»   » పట్టింది బూజు (‘మగ మహారాజు’ రివ్యూ)

పట్టింది బూజు (‘మగ మహారాజు’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

తమిళం నుంచి ఒక సినిమా తెలుగులోకి డబ్బింగ్ అయి వస్తోందంటే అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది. లేకపోతే ఎందుకు ఇక్కడ డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు అని ఆలోచించి థియోటర్ కి వెళతాం. అయితే అక్కడే మన నమ్మకం మీదే అత్యంత నమ్మకంగా దెబ్బకొట్టి, మనకి విరక్తి కలిగించే సినిమాలు అప్పుడప్పుడూ దిగుతూంటాయి. అటువంటిదే ఈ బూజుపట్టిన మహారాజు కథ. ఓ ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైతే బాగుండేదేమో అనిపించటం ఈ సినిమా కథ ప్రత్యేకత.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


విశాల్...తన రీసెంట్ చిత్రం డబ్బింగ్ వెర్షన్ తో ముందు వెనకా చూసుకోకుండా మహరాజులాగ మన థియోటర్స్ లో దిగిపోయాడు. తొంభైల్లో ఆగిపోయిన అత్తకు యముడు...అమ్మాయికి మొగడు తరహా అల్లుడు కథని అత్యంత పేలవంగా సాగతీసి, ఎలక్షన్స్ హంగామా అనే తిరగమోత పెట్టి హడావిడిగా వడ్డించేసాడు. అదీ సవ్యంగా ఉందా అంటే ఇంత అవకతవక చిత్రం ఈ మధ్య కాలంలో చూడలేదు అనిపిస్తుంది. కామెడీ పేరుతో కుళ్లు జోకులు, అక్కర్లేని చోట అమితమైన యాక్షన్ తో స్క్రీన్ టైమ్ సమర్దవంతంగా నింపేసారు. ఇంటర్వెల్ అయినా తెరపై ఏం జరుగుతోందో తెలియనంతగా కథని అల్లిన దర్శకుడుకు జేజేలు చెప్పాలి. సినిమాని ఆ మాత్రం అయినా చివరి దాకా చూడగలిగామంటే సంతానం పేల్చే పాత జోకుల కామెడీనే కొత్తగా అనిపించటం.


ప్రభుకు ముగ్గురు కొడుకులు (విశాల్, సతీష్, వైభవ్)...అలాగే అతన్ని అసహ్యించుకునే ముగ్గురు చెల్లెళ్లు (రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాధోడ్). ఆ ముగ్గురు చెల్లెళ్లకీ ముగ్గురు కూతుళ్లు(హన్సిక, ముధరిమ, మాధవీలత). ఓ రోజు ప్రభు తన కొడుకులతో తన చెల్లెళ్లు అసహ్యించుకునే కారణం చెప్పి...తనని తన చెల్లిళ్లను కలపమంటాడు. అందుకు...ఆ చెళ్లెళ్ళ కూతుళ్లను ప్రేమ పేరుతో అడ్డం పెట్టుకోమంటాడు. ముగ్గురు కొడుకులూ తన మేనత్తలు ఉండే ఊరు వెళ్లి అక్కడ ముగ్గురు మరదళ్లను లైన్ లో పెట్టి ఎలా తన అత్తలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు... తన తండ్రికి, మేనత్తలకు మధ్య తగువు పెట్టిన విలన్(ప్రదీప్ రావత్)కు ఎలా బుద్ది చెప్పారు అనేది మిగతా కథ.


Vishal's Maga Maharaju review

ఇలాంటి అల్లుడు కలిపిన కటుంబం తహహా కథలు మన సౌత్ సినిమాలకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఈ కథలు ఈ మధ్యకాలంలో జోరు తగ్గాయి. ఆ లోటు తీర్చాలనుకున్నట్లున్నాడు దర్శకుడు. ఈ కథల్లో ఒక హీరో ...మేనత్త ఇంటికి వేరే ఐడింటిటీతో వెళ్లి ఆమె కూతురుని ప్రేమలో పడేసి, తదనంతరం తన అత్త పొగరు అణిచి, విలన్ కు బుద్ది చెప్తూంటారు. అలాంటిది ముగ్గురు వెళ్లి తన ముగ్గురు మేనత్తల కుటుంబంలో కలిసి పోయి..వాళ్ల కూతుళ్లలో లవ్ గేమ్ ఆడేస్తే ఇంకెంత మజా వస్తుందో అని దర్శకుడు ఆలోచించినట్లున్నాడు.


