2020లో టాలీవుడ్.. వారి కోసం కదిలిన సెలెబ్రిటీలు
టాలీవుడ్ మునుపెన్నడూ చూడని, ఎరుగని కష్టం 2020లో వచ్చింది. కరోనా వైరస్ వచ్చి అందరి జీవితాలను అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ, అందులో పని చేసే కార్మికులు, రోజూ వారి శ్రామికుల పొట్ట కొట్టేసింది. షూటింగ్‌లు లేక ఉపాధి కరువై ఎంతో మంది రోడ్డున పడ్డారు. అలాంటి వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ చారిటీ అంటూ మొదలుపెట్టి కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చాడు.
అలా చిరంజీవి పిలుపుతో టాలీవుడ్ మొత్తం కదిలింది. ఎవరికి తోచిన సాయాన్ని వారు అందించారు. అందరూ డబ్బుల రూపంలోనే కాకుండా కొందరు వారికి నచ్చిన విధంగా సాయం చేశారు. నిత్యావరసర సరుకులు అందించారు. గుప్త దానాలు చేశారు. ఇలా ఎన్నో రకాలు మన తారలు సినీ కార్మికుల కోసం నిలబడ్డారు. అలా సీసీసీ ద్వారా దాదాపు ఎనిమిది కోట్లు సేకరించారు. వాటితో దాదాపు మూడు నాలుగు నెలలు సినీ శ్రామికులకు సరుకులు అందించారు.

సీసీసీ కోసం సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇలా అందరూ ముందుకు వచ్చారు. విరాళాలు ఇచ్చారు. తమ పెద్ద మనసును చాటుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి. సినిమా షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి.. మళ్లీ సందడి వాతావరణం నెలకొంటోంది. ఇక థియేటర్లలో టిక్కెట్లు తెగడం మాత్రమే బాకీ ఉంది. ఇక వచ్చే ఏడాది అయినా సినిమా పరిశ్రమ పూర్తి స్థాయిలో కోలుకుంటేందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











