Telusu Kada Movie Review: తెలుసు కదా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సిద్దూ జొన్నలగడ్, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా, శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు తదితరులు
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం: నీరజ కోన
సినిమాటోగ్రఫి: జ్ఞాన శేఖర్ విఎస్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: ఎస్ థమన్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2025-10-17
రెస్టారెంట్ బిజినెస్ నిర్వహించే వరుణ్ (సిద్దూ జొన్నలగడ్డ) అనాథ. స్వశక్తితో ఉన్నతస్థాయికి ఎదుగుతాడు. అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకొనే వరుణ్.. తనకంటూ ఓ కుటుంబం, పిల్లలు ఉండాలని ఆశపడుతాడు. ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి అంజలి ( రాశీఖన్నా)ను ఇష్టపడి పెళ్లి చేసుకొంటాడు. అయితే తన కంటూ పిల్లలు ఉండాలని ఆశపడిన వరుణ్ దంపతులకు సంతాన యోగ్యం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో అంజలికి సరోగసి ద్వారా పిల్లలు కనొచ్చని డాక్టర్ రాగా కుమార్ ( శ్రీనిధి శెట్టి) సలహా ఇస్తుంది. అంతేకాకుండా అద్దె గర్బాన్ని మోయడానికి రాగా కుమార్ సిద్దపడుతుంది.

వరుణ్ అనాథగా ఎలా అయ్యాడు? తన వయసు పెరుగుతున్నా వివాహం చేసుకోకపోవడానికి కారణం ఏమిటి? అంజలిని వరుణ్ ఎలా పెళ్లి చేసుకొన్నాడు? తనకంటూ ఓ కుటుంబం ఉండాలని కోరుకొన్న సమయంలో సంతాన యోగం లేదని తెలిసిన తర్వాత వరుణ్, అంజలి ఎలా ఫీలయ్యారు? అంజలి సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని భావించినప్పుడు..ఆమెకు వరుణ్ గురించి తెలిసిన సీక్రెట్ ఏమిటి? వరుణ్ లైఫ్‌లో బ్రేకప్ తెలిసిన అంజలి.. భర్తకు ఎందుకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అంజలి దంపతులు సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారా? విడాకులు తీసుకోవాలనుకొన్న అంజలి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. వరుణ్, అంజలి మధ్య చోటుచేసుకొన్న విభేదాలు సమసిపోయాయా? అనే ప్రశ్నలకు సమాధానమే తెలుసు కదా సినిమా కథ.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిస్ట్‌గా వంద చిత్రాలకుపైగా పనిచేసిన నీరజ కోన దర్శకురాలిగా మారడానికి అందరూ ఆలోచింపజేసే పాయింట్‌తో కథను ఎంచుకోవడం బాగుంది. మహిళా డైరెక్టర్ అయినప్పటికీ.. సెన్సిబుల్ పాయింట్‌తో పురుషుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌గా కనిపిస్తుంది. అయితే వరుణ్ క్యారెక్టర్‌ను ఇస్టాబ్లిష్ చేసి.. అసలు కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా నేరుగా, సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఈ సినిమా విషయంలో ఆమె విజన్ బాగుంది. అయితే కథలో సమస్యను ముందే చెప్పడం వల్ల ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ట్విస్టులు లేకుండా డైరెక్ట్ వేలో కథ చెప్పడం వల్ల కన్‌ఫ్యూజన్ లేకుండా చూసుకోవడం ఆమె దర్శకత్వం ప్రతిభకు అద్దం పట్టింది.
