twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వసంతం - సమీక్ష

    By Staff
    |

    Vasantham
    -జలపతి గూడెల్లి
    చిత్రం: వసంతం
    నటీనటులు: వెంకటేష్‌, ఆర్తి అగర్వాల్‌, కళ్యాణి,
    ఆకాష్‌, సూర్య, తనికెళ్ళ భరణి,
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    నిర్మాత: శానం నాగఅశోక్‌ కుమార్‌, ఎన్‌.వి.ప్రసాద్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమన్‌

    తమిళ దర్శకుడు విక్రమన్‌ ఏ చిత్రం తీసినా కుటుంబం మొత్తం చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆయన తాజాగా తెలుగులో రూపొందించినా 'వసంతం'లో నవ్యత లేకున్నా...ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. పూర్తిగా పాజిటివ్‌ పాత్రలతో సాగే ...ఫ్యామిలీ ఓరియేంటడ్‌ చిత్రం. ప్రథమార్థం అంతా చిరంజీవి నటించిన 'ఇద్దరు మిత్రులు' చిత్రంలా సాగి...ద్వితీయార్థంలో చిన్న ట్విస్ట్‌ తో ముగుస్తుంది. సినిమాలో చెప్పుకోదగ్గ గొప్పతనం ఏమీలేకపోయినా...ఇలాంటి 'ఫీల్‌ గుడ్‌' చిత్రాలు వినోదాన్ని అందిస్తాయి. (అయితే, ఎన్నిసార్లు ఇలాంటి చిత్రాలు..చూడాలి..తిప్పి తిప్పి ఇవే సినిమాలా అని విసిగిపోయిన వారు మాత్రం దూరంగా ఉండడమే బెటర్‌.) ఒక్క ముక్కల్లో చెప్పాలంటే ...విక్రమన్‌ తన ట్రేడ్‌ మార్క్‌ సెంటిమెంట్‌ ను వినోదాత్మకంగా చెప్పిన కుటుంబకథా చిత్రం.

    కథ గురించి పెద్దగా ఏమీ లేదు. విక్రమన్‌ అన్ని చిత్రాల మాదిరిగానే హీరో చాలా ఆదర్శప్రాయమైన వ్యక్తి. త్యాగరాజు. చిన్ననాటి మిత్రురాలు కళ్యాణి, వెంకటేష్‌ అన్ని విషయాల్లోనూ కలిసి ఉంటారు. కానీ వీరిద్దరి మధ్యలో ఏదో లింక్‌ ఉందని సమాజం అనుకుంటుంది. అందరూ...అది..ఇది అని అనుకుంటున్నారు కాబట్టి..వీరిద్దరికీ ముడివేస్తే ఓ పని అయిపోతుందని వెంకటేష్‌ ఫ్యామిలీ భావిస్తుంది. కానీ వీరిద్దరు ...'ఛా..మేం మంచి స్నేహితులం...మా మధ్య అటువంటి ఫీలింగ్స్‌ లేవ'ని స్నేహితులుగా ఉంటారు.

    వెంకటేష్‌ క్రికెటర్‌. జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆర్తి అగర్వాల్‌ ను ప్రేమిస్తాడు. ఆమే భార్య అవుతుంది. తొలుత తను వీరిద్దరినీ అనుమానించినా..తర్వాత తనే 'శోభనా'న్ని త్యాగం చేస్తుంది. చివరికి తన స్నేహితురాలి కోసం..వెంకీ చేసే త్యాగం..అనంతరం...ఆమె చేత ఆదర్శపురుషుడు అనిపించుకోవడంతో సినిమా ముగుస్తుంది.

    ఇలాంటి సింపుల్‌ కథను విక్రమన్‌ తనదైన స్టైయిల్‌ లో అందమైన, వినసొంపైన పాటల(రిపీటెడ్‌ ట్యూన్సే అనుకొండి)తో, కామెడీతో సినిమాను ఆహ్లాదంగా మలిచాడు. సునీల్‌, ధర్మవరపుల కామెడీ బిట్స్‌ సినిమాకు అతిపెద్ద ప్లస్‌ పాయింట్స్‌. విక్రమన్‌ కథలో మాత్రం చాలా అతి కన్పిస్తోంది. కళ్యాణి పెళ్ళి కోసం..హీరో, హీరోయిన్లు తమ సెక్స్‌ జీవితాన్ని ఏడాది పాటు వాయిదా వేసుకోవడం చాలా అర్ధరహితం. వీరిద్దరూ సెక్స్‌ లో పాల్గొంటే..ఆమె పెళ్ళి ఆగిపోతుందా?

    'వాసు', 'జెమిని' చిత్రాల్లో తన గెటప్‌ తో ప్రేక్షకులను బయటపెట్టిన వెంకటేష్‌ ఈ చిత్రంలో ప్లెజెంట్‌ గా ఉన్నాడు. నటన కూడా బాగుంది. ఆర్తి అగర్వాల్‌ ను తెర అంతా 'నిండు'గా కన్పించింది, సినిమా స్కోప్‌ లా. కళ్యాణి క్యూట్‌ గా ఉంది. ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ కు రీరికార్డింగ్‌ గురించి ఇంకా తెలియకపోవడం ఆశ్చర్యం. అయినా, వినోదాత్మక చిత్రమేనని చెప్పాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X