twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikrant Rona Movie Review: ఆకట్టుకోలేకపోయిన సుదీప్ కిచ్చ.. కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే?

    |

    Rating:
    2.5/5

    నటీనటులు: సుదీప్ కిచ్చ, నిరుపమ్ బండారీ, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు, వాసుకీ వైభవ్ తదితరులు
    రచన, దర్శకత్వం: అనూప్ బండారి
    నిర్మాత: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండ్యన్
    సినిమాటోగ్రఫి: విలియం డేవిడ్
    ఎడిటింగ్: ఆషిక కుసుకోల్లి
    మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
    బ్యానర్: కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వనియో ఫిల్మ్స్ ఇండియా
    రిలీజ్ డేట్: 2022-07-28

    విక్రాంత్ రోనా కథ ఏమిటంటే?

    విక్రాంత్ రోనా కథ ఏమిటంటే?

    ఓ మారుమూల గ్రామంలో నగల దొంగతనం కారణంగా సంజు (నిరుపమ్ బండారి) గ్రామం నుంచి పారిపోతాడు. అయితే నగల దొంగతనం తర్వాత సంజు కుటుంబంలోని వారంతా మరణిస్తారు. ఆ తర్వాత ఆ ఊరిలో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరగడంతో ఇన్వెస్టిగేషన్ కోసం విక్రాంత్ రోనా ( సుదీప్ కిచ్చ) ఆ గ్రామానికి వస్తాడు.

    విక్రాంత్ రోనాలో ట్విస్టులు

    విక్రాంత్ రోనాలో ట్విస్టులు

    నగల దొంగతనం చేసిన సంజు ఊరు విడిచిపారిపోయారా? ఆ గ్రామంలో సీరియల్ హత్యలకు ఎవరు పాల్పడుతున్నారు? పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ రోనా భార్య ఏమైంది? విక్రాంత్ రోనా కూతురుతో కలిసి అటవీ ప్రాంతంలోని గ్రామానికి ఎందుకు వెళ్లాడు? ఆ గ్రామంతో విక్రాంత్ రోనాకు సంబంధం ఏమిటి? గ్రామంలో పీఈటీ టీచర్ అనుమానాస్పద పాత్ర ఏమిటి? గ్రామంలో జరిగే హత్యలకు బాధ్యులు ఎవరు? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు దర్యాప్తు అధికారి విక్రాంత్ రోనాకు దొరికిన సమాధానాలు ఏమిటి? ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు సరైన సమాధానం విక్రాంత్ రోనా సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    చిన్న పిల్లల ఓ పుస్తకం తెరవడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ హత్యతో అసలు కథ మొదలవుతుంది. గ్రామానికి సంజు, విక్రాంత్ రానా రావడంతో అప్పటి వరకు నిదానంగా సాగుతున్న కథ వేగం పుంజుకొంటుందని అనుకొంటాం. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సినిమా కథలేకుండా సీన్లు అక్కడక్కడే తిరుగుతుంటాయి. కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లే అంశం కూడా లేకపోవడం వల్ల ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సాదాసీదా ఉండటంతో హమ్మయ్య ఫస్టాఫ్ ముగిసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    సెకండాఫ్‌లో సెంటిమెంట్

    సెకండాఫ్‌లో సెంటిమెంట్

    ఏదైనా కథ ఉంటుందా అనే కొనే ప్రేక్షకుడికి సెకండాఫ్‌లో కూడా అదే అగ్నిపరీక్ష. కథ లేకపోవడం, కథనం కూడా పేలవంగా ఉండటం.. వీటికి తోడు సన్నివేశాలు మరీ నాసిరకంగా ఉండటం సహనానికి పరీక్షలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో విప్పిన చిక్కుముడులు, ట్విస్టులు కథపై కొంత ఆసక్తిని రేపుతాయి. సంజు పాత్రకు సంబంధించిన ట్విస్టు, విక్రాంత్ రోనా కూతురు ఎపిసోడ్ హృదయాన్ని భారంగా మారుస్తాయి. చివర్లలో కొంత చైల్డ్ సెంటిమెంట్ కారణంగా ఫీల్‌గుడ్‌గా సినిమా అనిపిస్తుంది. అయితే సెంటిమెంట్ పూర్తిగా పండి ఉంటే మంచి సినిమా అయి ఉండేదనిపిస్తుంది.

