»   » రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్‌స్టార్ వ్యాఖ్య..!

రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్‌స్టార్ వ్యాఖ్య..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన రాజకీయ రంగ ప్రవేశం దేవుడి చేతిలో ఉందని దక్షిణాది సూపర్‌ స్టార్ రజనీకాంత్ అన్నారు. దర్శకత్వం అంటే తనకు తెలియదని, దాని జోలికి వెళ్లనని స్పష్టంచేశారు. దక్షిణ భారత చలన చిత్ర దర్శకుల సంఘం 40వ వార్షికోత్సవం శనివారం రాత్రి చెన్నైనగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా ఓ దర్శకుడు తనకు నచ్చిన నటుడ్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రజనీకాంత్‌ ను ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ ఇంటర్వ్యూ చేశారు. రజనీకాంత్ తన స్కూల్ విద్యార్థి అని, ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా తనకు విద్యార్థేనంటూ బాలచందర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ గురువుగా సంబోధించే రజనీని ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉందన్నారు. బాలచందర్ అడిగిన ప్రశ్నలు, వాటికి రజనీ తనదైన శైలిలో ఇచ్చిన సమాధానాలిలా ఉన్నాయి...

బాలచందర్: స్టార్ అయ్యాక కోల్పోయిందేమిటి? రజనీకాంత్: ఎన్నో కోల్పోయాను. సాధారణ వ్యక్తిలా హోటల్‌ కు వెళ్లి భోజనం చేయలేకపోతున్నా. ప్రశాంతత కోల్పోయాను. అయితే ఇలాంటి వాటని త్యాగం చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. జీవిత చరిత్రను రాస్తారా? జీవిత చరిత్రలో నిజాల్ని రాయాల్సి ఉంటుంది. అందులో పేర్కొనే అంశాలు ఇతరుల మనసును గాయపరచొచ్చు. జీవిత చరిత్ర రాసే ధైర్యం జాతిపిత మహాత్మా గాంధీకి మాత్రమే ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తా. దర్శకుడి అవతారం ఎత్తుతారా? దర్శకత్వం గురించి నాకు తెలియదు. మక్కువా లేదు. దాని జోలికెళ్లను. ఇప్పటివరకు నటించిన చిత్రాలెన్ని? అందులో నచ్చినవి?154 చిత్రాల్లో నటించాను. రాఘవేంద్ర, బాషా, ఎంతిరన్(రోబో) నచ్చిన చిత్రాలు. జాతీయ అవార్డు ఎప్పుడు తీసుకుంటారు? అది దర్శకుడి చేతిలో ఉంది. నచ్చిన దర్శకుడు? మహేంద్రన్. సినిమాల్లో సిగరెట్ స్టైల్ తగ్గించారేంటి? నిజ జీవితంలో సిగరెట్ తాగడమే తగ్గించేశాను. రాజకీయాల్లోకి వస్తారా? అది దేవుడి చేతిలో ఉంది. ఎవరినైనా చూసి అసూయ పడ్డారా? హిమాలయాల్లోని సాధువులను చూసి చాలాసార్లు అసూయ పడ్డా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu