిన శృతి (చార్మి)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆమె అప్పటికే రాజా (ఆనంద్‌ ఫేం)తో ప్రేమలో ఉందని తెలుసుకుని నిరుత్సాహపడతాడు. ఇంతలో అతనికి ఒక ఆఫర్‌ వస్తుంది. తాను గురువుగా భావించే గణేష్‌ డ్యాన్స్‌ పూర్తిగా నేర్పి పోటీకి పంపుతానంటాడు. గత సంవత్సరం జరిగిన పోటీలో గురువు గణేషే విజేత. ఆ ఆనందంలో అతను ఇంటికి తిరిగి వస్తుండగా, ఓడిన ఆంథోనీ గ్రూపు మనుషులు చేసిన యాక్సిడెంట్‌లో కాళ్ళు కోల్పోతాడు. అంతేగాక వాళ్ళు వచ్చి 'ఇక నీవు డ్యాన్స్‌ చేయలేవు' అని ఎగతాళి చేయడంతో రగిలిపోతూ రాఘవను ఎంచుకుంటాడు. అక్కడి నుంచి రాఘవ విలన్‌ గ్రూపును ఓడించి ఎలా విజేత అయ్యాడన్నది తెర మీద చూడాల్సిందే.

  సాంకేతికంగా ఉన్నత స్ధాయిలో ఉన్న ఈ చిత్రానికి లారెన్స్‌ నృత్యాలే ప్రాణం. తన గత చిత్రం 'మాస్‌' లా తల్లి సెంటిమెంట్‌తో కూర్చిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే సరిగా ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథనం ఊహించే విధంగా సాగింది. ఫస్టాఫ్‌లోనే లారెన్స్‌ నృత్యాలు బాగా చేస్తాడని ఎస్టాబ్లిష్‌ కావడంతో విలన్‌ బ్యాచ్‌ని ఎలాగైనా ఓడిస్తాడని అనిపించి ఆసక్తి పోతుంది. సెటప్‌ సీన్లపై తీసుకున్న శ్రద్ధ సెకండాఫ్‌లో కనపడదు. ముఖ్యంగా ఇది ప్రభుదేవా ప్రతీకారం తీర్చుకునే కథో, లారెన్స్‌ విజేత అయ్యే కథో అనేది స్పష్టం కాలేదు. దాంతో ఎవరిని ఫాలో అయి ముందుకు సాగాలన్నది ప్రేక్షకుడికి కష్టమైన ప్రశ్నే. 'భద్రాచలం' సినిమాలా సాధారణ వ్యక్తి, అసాధారణంగా ఎదిగి తన గురువు పగ ఎలా తీర్చాడన్నది చూపితే బాగుండేది. కులశేఖర్‌ మాటలు సినిమాలో చక్కగా ఇమిడిపోయాయి. కబీర్‌లాల్‌ కెమెరా, లారెన్స్‌ డ్యాన్స్‌ ఎనర్జీని సరిగానే క్యాచ్‌ చేసింది. చిరంజీవి, నాగార్జున అతిధి పాత్రలు కథకు కలిసి రాకపోయినా ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. చార్మి చేసిన డ్యాన్సులు, చిరంజీవి రిక్షావాలా హిట్‌సాంగ్‌ 'రూప్‌ తేరా మస్తానా' రీమిక్స్‌ బాగుంది. అలాగే నటరాజు స్ధానంలో కమలినీ ముఖర్జీని ఊహిస్తూ చూపిన దృశ్యాలు దర్శకుడి సృజనాత్మతకు నిదర్శనం. సినిమాలో ధర్మవరపు హాస్యం అరకొరగా ఉంది. దానిని కొంత పొడిగించి ఉంటే బాగుండేది. మణిశర్మ సంగీతం బాగుంది. విలన్‌ ఆంథోనీ చేసిన డ్యాన్స్‌ బాగుంది. 1984లో వచ్చిన 'బ్రేక్‌ఇన్‌' చిత్రాన్ని గుర్తుకు తెచ్చే ఈ సినిమా బి,సి సెంటర్లలో ఆడే అవకాశముంది.

  గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X