    దర్శకుడు అనుప్ బండారీ కథ లేకుండా

    దర్శకుడు అనుప్ బండారీ కథ లేకుండా


    దర్శకుడు అనుప్ బండారీ ఎంచుకొన్న కథ పాత సీసాలో కొత్త సారా మాదిరిగా అనిపిస్తుంది. కాలం చెల్లిన థ్రిల్లర్ కథకు బలమైన సాంకేతిక అంశాలను కోటింగ్ ఇచ్చి సినిమాను ప్యాన్ ఇండియాగా మార్చాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. కథ, కథనాలు, సన్నివేశాలు బలంగా రాసుకోవడంలో విఫలమయ్యారు. సినిమా మొత్తం చూసిన తర్వాత కథ ఏమిటంటే.. మీసం మెలిసిన క్రిటిక్స్‌కు సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితంటే.. సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విభాగాల శ్రమకు ఫలితం దక్కడం కష్టమే.

    సుదీప్ కిచ్చ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    సుదీప్ కిచ్చ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    సుదీప్ కిచ్చ తన కెరీర్‌లో ఇంతకంటే గొప్ప పాత్రలు పోషించి మెప్పించాడనే అందరికి తెలిసిందే. విక్రాంత్ రోనా సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎలాంటి మ్యాజిక్ కనిపించదు. బలమైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల విక్రాంత్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయాడని చెప్పవచ్చు. చివర్లో కూతురుతో రిలేట్ అయిన సన్నివేశాల్లో సుదీప్ విలక్షణమైన నటనను ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. విక్రాంత్ రోనా సినిమా సుదీప్‌కు ఎలాంటి ప్రయోజనం చూకూర్చదనే చెప్పవచ్చు. మిగితా పాత్రల్లో సంజు పాత్రధారి నిరుప్, పీఈటీ మాస్టర్, ముస్లిం కారు డ్రైవర్ పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. జాక్వలైన్ కేవలం రుక్కమ్మ పాత్రలో కాసేపు తెర మీద మెరిసింది.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఆర్ట్ విభాగం ఈ సినిమాకు హీరోగా కనిపిస్తాడు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌ నిజంగా దట్టమైన అడవిని తలపిస్తుంది. గ్రాఫిక్ వర్క్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బాగుంది. ఆయన మ్యూజిక్‌కు తగినట్టుగా సన్నివేశాలు లేకపోవడం వల్ల ఆయన శ్రమ వృథా అయిందనిపిస్తుంది. విలియమ్ డేవిడ్ కెమెరా పనితనం బాగుంది. కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్ల నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్
    మ్యూజిక్
    రుక్కమ్మ పాట
    సుదీప్ ఎలివేషన్స్
    ఆర్ట్ విభాగం పనితీరు
    సౌండ్ డిజైనింగ్

    మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్


    కథ, కథనాలు
    డైరెక్షన్
    సాగదీసి.. సాగదీసి కథ చెప్పడం
    పాత్రల చిత్రీకరణ సరిగా లేకపోవడం

    ఫైనల్‌గా విక్రాంత్ రోనా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా విక్రాంత్ రోనా ఎలా ఉందంటే?


    తల్లి, కూతురు సెంటిమెంట్‌తోపాటు ఇన్వెస్టిగేషన్ పంథాలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ విక్రాంత్ రోనా. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకపోవడం భారీ దెబ్బ అని చెప్పవచ్చు. కథను నేరుగా చెప్పకపోవడం, పరిపూర్ణంగా సినిమాను తెరమీద ఆవిష్కరించకపోవడం, కొన్ని పాత్రలకు బ్యాక్ డ్రాప్ ఏంటి? కథ బ్యాక్ డ్రాప్ ఏంటి అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సుదీప్ ఫ్యాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి విక్రాంత్ రోనా నచ్చడానికి అవకాశం ఉంది. భారీగా ఆశలు పెట్టుకొని వెళితే.. దారుణంగా నిరాశ చెందాల్సిన పరిస్థితి ఉంటుంది.

    English summary
    vikrant rona movie review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X