twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైంపాస్ 'కింగ్'(రివ్యూ)

    By Staff
    |

    సూర్య ప్రకాష్ జోశ్యుల
    బ్యానర్:కామాక్షి కళా మూవీస్ తారాగణం:నాగార్జున,త్రిష,మమతా మోహన్ దాస్,శ్రీహరి,బ్రహ్మానందం,షాయీజి షిండే,కృష్ణ భగవాన్,గీత,ధర్మ వరపు,చంద్రమోహన్ తదితరులు. కథ :కోన వెంకట్,గోపీ మోహన్ ఆర్ట్ :ఎస్. ప్రకాష్ ఎడిటింగ్: వర్మ సంగీతం:దేవిశ్రీ ప్రసాద్ కెమెరా:ప్రసాద్ మురెళ్ళ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల నిర్మాత:శివప్రసాద్ రెడ్డి రిలీజ్ డేట్ :25 డిసెంబర్ 2008

    బాలీవుడ్ హిట్ 'వెలకమ్' లోని కథను తీసుకుని దానికి మరో బాలివుడ్ హిట్ చిత్రం 'రేస్' ట్విస్ట్ నిస్తే పుట్టిందే 'కింగ్'.అలాగే సోర్స్ ఎక్కడిదయినా సోల్ బాగుంటే సినిమా సూపర్ అనటానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారన్నది తెలిసిందే. అయితే ఊహించినట్లుగానే కామిడీ సన్నివేశాలు బాగానే పండినా కథలో ట్విస్టులు ఎక్కువ అవటం..చంద్రముఖి,చంద్రలేఖ వంటి సినిమాలు పేరడీ చేయటం విసుగు అనిపిస్తుంది.పూర్తిగా నాగార్జున చరిష్మా మీద నడిచిన ఈ చిత్రం అసభ్యత,అశ్లీలం లేకపోవటం ఫ్యామిలలకి నచ్చే అంశం.

    దాదాగిరి లోకి కొత్తగా ఎంటర్ అయిన బొట్టు శ్రీను(నాగార్జున)మంచికి సపోర్టు ఇస్తూంటాడు . అలాగే సిటీలో అప్పటికే ఆ వృత్తిలో సెటిలయిన లోకల్ డాన్ జ్ఞానేశ్వర్(శ్రీహరి)ని ఎదిరిస్తాడు. అంతేగాక జ్ఞానేశ్వర్ ముద్దుల చెల్లెలు శ్రావణి(త్రిష)తో ప్రేమలో పడతాడు. అయితే సింగర్ గా ట్రై చేస్తున్న శ్రావణి జీవితాశయం ఈ దాదాగిరిలకు దూరంగా ఓ మంచి కుర్రాణ్ని చూసి పెళ్ళి చేసుకోవాలని. అందులో భాగంగా ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. శ్రీను ని శరత్ (సునీల్) అనే ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుకుని పొరబడి ప్రేమిస్తుంది. సర్లే ఆమె ప్రేమలో పడటమే ముఖ్యమనుకున్న శ్రీను..శరత్ ని తప్పించి ఆ ప్లేసులో కంటెన్యూ అవుతూంటాడు. జ్ఞానేశ్వర్ మొదట అనుమానించినా తర్వాత నమ్మి ఓ రోజు ఎంగేజమెంట్ ఫిక్స్ చేస్తారు. అయితే ఆ సమయంలో అతన్ని కింగ్ గా గుర్తు పట్టి కొందరు వెంబడించి చంపటానికి ప్రయత్నిస్తారు.ఇంతకీ కింగ్ ఎవరు..శ్రీనుకి..కింగ్ కి సంభంధం ఏమిటి...శరత్ గా శీను ఆడుతున్న నాటకం బయిటపడిందా..అన్నది తెరపైన చూడాల్సిందే..

