చిన్మయి శ్రీపాదకు ఊరట... సమంత ట్వీట్‌తో
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాదకు ఊరట లభించింది. తమిళనాడు డబ్బింగ్ యూనియన్ నుంచి గతేడాది నవంబర్‌లో ఆమెపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా యూనియన్‌కు కట్టాల్సిన చందా చెల్లించలేదనే కారణంతో యూనియన్ సభ్యులు ఆమెపై వేటు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి షోకాజ్ నోటీస్ లేకుండా నిషేధం విధించడం చర్చనీయాంశమైంది. కానీ ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఓ బేబీ సినిమా తమిళ వెర్షన్‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో ఈ వివాదానికి కొంత తెరపడినట్టు తెలిపింది.
ఎట్టకేలకు నేను సమంతకు తమిళంలో డబ్బింగ్ చెప్పాను. ఇది కేవలం నందినీరెడ్డి, సమంత వల్లే సాధ్యమైంది. ఓ మహిళ మరో మహిళకు అండగా నిలుస్తుందని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని చిన్మయి ట్వీట్ చేసింది.

సినీ పరిశ్రమలో మీ టూ ఉద్యమం ఊపుందుకొన్న సమయంలో సినీ రచయిత వైరముత్తుపై చిన్మయి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ విషయం మనసులో పెట్టుకొనే చిన్మయిని ఎలాంటి నోటీసు లేకుండా తప్పించారనే వాదన వినిపించింది.
నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే చిత్రంలో సమంత నటిస్తున్నది. కొరియాలో విజయం సాధించిన మిస్ గ్రానీ అనే సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం జూలై 5వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అలాగే నాగార్జునతో మన్మథుడు2 చిత్రంలో కూడా కనిపించబోతున్నది.


Click it and Unblock the Notifications











