twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యజ్ఞం - సమీక్ష

    By Staff
    |

    Yagnam
    - జలపతి గూడెల్లి
    చిత్రం: యజ్ఞం
    నటీనటులు: గోపీచంద్‌, సమీరా బెనర్జీ, దేవరాజు,
    సుమన్‌శెట్టి, ప్రకాష్‌రాజు తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: పోకూరి బాబూరావు
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి

    విలన్‌గా మంచి పేరుతెచ్చుకొన్న గోపీచంద్‌ హీరోగా నటించిన రెండో చిత్రం 'యజ్ఞం'. టైటిల్‌లో ఉన్నంత 'బలం' సినిమాలో లేకపోయినా, ఫర్వలేదనిపించే చిత్రమే. ఈ సినిమా కూడా రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథే అయినా, సినిమాలో ఎక్కువగా గోపీచంద్‌, సమీరాల మధ్య ప్రేమ, వ్యక్తిగత కక్షలమీదే సాగుతోంది. దాంతో గోపీచంద్‌ చక్కటి నటన, డైలాగ్స్‌, ప్రథమార్థంలో ముస్లిం యువతి పాత్ర పోషించిన ఓ అమ్మాయి, ధర్మవరపు సుబ్రమణ్యంల కామెడీతో వినోదంగా సాగుతుంది. ద్వితీయార్థం మూసగానే సాగినా, క్లైమాక్స్‌ పట్టుగా సాగడంతో సినిమా ఫర్వాలేదనిపిస్తోంది. సినిమాలో ప్రధానంగా గోపీచంద్‌ నటన, ట్రీట్‌మెంటే బలం.

    రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్‌ల ఇంట్లో బాంబులు పూలబుట్టల మాదిరిగా తీసుకుపోతారనిపించే సినిమాటిక్‌ దృశ్యాలు, జీపులను గాల్లోకి లేపడం వంటి షరామామూలు దృశ్యాలతో సినిమాను ఫర్వాలేదనిపించేవిధంగానే తీశాడు దర్శకుడు. అంత మెచ్చుకోదగ్గ చిత్రమూ కాదు. తలనొప్పి తెచ్చే చిత్రమూ కాదు.

    కథ పరంగా చెప్పాలంటే, శీనుగాడు (గోపిచంద్‌) రెడ్డప్ప(దేవరాజు)కు నమ్మకమైన అనుచరుడు. రెడ్డప్ప వ్యతిరేక వర్గం నాయుడమ్మ మనుషులు పేల్చిన బాంబుదాడుల్లోనే శీనుగాడి తల్లితండ్రులు, రెడ్డప్ప భార్య చనిపోతుంది. రెడ్డప్ప కూతురు శైలజ (సమీరా) అంటే శీనుకు ప్రాణం. చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగిన వీరు పెద్దయ్యాక కూడా ప్రేమించుకుంటారు. రెడ్డప్ప, నాయుడమ్మతో చేతులు కలిపి శీనుగాడిని లేపేయ్యాలని ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ శీనుగాడిని చంపలేకపోతారు. అదే సమయంలో శీనుగాడి, శైలజ మధ్య ప్రేమ రెడ్డప్పకు తెలుస్తుంది. శీనును కొట్టి ఊరి నుంచి గెంటేస్తారు. శైలజ, శీనులను చివరాఖర్లో ఆ ఊరి ఎస్‌.ఐ. (ప్రకాష్‌రాజ్‌) ఎలా కలుపుతాడు? రెడ్డప్ప, నాయుడమ్మలను ఎలా చంపేస్తాడు అనేది క్లైమాక్స్‌.

    సినిమాఖర్లో సందేశం బాగున్నా, ఈ లోపు నరకడాలు వంటివి చాలా దారుణంగానే చూపారు. సినిమా ఈతరం ఫిలింస్‌ చిత్రాల్లా కాకుండా మామూలు మాస్‌ చిత్రాల మాదిరిగానే ఉంది. ప్రధానంగా వ్యక్తిగత ప్రతీకార ప్రయత్నానికి 'యజ్ఞం' అని భారీ పేరు పెట్టారు.

    గోపిచంద్‌ సినిమా అంతా రఫ్‌గా కన్పిస్తాడు. తన నటన బాగుంది. అతని డైలాగ్స్‌లోనూ మంచి ఫోర్స్‌ ఉంది. సమీరా ఒకే. ఇతర పాత్రల్లో ధర్మవరపు సుబ్రమణ్యంతో పాటు ముస్లిం యువతి పాత్ర పోషించిన అమ్మాయి బాగా చేశారు. ప్రకాష్‌రాజ్‌, దేవరాజులు తమదైన ట్రేడ్‌మార్క్‌ పద్దతిలో అవలీలగా చేశారు. సినిమాలో మణిశర్మ సంగీతం అతిపెద్ద లోపం. గత కొంతకాలంగా మణిశర్మ సంగీతం మరీ నాసిరకంగా ఉంటోంది. 'మనసుతో..'అనే ప్లాఫ్‌ చిత్రం రూపొందించిన దర్శకుడు రవికుమార్‌ చౌదరి ఈ చిత్ర ంలో అంతో ఇంతో ప్రతిభను నిరూపించుకున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X