»   » ఏమి మాయ (అద్బుతం) చేసావో...(రివ్యూ)

ఏమి మాయ (అద్బుతం) చేసావో...(రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ye Maya Chesave
Rating

బ్యానర్: ఇందిరా ప్రొడక్షన్స్
నటీనటులు: నాగచైతన్య, సమంతా, కృష్ణుడు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి తదితరులు.
సంగీతం: ఎఆర్ రహమాన్
కెమెరా: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ఆంధోని
పాటలు: అనంత్ శ్రీరామ్
డైలాగులు: అనూరాధ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతం మీనన్
నిర్మాత: సంజయ్ స్వరూప్
రిలీజ్ డేట్: 26, పిబ్రవరి 2010

మొదటి సినిమా 'జోష్' తో నీరసం తెప్పించినా రెండో సినిమాతో పూర్తి స్ధాయి పట్టాలు ఎక్కాడు నాగచైతన్య. సెన్సెటివ్ లవ్ స్టోరీలు తీయటంలో పేరెన్నికగన్న దర్శకుడుగా గౌతం మీనన్ ఈ తాజా చిత్రాన్ని ఓ క్లాసిక్ గా తీర్చిదిద్దాననటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా విజువల్ ట్రీట్ అన్న పదానికి ఈ చిత్రం అద్దం పట్టేలా తయారైంది. నాగార్జున రీసెంట్ ఇంటర్వూలలో ఈ చిత్రాన్ని గీతాంజలితో పోల్చటం కరెక్టే అనిపిస్తుంది. అయితే కొద్ది స్లో నేరేషన్, డల్ గా ఉన్న పాటలు అక్కడక్కడా పంటి క్రింద రాళ్ళలా ఇబ్బంది పెడతాయి. ఈ చిత్రం ముఖ్యంగా మల్టీఫ్లెక్స్, ఎ సెంటర్స్ లో మంచి విజయం సాధిస్తుంది. యువతకు నచ్చే లవ్ సీన్స్ ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చిపెడతాయనటంలో సందేహం లేదు.

ఇరవై రెండు సంవత్సరాల కార్తీక్(నాగ చైతన్య) ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఫిల్మ్ దర్శకుడు అవ్వాలని కలలు కంటూంటాడు. అలాగే తన ఇంటి యజమాని కూతురు జెస్సీ(సమంత) అనే ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి ప్రేమలో పడతాడు. సాప్ట్ వేర్ ఎంప్లాయి అయిన ఆమె మళయాళి క్రిష్టియన్. అయితే ఆమె వయస్సు తేడా కావటం, మతం వేరు కావటంతో మొదట రిజెక్టు చేస్తుంది. అయితే హ్యాలిడేస్ కు కేరళలోని అలెప్పీ వెళ్ళినప్పుడు ఆమె అతని ప్రేమలోని నిజాయితీని గమనించి అతని వైపు మొగ్గుతుంది. ఆ తర్వాత వారు తమ కుటుంబాలను ఎలా ఒప్పించారు..తాము ఏకం కావటానికి ఉన్న సమస్యలను ఎలా అధిగమించారన్నది భావోద్వేగాలతో చెప్పబడ్డ మిగతా కథ.

ఏముంది ఇంతకు ముందు ఇలాంటి ఏజ్ గ్యాప్ కాంప్లిక్ గా గల లవ్ స్టోరీని ఆరో ప్రాణం లో చూసాం కదా అని అనచ్చు...అయితే ఈ చిత్రం కొత్త ఊహలతో విజువల్ బ్యూటీతో నిండిపోయి మనల్నీ మన గత ప్రేమ కథలవైపుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రయత్నం ఓ తమిళ దర్శకుడు చెయ్యాల్సి వచ్చిందే అనిపిస్తుంది. అయితే ఆరు పాటలు, నాలు ఫైట్స్ గల రెగ్యులర్ తెలుగు ప్రేమ కథ ని చూద్దామని వస్తే మట్టుకు ఈ చిత్రం నిరాశపరుస్తుంది. రియలిస్టిక్ టచ్ తో సాగే కథనం చాలాసార్లు అబ్బుర పరుస్తుంది. అలాగే కొత్త అమ్మాయి సమంత కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. నాగచైతన్య, సమంతా మధ్య మంచి కెమెస్ట్రీ కుదిరింది. అయితే అందరికి ఇబ్బంది పెట్టింది ఒకే ఒక అంశం అంది తెలుగు సినిమా అని గుర్తు పెట్టుకోకుండా ఎక్కవ భాగం ఇంగ్లీష్ డైలాగులతో సీన్స్ నింపటం. ఫైనల్ గా ట్రైన్ లో ముద్దు పెట్టుకునే సన్నివేశం వద్ద ధియోటర్ లో ఓ మాస్ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది. చెప్పే విధంగా చెపితే ఎలాంటి కథనయినా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందని ఈ చిత్రం ప్రూవ్ చేస్తుంది. నటనాపరంగా నాగచైతన్య రెండో చిత్రానికి మంచి పరిణితి సాధించాడనిపిస్తుంది. నిర్మాణ విలువలూ బాగున్నాయి. దర్శకుడుగా గౌతం మీనన్ గురించి,అయన టీమ్ గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. సినిమా ఫెయిల్యూర్ అయిన సందర్భాలలోనూ ఆయన కొన్ని సన్నివేశాల్లో అద్బుత పనితనం చూపి మంచి మార్కులు వేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఆయన ఆత్మ కథా అన్నంత గొప్పగా తీర్చి దిద్దిన ఈ చిత్రం గురించి చెప్పేదేముంది.పాటులు ఆడియో గొప్పగా అనిపించకపోయినా ధియోటర్ లో చాలా బాగుండటం మరో విశేషం.

ఇక ఈ చిత్రం ఎక్కువగా విశ్లేషణ చేసుకోవటం కన్నా,చూడటం మేలు అని చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఫీల్ డామినేట్ చేసిన ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదించటమే ఆనందకర విషయం. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలంటే...ఆదరించటం ఒక్కటే మార్గం. టిక్కెట్టుకు సరైన న్యాయం చేసిన ఫీల్ గ్యారింటీగా వస్తుంది. చూడకపోతే వెళ్ళండి..చూస్తే...మళ్ళీ టిక్కెట్ బుక్ చేసుకోండి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu