For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాడ్..ఓ (‘షాడో’రివ్యూ)

  By Srikanya
  |

  --సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  1.0/5

  ఎనభైలనాటి రివేంజ్ సినిమాలు జనం మర్చిపోయారనుకున్నారేమో.. మళ్లీ దాన్ని మన ముందుకు సగర్వంగా తెచ్చే ప్రయత్నం చేసాడు మెహర్ రమేష్. షాడో టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్న తండ్రిని చంపిన వారిని వెతికి చంపి రివేంజ్ తీర్చుకొనుట అనే కాన్సెప్టుని వెలికి తీసింది. పోనీ ఎప్పుడూ కొత్త కథలేముంటాయి..అని సర్ది చెప్పుకుందామనుకున్నా...కథనం(స్క్రీన్ ప్లే) కూడా మరీ నాటుగా మరీ పాతగా తయారు చేసాడు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే జనం హాహాకారాలు పెట్టేలా సమర్పించారు. వెంకటేష్ తన వయస్సుని కప్పిపుచ్చుతూ కష్టపడి చేసిన ఫైట్స్ తప్ప ఎక్కడా ఏ విధమైన ఆకర్షణనీయమైన ఎలిమెంట్స్ లేవు. దానికి తోడు గబ్బర్ సింగ్ అంత్యాక్షరి ఎపిసోడ్ ని రిపీట్ చేసే ప్రయత్నం చేసి ఫెయిలయ్యారు. దానికి తోడు హీరో పాత్ర ప్యాసివ్ కావటంతో టోటల్ గా ప్రేక్షకులకు సినిమా ఓ సహన పరీక్షలా తయారైంది.

  రాజరామ్(వెంకటేష్) తండ్రి రఘురామ్ (నాగబాబు) ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్.. విలన్ నానా భాయ్ (ఆదిత్య పంచోలి) కి చెందిన అకృత్యాలు సేకరిస్తాడంతో ఎప్పటిలాగే .. వారు చంపేస్తారు. ఆ చంపినప్పుడు తన తల్లి(గీత) చెల్లి(మధురిమ) నుంచి దూరం అవుతాడు. ఆ తర్వాత పగ,ప్రతీకారాలతో పెరిగి పెద్దై షాడో పేరుతో మలేషియాలో ఉంటున్న విలన్స్ ఒక్కొక్కరని చంపేస్తూంటాడు. ఈ లోగా... సీన్ లోకి ఇన్సెపెక్టర్ ప్రతాప్(శ్రీకాంత్) వస్తాడు. ఆ ప్రతాప్ ఎవరో కాదు..మన షాడో చెల్లి భర్త...అంటే బావ. ఇంతకీ షాడో తన బావ ప్రతాప్ నుంచి తప్పించుకుంటూ తన రివేంజ్ ఎలా పూర్తిగా తీర్చుకున్నాడనేది మిగతా కథ.

  ఈ సినిమాని మెహర్ రమేష్ తన రెగ్యులర్ స్టైలిష్ పంథాలో తీసినా చూడటానికి బాగుండేది. అలా కాకుండా శ్రీనువైట్లలా కామెడీతో మెప్పించాలని ఎమ్ ఎస్ నారాయణ, హీరో పాత్రలతో కామెడీ చేసి ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాడు. కథగా చెప్పుకోవటానికి ఏమీలేని ఈ కథను స్క్రీన్ ప్లే తో అయినా మెప్పించాల్సిన భాథ్యతను దర్శకుడు మర్చిపోయాడు. పాత కథను కొత్తగా చెప్తే రక్తి కడుతుందనే వెంకటేష్ లక్ష్మి నాటి బేసిక్ ఐడియాను గాలికి వదిలేసాడు. దాంతో రాబోయే పదో సీన్ ఏంటో, ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో ప్రేక్షకుడు ఊహించే స్ధితికి వచ్చింది. దానికి తోడు సీన్స్ అసలు పండలేదు. ముఖ్యంగా వెంకటేష్ ఫస్టాఫ్ లో గతం మర్చిపోయిన ఎపిసోడ్ సీరియస్ కావాల్సింది పోయి కామెడీగా తయారవటం మరీ దెబ్బతీసింది. ఇంటర్వెల్ హీరో ..హీరో తల్లి,చెల్లి రివిల్ అయ్యి, వెంకటేష్ ఎమోషన్ ఫీలయ్యే సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. సెకండాఫ్ లో సైతం సీన్స్ అసలు పండలేదు. క్లైమాక్స్ అయితే మరీ డల్ గా ఉంది. అన్నిటి కన్నా దారుణంగా హీరో పాత్ర ప్యాసివ్ గా తయారైంది. అతను విలన్స్ ని చంపుకుంటూ పోతుంటే ఎదురు వచ్చి అతనికి సవాల్ విసిరే పాత్ర లేకుండా పోయింది. ఎప్పటికో ప్రీ క్లైమాక్స్ నాటికి విలన్ కి హీరో ఎవరు..షాడో ఎవరు అనేది తెలుస్తుంది. అప్పటివరకూ కథ ఏక పక్షంగా జరుగుతూంటుంది.

  అలా కామెడి,సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగాపులగం చేద్దామనుకున్న దర్శకుడు ఐడియా...పాళ్లు సరిగ్గా కలవని కిచిడిలా తయరైంది. రొమాన్స్ విషయానికి వస్తే వెంకటేష్ సరసన తాప్సీ మరీ చిన్న పిల్లలా తేలిపోయింది. దాంతో తాప్సీ ఎంత అందాలు ఆరబోసినా కిక్ ఇవ్వలేకపోయింది. విలన్స్ లో ఆదిత్యా పంచోలి పాత్ర ఎందుకు పెట్టారో దర్శకుడుకే తెలియాలి. ఆ పాత్రకు నిండుతనం రాలేదు. అలాగే హీరో కి తల్లి ,తండ్రితో ఉన్న ఎమోషన్ బాగా రిజిస్టర్ చేసి ఉంటే..తండ్రి చనిపోయినప్పుడు పగ తీర్చుకోవటానికి బయిలు దేరాడంటే ఎమోషనల్ గా కనెక్టు అవుతుంది. డైలాగులూ నాసిరకంగా ఉన్నాయి.

  విశ్లేషణతో కూడిన మిగతా రివ్యూ...స్లైడ్ షో లో...

  కథ, స్క్రీన్ ప్లే విభాగాలే ఈ సినిమాని ప్రేక్షకుడుకి వేసవిలో పరీక్షలా మార్చాయి. టెక్నికల్ గా దర్శకుడు తీసుకున్న శ్రద్ద వీటి మీద కూడా పెడితే బాగుండేది.

  వెంకటేష్ తాను చాలా కాలం తర్వాత యాక్షన్ జనర్ చేసానని, ఈ తరం వారికి కూడా తన యాక్షన్ చిత్రాలు గురించి తెలియాలని చెప్పారు కానీ...యాక్షన్ చిత్రం కావాలని ఇలాంటి కథలు ఎన్నుకుంటే అవి ..ఆ కాలం నాటి సినిమాలకుషాడోలుగా మిగిలిపోతాయంతే..

  ఈ సినిమాలో తాప్సి గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఆమె తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది కానీ ఆమెకు అంత సీన్ దక్కలేదు.

  బాలీవుడ్ నటుడు ఆదిత్యా పాంచోలి ఈ సినిమాతోనే తెలుగు కు విలన్ గా పరిచయమయ్యాడు. కానీ ఆయన పాత్ర కేవలం స్టైల్ గా అటునుంచి ఇటు,ఇటునుంచి అటుకి తిరగటానికే సరిపొయ్యింది.

  యాక్షన్ పాత్రలు చెయ్యాలన్న ఆ త్రుతతో శ్రీకాంత్ ఈ పాత్రను ఒప్పుకున్నాడేమోకానీ అతను చెయ్యటానికి ఏమీలేదు. మిగతా పాత్రల్లో ధర్మవరపు, ఎమ్ ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్,జయప్రకాష్ రెడ్డి వంటివారు ఉన్నా పెద్ద కామెడీ పండలేదు. ఎమ్.ఎస్ నారాయణ ఓకే అనిపించాడు.

  సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చి న నిర్మాత కావటంతో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఓకే. షాడో టైటిల్ సాంగ్, నాటీ గర్ల్ సాంగ్ బాగున్నాయి.

  ప్రసాద్ మురెళ్ల కెమెరా వర్క్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్పాలి. కొన్ని యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ స్టాండర్డ్స్ లో నిలిపాడు.

  మెహర్ రమేష్ డైలాగులు చాలా పూర్ గా ఉన్నాయి. అక్కడక్కడా ఫన్ని వన్ లైనర్స్ పేలినా పెద్దగా బాగోలేదు. మిగతా టెక్నికల్ విభాగాల్లో ఎడిటింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా సీన్స్ ముఖ్యంగా సెకండాఫ్ లో ట్రిమ్ చెయ్యాలి. ముఖ్యంగా క్లైమాక్స్ తగ్గించి,బోర్ నుంచి జనాల్ని రక్షించాలి

  సినిమా హైలెట్స్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ , రెండు పాటలు వస్తే... డ్రాబాక్స్ లో ... మరీ పురాతన కాలం నాటి స్టోరీ, నాసిరకం స్క్రీన్ ప్లే, కలిసిరాని కామెడీ, విసిగించే సెంటిమెంట్ మొదటి వరసలో ఉంటాయి.

  నటీనటులు : వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ తదితరులు

  కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌.
  మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌,
  సంగీతం: తమన్‌.
  కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల,
  ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌.
  ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌.
  ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ,
  నిర్మాత: పరుచూరి కిరీటి,
  దర్శకత్వం: మెహర్ రమేష్.

  బయిట ఎండ కాల్చేస్తోంది...ఎసి లో రెండు గంటలు కాలక్షేపం చేద్దామనుకుని ఫిక్సై వెళితే నిలువునా శిక్షించే చిత్ర రాజం ఇది..తస్మాత్ జాగ్రత్త.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Venkatesh's Shadow film relesed today with flop talk. There is Nothing expect from shadow either comedy or action. It should be mentioned here that the director is known for copying scenes from other Telugu films and he has continued it here in Shadow too. There are a few scenes, which have been copied from hit movie, and Gabbar Singh Anthyakshari scene is the best example for it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X