For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లేజీ..వినాయకుడు(రివ్యూ)

  By Srikanya
  |

  Village Lo Vinayakudu

  Rating

  -జోశ్యుల సూర్య ప్రకాష్
  సంస్థ: మూన్‌వాటర్‌ పిక్చర్స్‌
  నటీనటులు: కృష్ణుడు, శరణ్య మోహన్‌, యండమూరి వీరేంద్రనాథ్‌,
  రావు రమేష్‌, జోగినాయుడు తదితరులు
  స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సాయికిరణ్‌ అడవి
  సినిమా :విలేజ్ లో వినాయకుడు
  మాటలు:మహీ,సాయికిరణ్ అడవి
  సంగీతం :మణికంఠ కాద్రి
  కెమెరా: రామ్స్
  ఎడిటింగ్ :మార్తాండ్ కె.వెంకటేష్
  నిర్మాత :మహీ
  రిలీజ్ డేట్ : నవంబర్ 5,2009

  అదే వినాయకుడు..అదే ధీమ్(లావుగా ఉంటేనేం..మనస్సు మంచిదైతే చాలు)..అదే దర్శకుడు..కాకపోతే నేపధ్యం మాత్రం విలేజ్ కి మారింది. అయితే సినిమా కూడా అదే రేంజిలో హిట్టవుతుందా అంటే మాత్రం డౌటే. ఎందుకంటే వినాయకుడులో ఉన్నంత ప్రెష్ నెస్ సీక్వెల్ లో లోపించింది. అలాగే మొదటి చిత్రంలో ఉన్నంత పకడ్బంధీ స్క్రీన్ ప్లే దీనికి కొరపడటం మరో మైనస్. అంతేగాక సోనియా (హీరోయిన్)నప్పినట్లుగా శరణ్యా మోహన్ సెట్ కాక తేలిపోయింది. ఓ డైలాగులో చెప్పినట్లు పెయిర్ లా గాక ఎలక,ఏనుగులా ఉన్నారు. అయితే బాగా లో బడ్జెట్ లో తీసిన చిత్రం కావటం,యాడ్స్,డ్రస్ కర్టెసీ వంటి కార్పోరేట్ మార్కెటింగ్ స్ట్రాటజీలతో రావటంతో సేఫ్ ప్రాజెక్టు కావచ్చేమో కానీ దర్శకుడుకి మాత్రం కలసివచ్చేది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేదీ కాదు.

  కథ..ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు..కార్తీక్ (కృష్ణుడు)ని ప్రేమించిన కావ్య(శరణ్యా మోహన్)అతని గురించి ఆమె ఇంట్లో గొప్పగా బిల్డప్ ఇస్తుంది..అసలు లావు విషయం దాచి పెట్టి. అయితే ఈ విషయం రివిల్ చేసి ఒప్పించే లోపలే కార్తీక్ ఉండబట్టలేక ఆ ఊళ్లో దిగుతాడు. ఇక పల్లెలో ఉండే కావ్య తండ్రి కర్నల్ లక్ష్మీపతి(రావు రమేష్)కి అల్లుడు సెలక్షన్ విషయమై కొన్ని నిర్ధుష్ట అభిప్రాయాలు ఉంటాయి. అవి కార్తీక్ ని చూడగానే డైలమాలోకి వెళ్ళిపోతాయి. అయితే డైరక్టుగా కార్తీక్ ని రిజెక్టు చేస్తే కూతురు నొచ్చుకుంటుందని అతనితో పరోక్ష యుద్దానికి దిగుతాడు. అలా మీట్స్ ద పేరెంట్స్ స్కీమ్ లోకి వెళ్ళిన కార్తీక్ తన మంచితనం అమాయికత్వంతో ఆయన మనస్సు గెలుచుకుని,ఆ ఇంటి వారందరి మన్ననలు ఎలా పొందుతాడనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఫుల్ లెంగ్త్ పాత్రలోకి ప్రముఖ నవలా రచయిత యండమూరి ఎలా వచ్చి నవ్వించే ప్రయత్నం చేసాడన్నది తెరపై చూడాల్సిందే.

  టైటిల్,పోస్టర్స్ చూసి మరో కామిక్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనుకున్నవారికి డైరక్టర్ స్క్రిప్టుపై కాన్సర్టేట్ చేయక షాక్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు మెన్షన్ చేయాలంటే...వినాయకుడు హిట్ కి స్క్రిప్టు బలమే కలసివచ్చింది కాబట్టి . ఇక ఇందులో కార్తీక్ పాత్ర లేజీగా విలేజీలో ఉండిపోతుంది.పూర్తి పాసివ్ గా మారి ఒక్క సంఘటనా సృష్టించక బోర్ కొట్టిస్తుంది. తన ప్రియురాలి తండ్రిని ఎదుర్కోవటానికి పెద్దగా ఆలోచనలు..పోనీ డి.డి.ఎల్.జె. తరహాలో ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నించడు. లేకపోతే అహనా పెళ్ళంట స్కీమ్ నీ అనుసరించడు.(అహనా పెళ్ళంట పాటను మాత్రం రీమిక్స్ చేసారు..బావుంది). దాంతో కథలో ఎక్కడా టెన్షన్ క్రియేట్ కాదు. ఎలాగూ హీరోయిన్ తండ్రి ఒప్పుకుంటాడని అందరికీ తెలుసు.అయితే ఎలా ఒప్పించాడన్నది ముఖ్యం. అదే మిస్సయింది.

  అదే వినాయకుడులో అయితే ఫస్టాఫ్ లో అసలు సోనియా...అతన్ని లావు అనే నెపంతో దూరం పెడుతుంది. సెకెండాఫ్ లో దగ్గరయ్యే సమయానికి ఆమె తొందరపాటుతో దూరం అవుతాడు. ఇక అందులో వర్కవుట్ అయింది. లావు అనే సింపతీ మీద ఫన్నీ డ్రామా. అదే ఇక్కడా రిపీట్ చేయాలని చూడటం విచారకరం. దాంతో ఎక్సపెక్ట్ చేసిన నవ్వులు కరువయ్యాయి. అలాగని కొన్ని చోట్ల నవ్వలేదా...అంటే నవ్వాం..కానీ కథకు అది కలసి రాలేదు. ఇక కృష్ణుడులో అదే మార్పు లేని ఎక్సప్రెషన్. ఉన్నంతలో శరణ్యా మోహన్ బాగాచేసింది కానీ..ఆమె జోడీ నప్పలేదు. ఇక రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అతనిలో నటుడు రోజు రోజుకీ విజృంభిస్తున్నాడు. అయితే యండమూరి వీరేంద్రనాధ్ ని పెట్టుకోవటం మాత్రం రాంగ్ ఛాయిస్. ఆయన మొహంలో ఎప్పుడో కానీ ఎక్సప్రెషన్స్ పలకలేదు.

  వీటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రామ్స్ కెమెరా..కోనసీమ అందాల్ని చాలా చోట్ల అధ్బుతంగా పట్టిచ్చింది. అలాగే సంగీత దర్శకుడు మణికంఠ కాద్రి కూడా మంచి ట్యూన్స్ ఇచ్చాడు.ఆడియో మంచి హిట్. ఇక వీరిని ఒక చోట ప్రోగేసి,మంచి వర్క్ రాబట్టుకున్న దర్శకుడు సాయి కిరణ్ అబినందనీయుడు..డైలాగులు కొన్ని చోట్ల పేలాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. అయితే బడ్జెట్ కంట్రోల్ మీద పెట్టిన శ్రధ్ద కథ,కథనాల మీద కూడా పెట్టి ఉంటే మరోసారి మంచి ప్రయత్నం అనిపించుకునేది

  ఏదైమైనా మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేసిన ఈ చి్త్రం..ఆ వర్గానికి కూడా నచ్చుతుందా అంటే కష్టమనిపిస్తుంది. అలాగే పోస్టర్స్ లో కృష్ణుడునే ఎక్కువ ఫోకస్ చేస్తూండటంతో చాలా మంది వినాయకుడు రెండో రిలీజ్ అనుకుంటున్నారు..ఇది పబ్లిసిటీ సమస్య. ఇక అంత అర్జెంటుగా వినాయకుడు సీక్వెల్ కదా అని పరుగెత్తుకెళ్ళి చూసేంత గొప్ప సినిమా కాదు.అయితే ఓ ప్లస్ పాయింట్.. క్లీన్ గా రూపొందించారు కాబట్టి ఫ్యామిలీలు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. అలాగే అలిసిపోయినప్పుడు మాత్రం ఈ చిత్రానికి వెళ్ళకండి...ఆ స్లో నేరేషన్ కి మంచి నిద్ర వస్తుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X