For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫలించని మాస్ 'పూజ' (రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.5/5
  'ఇంటర్వెల్ దగ్గర విలన్ చేతికి దొరికినా హీరో వదిలేస్తాడు..దేనికయ్యా అంటే సెకండాఫ్..అందులో క్లైమాక్స్ ఉంటుంది కదా అందుకు...' అన్నట్లు తయారవుతున్నాయి మన సినిమాలు.ఒక్కో డైరక్టర్ ది ఒక్కో స్కూల్. తమిళ దర్శకుడు హరిది మాత్రం పక్కా మాస్ స్కూల్. ఏం చేసినా, ఎలా చేసినా ఆ సీన్ లో మాస్ ని ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయని ఆయన కెమెరా లెన్స్ ని బూతద్దాల్లా మార్చి చూసి, వాటినే ఎలివేట్ చేస్తూంటారు. అయితే ఆ మాస్ పూజ ప్రతీసారి ఫలిస్తుందా...భాక్సాఫీస్ దేవత వరమిస్తుందా అంటే చాలాసార్లు ఫలించకపోయినా...తను ఉన్న స్టేజీ నుంచి మాత్రం తోసేయటం లేదు. ఇక ఈ సినిమా చేసేనాటికి హీరో విశాల్ పరిస్ధితి ఏమిటీ అంటే ...ఏం చేస్తే తను వరస ఫెయిల్యూర్స్ నుంచి బయిటపడగలను అనే తీవ్ర అన్వేషణలో ఉన్న స్టేజీ అది. ముందు సినిమా ఓకే అనిపించుకుని పాస్ మార్కులు పడితే చాలనుకునేటట్లు ఉన్నాడు. అలాంటి నేపధ్యం నుంచి వచ్చిన చిత్రం ఎలా ఉండాలో...ఎలా ఉంటుందో అక్షరాలా అలాగే ఉంది. ప్రతీ ఫ్రేమ్ లో మాస్ పూజ చేస్తూ వచ్చిన చిత్రం... స్క్రీన్ ప్లే విషయంలో...ముఖ్యంగా సెకండాఫ్ లో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

  Vishal's Pooja movie review

  బొబ్బిలి మార్కెట్ యార్డ్ లో వడ్డీ వ్యాపారం చేసుకునే వాసు(విశాల్) ..ఓ ఫైన్ డే...దివ్య(శృతిహాసన్)తో ప్రేమలో పడతాడు. అయితే దివ్య 'నువ్వేంటి ...నీ స్టేటస్ ఏంటి..నాతో ప్రేమేంటి?' అనటంతో.... ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్దామా అని ఎదురు చూస్తున్నట్లుండే హీరో ఫ్రెండ్ అయిన కమిడియిన్(సూరి) అతని ప్లాష్ బ్యాక్ గడగడా అప్ప చెప్పేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఓ భాషా టైపు. కొన్ని ప్రత్యేక పరిస్దితుల్లో పెద్ద కుటుంబం నుంచి వచ్చినా తనెవరో చెప్పకుండా ఇలా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నాడన్నాడన్నమాట. సరే ...ఫ్లాష్ బ్యాక్ ఫినిష్ అయ్యి లవ్ స్టోరీ సెట్ అయ్యే సరికి విలన్ సింగన్న (ముఖేష్ తివారి) సీన్ లోకి వచ్చేస్తాడు. అతనితో తల పడాల్సిన సమయం వచ్చేస్తుంది . ఆ విలన్ తిన్నమైనవాడు కాదు...హీరో ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపేస్తానని ప్రతిన పూనుతాడు. సరిగ్గా అదే సమయానికి హీరో రెచ్చిపోయి శివ తాండవం చేయటానికి అతనికి స్పెషల్ పవర్స్ ఇచ్చేస్తాడు పోలీస్ అధికారి శివరాం నాయక్(సత్యరాజ్). ఇక మరి అలాంటి పరిస్ధితుల్లో హీరో ఊరుకుంటాడా...మిగతా సినిమా అంతా విలన్ నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుంటూ... అతన్ని ఎలా సంహరించాడు అనేది మిగతా కథ. ఇంతకీ ఈ సింగన్న ఎవరు..హీరో కుటుంబానికి అతనికి శతృత్వం ఏమిటి...హీరో ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...అంత పెద్ద పోలీస్ అథికారి ఈ స్పెషల్ పవర్స్ ఇచ్చే స్కీమ్ పెట్టుకోవటం ఏమిటి ....వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా తప్పనిసరిగా చూడాల్సిందే.

  పైన చెప్పుకున్నట్లు కెరీర్ మొదటి నుంచీ మాస్ ప్రేక్షకులు (ముఖ్యంగా బి,సి సెంటర్లు)నా సినిమా చూస్తే చాలు అన్నట్లు తీస్తూ వస్తున్నారు దర్శకుడు హరి. అయితే అప్పుడప్పుడూ ఆయన దర్శకత్వంలో వచ్చిన 'యముడు'(సూర్య,అనుష్క) లాంటివి అన్ని వర్గాల మన్ననలూ అందుకున్నా...ఆయన మాత్రం తన నమ్మిన దారిని వదలలేదు. అందుకేనేమో మాస్ ఇమేజ్ కావాలనుకునే హీరోలంతా ఇమ్మిడియట్ గా ఆయన డైరక్షన్ లో చేయటానికి వెంటబడి మరీ డేట్స్ ఇచ్చేస్తూంటారు. ఆయన కూడా మొహమాటపడకుండా మొదట యాక్షన్ సీన్స్ డిజైన్ చేసుకుని తర్వాత వాటికి తగ్గ కథని అల్లే ప్రయత్నం చేస్తూంటారు. అలాంటి మరో ప్రయత్నమే...ఈ చిత్రం. మాస్ కోసమే దర్శకుడు పూజ చేస్తున్నట్లు ప్రతీ సీన్ సాగుతుంది. కథ కూడా తొంభైల నాటి రివేంజ్ డ్రామా తో కుమ్మేసాడు. విశాల్ కూడా ఇలాంటివే బోల్డు గతంలో చేసేసాడు...కాబట్టి ఎక్కడా తడుముకోకుండా అరుపులు, కేకలతో థియోటర్ ని మోతిక్కించేసాడు. అయితే విలన్ పాత్రని మరింత బాగా రాసుకోవాల్సింది. హీరో వైలెంట్ గా రెచ్చిపోవటానికి సరైన్ గ్రౌండ్ ని విలన్ రెడీ చేయలేకపోయాడు. అంటే ఏతా వాతా విలన్ తేలిపోయాడనే చెప్పాలి. అయితే దర్శకుడు మాత్రం తన స్పీడు నేరేషన్ తో ఆ విషయం మరుగున పెట్టడానికి ప్రయత్నం చేసాడు.

  ఇక విశాల్ మాత్రం ఒంటిచేత్తో ఈ చిత్రం నడిపాడు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ అరుపులు కేకలుతో హీరో క్యారెక్టర్ ని హైలెట్ చేయాలనుకోవటమే విసుగు తెప్పిస్తుంది. శృతి హాసన్ కేవలం గ్లామర్ ప్రదర్శన కే తీసుకున్నారు. ఆమె పాటలకు, కొన్ని లవ్ సీన్లలకు, హీరో ఫ్లాష్ బ్యాక్ ఓపిగ్గా వినటానికి మాత్రమే పనికివచ్చింది. సత్యరాజ్ పాత్ర బిల్డప్ ఎక్కువ..బిజినెస్ తక్కువ. అయితే ఉన్న కాసేపు దృష్టిని తనవైపు లాక్కో గలిగాడు. కాని అంత పెద్ద ఆర్టిస్టు ను పెట్టుకుని అంత బలహీనమైన పాత్రను ఎందుకు చేయించారో అనిపిస్తుంది. కమిడియన్ ఎవరో కొత్త అతను ..అయినా కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. రాథిక ఉన్న కాసేపు స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. ఆండ్రియా స్పెషల్ సాంగ్ ... అదీ బి,సి ల కోసం ఉద్దేశించినదే.

  టెక్నికల్ గా ... కెమెరా వర్క్ కొన్ని సన్నివేశాల్లో బాగానే ఉన్నా మిగతా చోట్ల నాసిగా ఉంటుంది. సినిమా మొత్తం ఒకే ఫేజ్ లో వెళ్లదు. ఎడిటర్ నుంచి కూడా సరైన అవుట్ పుట్ తీసుకోలేదు. మరింత ఎడిట్ చేసి, ట్రిమ్ చేయవచ్చు అనిపిస్తుంది. యవన్ శంకర్ రాజా తెలుగులోనే కాదు తమిళంలోనూ పాటులు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు. యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాయి. దర్శకుడు హరి... ఎంత సేపూ ఎంత స్పీడుగా ఇంకో సీన్ లోకి వెళ్లిపోదామా అన్నదే కానీ ఆ సీన్ లో ఏం చెప్పాము..ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము... ఏమన్నా లాజిక్ లు మిస్ అవుతున్నాయా అనేది పొరపాటున కూడా పట్టించుకునే ప్రయత్న చేయలేదు.

  ఫైనల్ గా మన తెలుగులోనే కాదు...ప్రక్క రాష్ట్రాలలోనూ పరమ రొటీన్ చిత్రాలే వస్తున్నాయని..మనం వారిని చూసి భాధపడక్కర్లేదని ఈ చిత్రం మరో మారు ప్రూవ్ చేస్తుంది. ఇక కథ,కథనం వంటి వాటికి సంభంధం లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ ని చూసి ఇష్టపడే వారు ఈ పూజ చేసుకోవచ్చు. ఫలితం దక్కుతుంది.

  నటీనటులు: విశాల్, శృతి హాసన్, సత్యరాజ్, రాథిక, ముఖేష్ తివారి,సూరి తదితరులు

  కూర్పు: విటి విజయన్

  ఛాయాగ్రహణం: ప్రియన్

  సంగీతం: యవన్ శంకర్ రాజా

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి

  నిర్మాత : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ

  విడుదల తేది:22 ,అక్టోబర్ 2014.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Vishal's new film Pooja released with divide talk.This film directed by Singam Director Hari.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X