సరే కాన్సెప్టు వదిలేద్దాం...కథ పాతదయినా కథనం కొత్తగా ఉంటే ఆకట్టుకోవచ్చు కదా...ఇక్కడ కథనం అంతకన్నా పాతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికి తోడు...ఇంటర్వెల్ కు కూడా కథలోకి రాడు. అక్కడ దాకా సోది నడుపుతూ ఉంటాడు. అక్కర్లేని కామెడీ, లవ్ ట్రాక్ తో మన సహనం పరీక్ష పెడతాడు. ఎక్కడో సెకండాఫ్ లో ఓహో..మనం చూడబోయేది ఇదా కథ అనుకునే లోపల...సినిమా క్లైమాక్స్ కి తీసుకు వచ్చి పెద్ద ఫైట్ తో ముగించేస్తాడు. రొటీన్ కథలు చూసి ఉంటాం కానీ ఇది రొటిన్ కే రొటిన్.


ఇక ఈ సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ సంతానం. ఆర్డీఎక్స్ రాజశేఖర్ పేరుతో అతను సృష్టించే హల్ చల్ ఈ బోర్ సినిమాలో కూసింత రిలీఫ్. ఇక రమ్యకృష్ణ వంటి ఆర్టిస్టు సైతం ఏమీ చేయలేని కథ కావటంతో ఆమె కూడా ఉపయోగపడలేదు. విశాల్ ఎప్పటిలాగే ఫైట్ లు, పాటలతో కాలం గడిపేసే ప్రయత్నం చేసాడు. ఇక హన్సిక ..కొంచెం కూడా మార్పులేకుండా తొలి సినిమాలో ఏ ఎక్సప్రెషన్స్ అయితే ఇచ్చిందో మార్పు లేకుండా అవే మెయింటైన్ చేస్తూ వస్తోంది..ఈ సినిమాలోనూ అదే కంటిన్యూ చేసింది.


ఇక టెక్నికల్ గా కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సోసో గ ఉంది. దర్శకుడు అంతకు మించి స్వేచ్చి ఇచ్చినట్లు లేరు. సంతానంకు రాసిన డైలాగులు బాగున్నాయి. ఫైట్స్ ..ఏవో స్పూఫ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చేలా చేసారు. దర్శకుడు...తాను కామెడీ తీస్తున్నాడో...యాక్షన్ చిత్రం చేస్తున్నాడో..యాక్షన్ కామెడీ చేస్తున్నాడో స్పష్టత ఉంటే బాగుండేది. సెంటిమెంట్ ఎమోషన్ రన్ అవుతున్నప్పుడు కూడా కామెడీ చేద్దామని చూసి చాలా సీన్స్ అభాసు పాలు చేసాడు. ఇది విశాల్ లాంటి హీరో చేయతగ్గ సినిమా కాదు. అతనికి ఇది మహేష్ కు ఆగడు లాంటి చిత్రం అని చెప్పాలి.


ఫైనల్ గా...రమ్యకృష్ణ, విశాల్, హన్సిక, వైభవ్,సంతానం వంటి కాంబో ప్యాకేజ్ చూసి ఏదో కుటుంబ కధా చిత్రం చూడబోతున్నాం అని వెళ్తే నిరాశపడతారు. అలా అనుకోకుండా ఏదో ఒకటి చూద్దామని వెళ్లినా నిరాశపడతారు. కాబట్టి...ఎలాగయినా ఫిక్స్ అయ్యి వెళ్లవచ్చు...ఈ సినిమాకు వెళ్దామని ఫిక్సైతే.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


చిత్రం: ‘మగ మహారాజు'
బ్యానర్: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
నటీనటులు: విశాల్, హన్సిక, మధురిమ, మాధవీలత , వైభవ్‌, రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌ తదితరులు
కెమెరా: గోపి అమర్‌నాథ్‌,
సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ,
ఎడిటింగ్‌:ఎన్‌.బి.శ్రీకాంత్‌,
ఫైట్స్‌: కణల్‌ కణ్ణన్‌,
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, సాహితి,
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వడ్డి రామానుజం,
నిర్మాత: విశాల్‌,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుందర్‌.సి.
విడుదల తేదీ : 27,02,2015.

English summary
Vishal, Hansika's Tamil film ‘Ambala’ is released in Telugu as ‘Maga Maharaju’ today with divide talk. Film directed by Sundar.C .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu