»   » ఓ మృగాడి కథ ('కీచక' రివ్యూ)

ఓ మృగాడి కథ ('కీచక' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

యదార్ద సంఘటనలను తెరకెక్కించటం ఎప్పుడూ రిస్కే. ఎందుకంటే సినిమాటెక్ గా మార్పులు చేస్తే యధార్దాన్ని వక్రీకరించినట్లుంటుంది. అలాగని జరిగింది జరిగినట్లు తెరకెక్కిద్దామంటే సినిమా గ్రామర్ కూ, గ్లామర్ కూ లొంగదు. సరిగ్గా అలాంటి సమస్యనే ఎదుర్కొంటూ 'కీచక' తెరకెక్కింది. అయితే దర్శకుడు సాధ్యమైనంతగా ఉన్నది ఉన్నట్లుగా చూపాలనే ఆలోచనతో ముందుకు వెళ్లినట్లు స్పష్టంగా అర్దమవుతుంది. దాంతో కొన్ని సార్లు ఇబ్బందికరంగానూ, సీన్స్ రిపీట్ అవుతున్నట్లు అనిపించినా తొలి చిత్రానికే ఇలాంటి కథని ఎంచుకున్న దర్శకుడు సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. నాగపూర్ లో యదార్దం గా జరిగిన సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కొన్ని సార్లు డాక్యుమెంటరిగా అనిపించినా, దర్శకుడి స్క్రీన్ ప్లే నైపుణ్యంతో ఆ ఛాయలను అధిగమించటానికి ప్రయత్నించారు. సినిమాలో ఎమోషన్ కంటెంట్ తక్కువైందనిపించే ఈ సినిమా వాస్తవిక చిత్రాలపై ఆసక్తి చూపించేవారికి నచ్చుతుంది.

గాంధీనగర్ బస్తీ లో సుజాత(యామినీ భాస్కర్) అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆమె వచ్చేసరికి అక్కడ పరిస్ధితులు ఏ మాత్రం బాగోవు..కోటి(జ్వాలా కోటి) అనే రేపిస్ట్,రౌడీ ఆ బస్తీలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, అందరినీ భయభ్రాంతులను చేస్తూంటాడు. అతనికి అఫ్పటికే 300 వందల మందని రేప్ చేసిన చరిత్ర ఉంటుంది. దాంతో సుజాతకు సైతం చాలా మంది అక్కడ నుంచి వెళ్లిపొమ్మని సలహా ఇస్తారు. కానీ సుజాత అక్కడకు ఓ లక్ష్యం మీద వచ్చానని, అది నెరవేరేవరకూ ఆ బస్తీ వదలనని, తన లక్ష్యం నెరవేందుకు అసరమైతే తన ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి సిద్దమని అంటుంది. ఇంతకీ సుజాత లక్ష్యం ఏమిటి...ఆమె రాకకూ, రేపిస్ట్ కోటికు ఏమన్నా సంభంధం ఉందా...కోటి చరిత్ర ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


మొదటే చెప్పుకున్నట్లు యధార్దం సంఘటనలను సీన్స్ గా మార్చుకునే క్రమంలో కొంత డాక్యుమెంటరీ వాతావరణం ఏర్పడింది. దాంతో సినిమాలో డ్రామా బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా కథ... రేపిస్ట్ గా కోటి జీవితం ఎలా మొదలైంది ముగిసింది..గానా లేక అతన్ని చంపటానికి వచ్చిన సుజాత ఏ ఇబ్బందులు పడింది అన్న కథ గానా అనే క్లారిటి కొన్ని చోట్ల మిస్సైనట్లు అనిపించింది. దాంతో కథ డైరక్టర్ పాయింటాఫ్ వ్యూ లో....రెండు వైపుల నుంచీ నడవటంతో ఎవర్ని ఫాలో అవ్వాలా అనేది కొంత సంసయంతో ఫస్టాఫ్ గడిచింది. అయితే ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కథలో కీలకమైన మలుపు రావటం, సెకండాఫ్ వేగంగా నడిచి, కథ క్లైమాక్స్ కు రావటం ప్లస్ అయ్యాయి.


యధార్ద సంఘటనలతో చెప్పబడే ఈ కథలో ... చట్టం, పోలీస్ లు, మీడియా వంటివి కథలో ఎక్కడా ప్రస్తావన లేకపోవటం ఆశ్చర్యమనిపిస్తుంది. కథ జరిగే బస్టీ..ప్రపంచానికి ఉన్నట్లుగా..అక్కడి వారు..తమ కష్టాలను అక్కడే ఉండిపోతారు కానీ...ఆ నరకం నుంచి బయిటపడటానికి కానీ లేదా ప్రక్కనున్న బస్తీల జనం నుంచి సపోర్ట్ తెచ్చుకోవటం గానీ జరగదు. ఇవన్నీ స్క్రిప్టు విషయంలో తీసుకున్న సినిమా లిబర్టీస్ లాగ అనిపిస్తాయి.


అలాగే సుజాత పాత్ర ఇంటి ప్రక్కనుండే కుటుంబం (తల్లి,కొడులను) ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేయటం వంటివి బాగున్నా..వాటి పర్శస్ ఏమిటో క్లారిటీ లేదు. అలాగే సుజాతను చంపటానికి వచ్చే ముసలాడు, సుజాత ఇంటికి వచ్చే ముసలాడు పాత్ర సరిగ్గా అర్దం కాదు...ఎడిటింగ్ లో పోయాయో ఏంటో. రఘుబాబు పాత్ర బాగా డిజైన్ చేసారు కానీ..ఆ పాత్ర ఎండింగ్ లో రావల్సినంత ఎమోషన్ కంటెంట్ కనెక్ట్ కాలేదనిపించింది.


ఇవన్నీ ప్రక్కన పెడితే...దర్శకుడుగా చౌదరి.. ఈ చిత్రం జానర్ కు సరపడ 'రా' మేకింగ్ తో చాలా సీన్స్ ఆకట్టుకున్నారు. అలాగే నటీనటుల నుంచి మంచి నటననే రాబట్టారని చెప్పాలి. తొలి చిత్రమైనా ఆ తడబాటు ఎక్కడా కనపడదు. కొన్ని సీన్స్ చూస్తూంటే మంచి కమర్షియల్ సబ్జెక్టుని బాగా డీల్ చేయగలరని అనిపిస్తుంది. టెక్నిషియన్స్ నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టి, తక్కువ బడ్జెట్ లో టెక్నికల్ విలువలతో కూడిన చిత్రం ఇచ్చారనిపిస్తుంది.


నటీనటుల విషయానికి వస్తే...ప్రధాన పాత్ర రేపిస్ట్ గా చేసిన జ్వాలా కోటి..తన పాత్రలో జీవించాడు. తెలుగుకు మంచి విలన్ దొరికాడని చెప్పచ్చు. ఇక మిగతా అర్టిస్టులలో నాయుడు, వినోద్, యామినీ భాస్కర్ తమ పరిధిలో బాగా చేసారు. రఘుబాబు చేసింది కొద్ది సీన్స్ అయినా చాలా బాగా చేసారు. కామెడీ కాకుండా ఇలాంటి సగటు మనిషి పాత్రల్లో కూడా ఆయన అదరకొడతారనిపిస్తుంది.


టెక్నీషియన్స్ లో కమలాకర్ ఉన్నంతలో కెమెరా వర్క్ బాగా ఇచ్చారు. సినిమా మూడ్ కు తగినట్లు కెమెరా యాంగిల్స్ తో న్యాయం చేసారు. డైలాగు రచయిత రాంప్రసాద్ ...డైలాగులు చాలా చోట్ల సిట్యువేషన్ కు తగ్గట్లు సాగి పేలాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ ..మరింతగా చూసి సీన్స్ రిపీట్ కాకుండా చేసి ఉంటే బాగుండేది. సంగీతం విషయానికి వస్తే...రెండు పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ కూడా కొంతవరకూ ప్లస్ అయ్యింది.ఫైనల్ గా...ఈ సినిమా లో అవయవాలు(ఓ చోట రొమ్ములు, మరోచోట అంగం) కోసేసే సన్నివేశాలు,సిగెరెట్లుతో స్త్రీని హింసించటం వంటివి తగ్గించి, ఎమోషన్ కంటెంట్ పెంచి, క్లైమాక్స్ ని హడావిడి తగ్గించి మరింత ఎఫెక్టివ్ గా చూపి ఉండే ఖచ్చింతంగా ఎక్కువ మందిని ఆకర్షించే చిత్రం అయ్యేది. అయినప్పటికీ ...ఈ చిత్రం యధార్ద సంఘటనలు తెరపై చూడటంపై ఆసక్తి చూపేవారికి మంచి ఆప్షనే.


Telugu movie Keechaka review

బ్యానర్: శ్రీ గౌతమీ టాకీస్‌
నటీనటులు:యామినీ భాస్కర్‌, జాల్వా కోటి, రఘు బాబు, గిరిబాబు, వినోద్‌ అనూష, మాధవి,శ్రీనివాసులు నాయుడు, శ్రీకాంత్‌ ఆరేపల్లి, అభిషేక్‌ గార్లపాటి, చంద్రశేఖర్‌ తదితరులు
సంగీతం: డాక్టర్‌ జోస్యభట్ల,
సంభాషణలు: రామ్‌ప్రసాద్‌ యాదవ్‌
సినిమాటోగ్రఫీ: కమలాకర్‌
పాటలు:గోరటి వెంకన్న, వెన్నెకంటి, రామజోగయ్య శాస్త్రి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి
నిర్మాత: పి.కిషోర్ కుమార్
విడుదల తేదీ: 30, అక్టోబర్ 2015.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Review on Telugu Movie Keechaka
Please Wait while comments are loading...