    ఒకరు మరొకరు ప్లేసులోకి వెళ్ళటం,అలాగే ఒకరు మరొకరులా నటించటం అనే ప్రూవ్ అయిన రెండు కామెడీ అంశాలునే తీసుకునే కింగ్ కథ అల్లారు. అయితే కథలో మలుపులు ఎక్కువ అవటం దెబ్బ తీసింది. ఎక్కడో క్లైమాక్స్ ట్విస్ట్ లో విలన్ ఎవరో తెలియటంతో..అతన్ని ఎదిరించటానికి..ఎత్తు కు పై ఎత్తు వేయటానికి స్క్రీన్ టైమ్ మిగలకుండా పోయింది. దాంతో కథ కొంత దూరం వెళ్ళే సరికి ప్రక్క దారి పట్టి చంద్రముఖిని,చంద్రలేఖను(నాగార్జున) పేరడీ చేయాల్సి వచ్చింది. మరికాస్సేపటికి ప్రముఖ సంగీత దర్శకుడు జయసూర్య (బ్రహ్మానందం)పాత్రతో చక్రి ని సెటైర్ చేయిస్తూ కామిడీ పండించే ప్రయత్నం చేయించింది. మరో కథకు పెద్ద సంభందం లేకపోయినా లేడీ విలన్ (మమతా మోహన్ దాస్)ని ఎంటర్ చేయిస్తుంది.

    సరే అనుకునే లోపే వేరే వాళ్ళు (జయప్రకాష్ రెడ్డి,షాయిజి షిండే,కృష్ణ భగవాన్) విలన్స్ అని తేలుస్తుంది. మరి కాస్సేపటికి అబ్బెబ్బె..అసలు విలన్ ఎరవంటే అనే మరో ట్విస్టు విప్పుతుంది. అలా ఎక్కడో క్లైమాక్స్ లో అసలు ట్విస్టు విప్పుతుంది. ఇలా ఇన్ని ముళ్ళు ఉన్నా శ్రీను వైట్ల స్పాంటినిటి,జోక్స్ బాగా పండటం ప్లస్ పాయింట్. పాటల్లో కింగ్ టైటిల్ సాంగ్ బాగుంది. విడివిడిగా ఉన్నా బ్రహ్మానందం కామిడీ సన్నివేశాలు బాగా పండాయి.ఇక త్రిష ఎప్పటిలాగే గ్లామర్ డాల్ పాత్రను తనకలవాటైన రీతిలో పోషించింది.శ్రీహరి క్యారెక్టర్ పూర్తిగా అమాయికత్వంతో కూడింది కావటంతో సెకెండాఫ్ లో అతన్ని నాగార్జున టీజ్ చేస్తుంటే నవ్వు బదులు జాలి వేస్తుంది. అలాగే రెడీ,ఢీలలో అదరకొట్టిన మాస్టర్ భరత్ ఇందులో పెద్దగా ఉపయోగించుకోలేదు.డైలాగులు మరింత షార్పుగా ఉంటే ఇంకా బాగా పేలేవి. ఓం శాంతి ఓం తరహా స్పెషల్ సాంగ్ హడావిడిగా చుట్టేసిన ఫీలింగ్ తీసుకొచ్చి అందరూ ఊహించినంత కిక్కు ఇవ్వలేకపోయింది. ప్రసాద్ మురెళ్ళ కెమెరా,వర్మ ఎడిటింగ్ పనితనం బాగుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం డిజప్పాయింట్ చేస్తుంది. ఇక కథా రచయితలుగా గోపీ మోహన్,కోన వెంకట్ మరికాస్త మనస్సు పెట్టి స్క్రిప్టు వంటకం చేస్తే బాగుండేది. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సారి గ్రాఫిక్స్ ఎక్కువ చోటు చేసుకున్నాయి. అయితే ఆయన తరహా కామెడీ పంచ్ లు పడినప్పుడు బాగా రెస్పాన్స్ వస్తోంది.

    మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకుండా వెళ్ళి ,కొన్ని లోపాలుని పూర్తిగా వదిలేస్తే...బాగుందనిపిస్తుంది.అలాగే సెకెండాఫ్ లో కొంత ట్రిమ్ చేస్తే బాగుండుననిపించే ఈ చిత్రం టైం పాస్ కి పనికొస్తుంది. ట్రై చేయచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X