ఇక సెకండాఫ్‌లో కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్పడానికి ఏమీ లేకపోవడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. వరుణ్, అంజలి, రాగ మధ్య డ్రామా ఎక్కువైందనే సమయంలో అన్నపూర్ణమ్మను తీసుకొచ్చి పెద్ద రిలీఫ్‌ను ఇచ్చారు. అన్నపూర్ణమ్మ క్యారెక్టర్‌తో కథలో హడావిడి సృష్టించడమే కాకుండా సినిమాలో కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాత కొత్తగా డీల్ చేయడానికి పాయింట్ స్కోప్ లేకపోవడం వల్ల రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌లో ముగించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఓవరాల్‌గా డైరెక్టర్‌గా కథ విషయంలో ఇంప్రెస్ అయ్యేలా చేశారు. కానీ తాను రాసుకొన్న పాత్రల కోసం ఎంపిక చేసుకొన్న నటీనటుల విషయం అంతగా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
యాక్టింగ్ విషయానికి వస్తే.. వరుణ్‌గా సిద్దూ జొన్నలగడ్డ ఈ సినిమాను మొత్తంగా తన భుజాల మీద మోశాడనిపిస్తుంది. కానీ ఆ పాత్రకు సిద్దూ చూపించిన బాడీ లాంగ్వేజ్, అనుసరించిన డైలాగ్ డెలీవరి సరిగా అనిపించదు. శోభన్ బాబు చేయాల్సిన క్యారెక్టర్‌ను మోహన్ బాబుతో చేయిస్తే ఎలా ఉంటుందో.. అలాంటి ఫీల్‌ను సిద్దూ ఇచ్చాడు. అంజలిగా ఖాన్నా ఫర్వాలేదనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లలో ఇంకా బెటర్‌గా చేయాల్సి ఉండాల్సిందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా శ్రీనిధి శెట్టి మారింది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేకూర్చింది. కొన్ని సీన్లలో శ్రీనిధి చూపించిన బాడీ లాంగ్వేజ్ బెటర్‌గా ఉంది. కళ్లతో పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. మోడరన్ థాట్ ఉన్న అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. అభిగా వైవా హర్ష సినిమాకు ఫుల్ సపోర్టుగా నిలిచాడు. టిపికల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్‌తో నవ్వించడమే కాకుండా మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ అందించాడు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ ఓజీ సినిమా నుంచి ఇంకా బయట పడలేదా? అనిపించేంతగా వాయించేశాడు. సందర్భం లేకపోయినా లౌడ్ మ్యూజిక్‌తో క్యారెక్టర్లను ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ సినిమాకు అంత అవసరం లేదనిపిస్తుంది. పాటలు కూడా ఒకేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫి బాగుంది. జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. కలర్ ప్యాటర్న్, ఆర్ట్ వర్క్ బాగుండటం వల్ల మంచి ఫీల్ లుక్ కనిపించింది. ఇక ఈ సినిమాకు టిపికల్ స్క్రీన్ ప్లే అవసరం..దాన్ని దృష్టిలో పెట్టుకొని నవీన్ నూలీ సన్నివేశాలను పేర్చిన విధానం బాగుంది. ఈ సినిమా కథను ఫీల్ గుడ్‌తో చెప్పడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
తెలుసు కదా సినిమా విషయానికి వస్తే.. సరోగసి ప్రధానంగా సాగే లవ్ స్టోరి. బ్రేకప్, మ్యారేజ్ రిలేషన్స్, డైవోర్స్ అనే కాంప్లికేట్ విషయాలతో సాగే కథ. కానీ నీరజ కోన తన వరకు తొలి సినిమాను బాగా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ను బాగా డీల్ చేశారు. సెకండాఫ్ డీల్ చేయడంలో కొంత తడబాటు కనిపించింది. అయితే కథా స్వభావం వల్ల కొన్ని పరిమితులను ఆమె అధిగమించలేకపోయారు. ఈ సినిమాను చూస్తున్న సేపు సల్మాన్ ఖాన్, ప్రీతీ జింటా, రాణి ముఖర్జీ నటించిన చోరి చోరి చుప్కే చుప్కే సినిమా, నాని నటించిన నిన్ను కోరి సినిమాలు గుర్తుకు వస్తాయి. లవ్, రిలేషన్ షిప్స్ ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











