»   » నేనేమీ కాపీ కొట్టలేదు...దర్శకుడు మురుగదాస్ మొర

నేనేమీ కాపీ కొట్టలేదు...దర్శకుడు మురుగదాస్ మొర

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఇవన్నీ అర్దంలేని పుకార్లు. ఈ రూమర్స్ తలా తోకా లేకుండా పుట్టుకొస్తున్నాయి. 'ఇన్‌ సెప్షన్‌' ను నేను కాపీ కొట్టలేదు. అయినా రీసెంట్ గా(జులై 16న) విడుదలయిన కొత్త సినిమాను నేనెలా కాపీ కొడతాను?" అని మురగదాస్‌ మీడియాను ప్రశ్నించాడు. ఆయన తాజా చిత్రం '7 ఓం అరివు' చిత్రం ఇన్సెప్షన్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని వార్తలు రావటంతో మురుగదాస్ ఇలా స్పందించారు. సూర్యతో 'గజిని', చిరంజీవి హీరోగా 'స్టాలిన్‌' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మురుగదాస్‌ తాజా చిత్రం పై 'కాపీ' రూమర్స్ అంతటా వినిపిస్తున్నాయి. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్‌ చిత్రం 'ఇన్ ‌సెప్షన్‌' (తెలుగులో 'ఆరంభం') చిత్రం ఆధారంగా మురుగదాస్‌ తాజా చిత్రం '7 ఓం అరివు' కథ అల్లాడని కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ పై మురుగదాస్‌ చిరాకుపడ్డాడు.

ఇక ఈ రూమర్ పుట్టడానికి కారణం...మురుగదాస్‌ గతంలో రూపొందించిన 'గజిని' చిత్రం (తమిళ, హిందీల్లో అదే టైటిల్ ‌తో వచ్చింది) క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో విడుదలైన 'మెమంటోస్‌' చిత్రం ఆధారంగా తయారైంది. అలేగా స్టాలిన్ చిత్రం కూడా పే ఇట్ ఫార్వర్డ్ అనే చిత్రం ఆధారంగా రూపొందిందే.

దాంతో ఈ కొత్త చిత్రంపై కాపీ రూమర్ ప్రారంభమైంది. ఇక కాపీ వివాదంలో చిక్కుకున్న '7 ఓం అరివు' చిత్రం షూటింగ్‌ కొద్ది వారాల క్రితం చెన్నయ్‌లో ప్రారంభమైంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ చైనాకు వెళుతోంది. హారీస్‌ జయరాజ్‌ సంగీత దర్శకత్వంలో పాటల రికార్టింగ్‌ పూర్తయింది.

ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ రవి.కె.చంద్రన్‌ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు చేపట్టారు. సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ కుమార్తె శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక అదే దర్శకుడు తదుపరి చిత్రాన్ని ఎలా కాపీ కొడతాడు..మహా అయితే వేరే హాలీవుడ్ చిత్రం ఎత్తుకుంటాడు కానీ అని కొందరు తమిళ దర్శకులు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలో హిట్ అనేది అల్టిమేట్ కాబట్టి కాపీ అనేది కేవలం వదంతి వంటిదే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu