For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవినీతి మీద 'యువసేన' విజయం

  By Staff
  |

  Yuvasena
  - జోశ్యుల సూర్యప్రకాష్‌

  చిత్రం: యువసేన 3/5‌

  నటీనటులు: భరత్‌, శర్వానంద్‌, పద్మకుమార్‌, కిషోర్‌, గోపిక‌

  సంగీతం: జాస్సీగిఫ్ట్‌‌

  దర్శకత్వం: జయరాజ్‌‌

  నిర్మాత: స్రవంతి రవికిషోర్‌‌

  వరసగా రీమేక్‌ చిత్రాలు (ఎలా చెప్పను, గౌరి) నిర్మిస్తున్న స్రవంతి రవికిషోర్‌ మరోసారి మలయాళంలో ఘన విజయం సాధించిన '4 ది పీపుల్‌' చిత్రాన్ని అదే దర్శకుడు జయరాజ్‌తో నిర్మించిన చిత్రం 'యువసేన'. మలయాళంలో 'దే శీయ గీతం' వంటి అద్భుత చిత్రాలను మలిచిన జయరాజ్‌ ప్రతిభ అడుగడుగునా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. పాతకథే అయినా కొత్త కథనంతో పాత సీన్లనే కొత్త టేకింగ్‌తో పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రం చిన్న బడ్జెట్‌దైనా మంచి విజయం సాధించవచ్చు.

  అణువణువునా అవినీతి నిండిన ఈ వ్యవస్ధను ఎవరైనా వచ్చి సరిదిద్దితే బాగుంటుందని అందరికీ ఉంటుంది. అదే స్ఫూర్తితో వచ్చిన 'భారతీయుడు' 'నిజం' 'ఠాగూర్‌' చిత్రాలు విజయం సాధించాయి. అదే దారిలో అదే కథతో నడిచే ఈచిత్రం ప్రధానంగా నలుగురు కుర్రాళ్ళు (అవినీతికి బలైన కుటుంబాల నుంచి వచ్చిన వారు) వినూత్న రీతిలో '4 ది పీపుల్‌' అనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి, అందులోకి వచ్చిన మెయిల్స్‌ చూసి అవినీతి పరుల ఆచూకీ కనుక్కుని హెల్మెట్‌లతో బైక్‌లపై వెళ్ళి చేతులు నరికి వస్తారు. అలాగైనా అవినీతిపరుల్లో మార్పు వస్తుందని వీరి ఆశ. వీరు చేసే ఈ సాహసాలను మీడియా హైలైట్‌ చేయడంతో ప్రజలనుంచి మంచి స్పందన వస్తుంది. కానీ చట్టాన్ని హీరోలు తమ చేతుల్లోకి తీసుకోవడం నచ్చని ప్రభుత్వం శరత్‌చంద్ర (సురేష్‌ మీనన్‌) అనే ఎసిపిని ఈ కేసుకు స్పెషలాఫీసరుగా నియమిస్తారు. అక్కడి నుంచి ఎత్తులు పైఎత్తులతో కథ ఇంటర్వెల్‌ వరకు పరుగెడుతుంది.

  ఆ తర్వాత ఒక కళాశాల సన్నివేశం. ఒకమ్మాయిని ప్రేమించిన ఒక ఉన్మాది మనోహర్‌ తరహాలో ఆ అమ్మాయిని చంపేస్తాడు. వీడిని పట్టుకోడానికి హీరోలు రంగంలోకి దిగుతారు.

  ఉన్మాది తండ్రి రాజకీయ నాయకుడు. ఈ కేసునుంచి తప్పించుకోడానికి ఆ హంతకుడు ఒక ఆస్పత్రిలో చేరుతాడు. హీరోల నుంచి తనకు ప్రాణభయం ఉందని గ్రహించి అతను ఒక ఎత్తుగడ వేస్తాడు. ఈ నలుగురు హీరోల తరహాలో ఉండేవారిని పంపి ఒక మెంటల్‌ హాస్పటల్‌ను తగులబెట్టించి హీరోలకు చెడ్డపేరు వచ్చేలా చేస్తాడు. హీరోలపై షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్లను పోలీసులు ఇవ్వడంతో కథ క్లెయిమాక్స్‌కు చేరుతుంది. హీరోలు తెగించి ఉన్మాది చెయ్యి నరికి తమకు చెడ్డ పేరు తెచ్చిన తండ్రిని చంపబోయి పోలీసులకు పట్టుబడతారు. యువసేనకు మద్దతు ఇచ్చే మరో నలుగురు ముందుకు వచ్చి ఆ రాజకీయ నాయకుడిని హతమార్చడంతో కథ సుఖాంతమవుతుంది.

  యూత్‌ చిత్రాల ముసుగులో బూతు చిత్రాలు వస్తున్న ఈ తరుణంలో ఈ సినిమా మంచి రిలీఫ్‌. కుర్రాళ్ళు అనగానే సిగరెట్లు తాగుతూ పోసుకోలు కబుర్లు చెప్పుకుంటారన్న అభిప్రాయానికి భిన్నంగా ఈ నలుగురు హీరోలు సామాజిక సృహతో వ్యవహరిస్తూ హుందాగా ఉంటారు. హింస ఉన్నా రెచ్చగొట్టేలా కాకుండా సమస్యను వేలెత్తి చూపేలా ఉంటుంది.

  కొన్ని లోపాలు

  కుర్రాళ్ళకు కుటుంబం నుంచి డబ్బు రాదు. వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో స్పష్టత లేదు. కుర్రాళ్ళు యాంగ్రీ యంగ్‌మెన్‌గా ఎందుకు మారారో బాక్‌గ్రౌండ్‌ బలంగా లేదు. వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు కానీ వారి పేద కుటుంబాలను పట్టించుకోరు. హీరోయిన్‌ గోపిక క్యారెక్టర్‌ సినిమా పాటల కోసమే అన్నట్టు ఉంటుంది. సినిమా ఫస్టాఫ్‌ స్పీడుగా ఆసక్తికరంగా ఉంది. సెకండాఫ్‌ కొద్దిగా డ్రాగ్‌ అయింది. అయినా క్లెయిమాక్స్‌ రక్తి కట్టింది. హీరోలు కాలేజీకి వెళ్ళడం ఒక సీన్‌లో తప్ప సినిమాలో మరెక్కడా కన్పించదు. అవినీతిపరులపై మెయిల్స్‌ పంపే వారి మంచిచెడులను విచారించకుండా హీరోలు యాక్షన్‌లోకి దిగడం సమంజసంగా అన్పించదు.

  కొండవీటి సింహం, ఒకేఒక్కడు వంటి సినిమాల వాసనలు కన్పించినా ఇది మొత్తంగా మంచి సినిమా. ఇంటర్వెల్‌ బ్రేక్‌ హైలైట్‌. పాటలు బాగున్నాయి. కెమెరా అద్భుతం.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X