Sundarakanda Movie Review: సుందరకాండ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవీ విజయ్ కుమార్, వ్రితీ వఘానీ, వీకే నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అభినవ్ గోమటం, సిరి లేళ్ల, వీటీవీ గణేష్, అజయ్, రూపాలక్ష్మీ, సునైనా, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: వెంకటేశ్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి
మ్యూజిక్: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: ప్రదీష్ ఎం వర్మ
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఆర్ట్: రాజేశ్ పెంటకోట
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్
రిలీజ్ డేట్: 2025-08-27
ముదిరిన బ్రహ్మచారి సిద్దార్థ్ (నారా రోహిత్) నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ.. పెళ్లి చేసుకోవడానికి కష్టాలు పడుతుంటాడు. పెళ్లి చూపుల్లో కొన్ని కారణాలు చెప్పి అమ్మాయిలను రిజెక్ట్ చేసుకొంటూ వస్తుంటాడు. జీవితంలో పెళ్లి పెద్ద సమస్యగా మారినప్పటికీ.. తనకు కావాల్సిన క్వాలిటీస్ విషయంలో రాజీ పడడు. అలాంటి పరిస్థితుల్లో ఐరా (వ్రితి వఘ్నీ)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తనకు కావాల్సిన క్వాలిటీస్ కూడా ఆమెలో ఉండటం పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. అయితే సిద్దూ పెళ్లికి, ఐరా తల్లి వైష్ణవి (శ్రీదేవీ విజయ్ కుమార్) అడ్డంకిగా మారుతుంది. ఐరాను పెళ్లి చేసుకోవడానికి ఎదురైన సమస్యను అధిగమించి.. వైష్ణవిని ఒప్పించేందుకు సిద్దూ రంగంలోకి దిగుతాడు.

కాబోయే భార్యలో సిద్దూ ఎలాంటి క్వాలిటీస్ కోసం వెతుక్కొన్నాడు? సిద్దూ పెళ్లికి ఎదురైన సమస్య ఏమిటి? చిన్నతనంలో స్కూల్‌లో సీనియర్ అమ్మాయితో ప్రేమ ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టింది? ఐరాతో ఎలా ప్రేమలో పడ్డాడు? ఐరాతో పెళ్లికి వైష్ణవి ఎలా సమస్యగా మారింది? వైష్ణవిని ఎందుకు? ఎలా ఒప్పించాల్సి వచ్చింది? వైష్ణవితో సిద్దూ ఉన్న సమస్య ఏమిటి? ఐరాతో సిద్దూ పెళ్లికి వైష్ణవి ఒప్పుకొన్నదా? ఐరాను పెళ్లి చేసుకోవడానికి సిద్దూ ఎలాంటి కష్టాలు పడ్డాడు అనే భావోద్వేగమైన, వినోదభరితంగా సాగిన కథనే సుందరకాండ సినిమా.
వెంకటేశ్ నిమ్మలపూడి రాసుకొన్న సుందరకాండ సినిమాకు హిందీలో విజయవంతమైన లమ్హే (Lamhe), తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ముత్తానా కత్రిక, మలయాళ చిత్రం వెళ్లిముంగ సినిమా కథ చాలా దగ్గరగా ఉంటుంది. అనిల్ కపూర్, శ్రీదేవీ జంటగా యష్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన లమ్హే. నటి కుష్బూ నిర్మాతగా సుందర్ సీ, పూనమ్ బజ్వా జంటగా నటించిన ముత్తానా కత్రిక సినిమాల కథ దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక తెలుగులో వచ్చిన వెంకటేష్, మీనాల సుందరకాండ సినిమా కథకు అపోజిట్‌గా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాల స్పూర్తితో సుందరకాండను తెరకెక్కించారా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. తెలుగు నేటివిటికి, తాను నమ్ముకొన్న నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథను, సన్నివేశాలను అల్లుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సత్య, అభినవ్, వీకే నరేష్ లాంటి కమెడియన్ ఆరిస్టులతో కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడిని సినిమాకు ఎంగేజ్‌చేయడంలో తొలి చిత్ర దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
ఇక సుందరకాండ సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో సిద్దూ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇతర పాత్రలను పరిచయం చేయడానికి, స్టోరిని విపులంగా చెప్పడానికి దర్శకుడు కాస్త సమయం ఎక్కువగానే తీసుకోవడం.. సినిమాను ఉద్దేశపూర్వకంగా సాగదీశాడా? అనే అనుమానం కలుగుతుంది. కథలో సమస్యను సృష్టించడానికి ఇంటర్వెల్ వరకు సమయం తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే స్టోరీలో కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దర్శకుడు వెంకటేష్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతీ ఐదు నిమిషాలకు ట్విస్టు, ఓ సమస్యను సృష్టించి దానిని క్లియర్ చేస్తూ కథను ముందుకు నడిపించిన విధానం బాగుంది. అయితే వైష్ణవి, సిద్దూ పాత్రల మధ్య చోటు చేసుకొన్న సమస్య అతి సున్నితమైంది. దానిని చాలా మెచ్యురిటీతో డీల్ చేసిన విధానంతోనే ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. చాలా సంవత్సరాలుగా హీరో నారా రోహిత్ సక్సెస్ కోసం తంటాలుపడుతున్నాడు. అయితే ఈసారి ప్రయోగాలు చేయకుండా తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ డ్రామాను అటెంప్ట్ చేయడం మంచి పరిణామంగా కనిపించింది. డ్యాన్సులు, ఫైట్స్ చేయడానికి కష్టాలు పడినా.. కుదురుగా పెర్ఫార్మ్ చేయడంలోను, ఎమోషన్స్ పలికించడంలో మెప్పించాడు. సత్య, అభినవ్, నరేష్ సహకారంతో సినిమా భారన్నంతా తన భుజాల మీద మోసి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇక శ్రీదేవీ విజయ్ కుమార్ ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్. హుందాగా తన పాత్రలో ఒదిగిపోయారు. నూతన నటి వ్రితీ సినిమాకు కావాల్సిన గ్లామర్ సరుకును అందించడం మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెప్పించింది. కొరియన్ పిచ్చి ఉన్న భార్యగా రూపాలక్ష్మీ కామెడీని పండించింది. సునైనా, సత్య కాంబినేషన్ బాగుంది. ఇతర నటీనటులంతా ఈ సినిమా విజయానికి కావాల్సిన బలాన్ని అందించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రదీప్ వర్మ వైజాగ్ అందాలను అద్బుతంగా కెమెరాలో బంధించారు. సన్నివేశాలను అందంగా చూపించడానికి ఎంచుకొన్న కలర్ ప్యాలెట్ బాగుంది. కంటికి ఇంపుగా ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా రూపొందించారు. పాటలు అంత గొప్పగా లేకపోయినా.. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పలు సన్నివేశాలను మ్యూజిక్‌తో ఫీల్ గుడ్‌గా మార్చారు. ఈ సినిమా రాజేశ్ పెంటకోట చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. రోహన్ తన కత్తెరకు ఇంకా పదును పెట్టాల్సింది. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
సుందరకాండ చిత్రం గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా తెలిసిన రెగ్యులర్, రొటీన్ ఫ్యామిలీ డ్రామా. కామెడీ, లవ్ అంశాలను మేళవించి రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే విధంగా తొలి చిత్ర దర్శకుడు వెంకటేష్ ఈ చిత్రాన్ని మలిచాడు. ఫన్ ఓరియెంటెడ్, మ్యారేజ్ డ్రామాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. విభిన్నమైన కంటెంట్‌ను చూడాలనుకొనే వారికి ఈ సినిమా అంతగా రుచించదు. అంచనాలు ఉన్నా, లేకపోయినా.. ఈ సినిమా మాత్రం రెగ్యులర్ ఆడియెన్స్‌ను ఎలాంటి పరిస్థితుల్లోను నిరాశపరచదు. టికెట్ కొన్న ఆడియెన్‌కు పైసా వసూల్ చిత్రం. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఇది. వీలైతే ఈ వినోద భరిత చిత్రాన్ని థియేటర్‌లో అస్వాదించండి.


Click it and Unblock the Notifications











