twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యావరేజి 'విక్రమార్కుడు'

    By Staff
    |

    Vikaramarkudu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: విక్రమార్కుడు
    విడుదల తేదీ: 23-6-2006
    నటీనటులు: రవితేజ, అనుష్క, రుతిక, మేఘనానాయుడు,
    ప్రకాష్‌రాజ్‌, వినీత్‌ కుమార్‌, బ్రహ్మానందం, అజయ్‌,
    మధుశర్మ, అలీ, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు
    సంగీతం: ఎంఎం కీరవాణి
    కెమెరా: సర్వేష్‌ మురారి
    ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
    కథ: విజయేంద్రప్రసాద్‌
    మాటలు: ఎం రత్నం
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌ఎస్‌ రాజమౌళి
    నిర్మాత: ఎంఎల్‌ కుమార్‌ చౌదరి

    రాజమౌళి-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' పూర్తిగా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం. రవితేజ డబుల్‌ రోల్స్‌ను బాగా చేశాడు.

    అత్తిలి సత్తిబాబు (రవితేజ)ఓ మంచి దొంగ. బ్రహ్మానందంతో కలిసి బ్రహ్మాండంగా దోపిడీలు చేస్తుంటాడు. ఆ క్రమంలో నీరజ (అనుష్క) అనే అమ్మాయిని చూసి వెంటపడి ప్రేమలో పడతాడు. మరో పక్క 'పసివాడి ప్రాణం' సినిమాలో లాగా ఓ పాప అతనికి పరిచయమవుతుంది. 'నాన్న' అంటూ పిలుస్తుంటుంది. ఎవరా అని ఆరా తీస్తుంటే కొందరు గూండాలు చంబల్‌ లోయనుంచి వచ్చి ఫైటింగ్‌లకు దిగుతుంటారు. అర్ధం కాని సత్తిబాబుకి ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ ద్వారా ముడి వీడుతుంది. అందులో కిరణ్‌ రాథోడ్‌ (మళ్ళీ రవితేజ) నిజాయితీపరుడైన పోలీసు అధికారి. బదిలీపై చంబల్‌ లోయలోని దేవగఢ్‌కి చేరుతాడు. అక్కడ విలన్‌ బందిపోటు టిట్లా (అజయ్‌) అతని తమ్ముడు బావూజీ (వినయ్‌కుమార్‌)లదే రాజ్యం. పోలీసుల భార్యలను తన అడ్డాలో అడ్డంగా ఉంచుకునే దుర్మార్గుడు బావూజీ. అది చూసి తట్టుకోలేని విక్రం రాథోడ్‌ తిరగబడతాడు. వాళ్ళు కక్షగట్టి అతడిని వేటాడుతారు. చివరికి అతను ఏం చేశాడన్నది తెరమీద చూడాల్సిందే. విక్రమార్కుడు 'హీరో'చితంగా పోరాడినా, 'కథా' కత్తి పదునుగా లేకపోవడంతో 'విజయ' భంగం కాక తప్పలేదు. కథ కొత్తగా చంబల్‌ లోయకి వెళ్ళినా డబుల్‌ రోల్‌ సెటప్‌కే స్క్రీన్‌ సమయం సరిపోవడంతో యాక్షన్‌కి దారిలేక విసుగు తెప్పించింది. మాస్‌ క్యారెక్టర్‌ బాగున్నా సినిమాకు ప్రాణం పోయడం కష్టమని తేలిపోయింది.

    ఇలాంటి 'దొంగ-పోలీసు' డబుల్‌రోల్‌ కథలు తెలుగుతెరకు కొత్త కాదు. 'యుగంధర్‌' స్టోరీలైన్‌ను పోలిఉండే ఈ చిత్రం ప్రారంభమైన పది నిముషాలకే కథ పూర్తిగా అర్ధమైపోవడంతో ఆసక్తి, ఉత్కంఠ చచ్చిపోతాయి. డబుల్‌ పాత్రల్లో ఏదీ ఎస్టాబ్లిష్‌ కాకపోవడం మరో లోపం. అంతేగాక ఇంటర్వల్‌ అయ్యాక వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటో తేలిగ్గా ఊహించగలగడం మరో లోపం. రెండు పాత్రల పరిచయాలు,బ్యాక్‌ డ్రాప్‌లు సెటప్‌ అయ్యేసరికే క్లెయిమాక్స్‌ వచ్చేస్తుంది. ప్రధాన పాత్ర అత్తిలి సత్తిబాబుకి విలన్లు ఎవరో తెలిసి యాక్షన్‌లోకి దిగడం క్లయిమాక్స్‌లో గానీ జరుగలేదు. ఇది స్పష్టంగా కన్పించే స్క్రీన్‌ప్లే లోపం. ప్రకాష్‌ రాజ్‌ పాత్ర ఉన్నా లేనట్టే అయింది. అనూష్క అందాల ఆరబోత కొందరిని ఆకర్షించినా అందర్నీ ఆకట్టుకోదు. లవ్‌ ఫీల్‌ రాలేదు. హాస్యం ఆశించినంతగా పండలేదు. పెళ్ళి భోజనాల వద్ద 'సాంబార్‌ డైలాగ్‌' సీను బాగుంది. మేఘనా నాయుడు ఐటం సాంగ్‌ కొందరికి ఆకర్షణే. రుతిక పాట కొద్దిగా అతి అయింది. రాజీవ్‌ కనకాల బాగానే చేసినా అది రాణింపు ఉన్న పాత్ర కాదు. కెమెరా కొన్ని చోట్ల మెరుపులు మెరిపించింది. కొన్ని డైలాగులు ఫర్వాలేదు. దర్శకత్వ విలువలు రాజమౌళి పాత చిత్రాల స్ధాయిలో లేవు. వైవిధ్యం చూపడానికి అవకాశం లేని పాత్రలైనా రవితేజ కష్టపడి లాక్కొచ్చాడు. మొదటి పాట మాస్‌ బీట్‌తో ఆకట్టుకుంటుంది. రీరికార్డింగ్‌ 'ఛత్రపతి' సినిమాను గుర్తుచేస్తుంది. 'జింతా ఓ జింతా' మ్యానరిజం బాగుంది.

    ఫస్టాఫ్‌ వినోదంతో సాగినా సెకండాఫ్‌లో హీరోయిన్‌ లేకపోవడంతో చప్పగా సాగింది. సినిమాను కామెడీనో, యాక్షనో ముందే నిర్ణయించుకుని తీసి ఉంటే బాగుండేది. విలన్‌ చిత్రణ హాలీవుడ్‌ స్టైల్‌లో ఉంది. ఈ సినిమా ఓపెనింగ్స్‌ బాగున్నాయి. రవితేజ-రాజమౌళి కాంబినేషన్‌ మొదటి సారి కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. సినిమా బి,సి సెంటర్లలో రవితేజ మాస్‌ క్యారెక్టర్‌ పడితే ఆడే అవకాశముంది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X