మనోరమకు నివాళిగా కమల్ హాసన్ వీడియో
చెన్నై: ఆదివారం మృతి చెందిన ప్రముఖ నటి మనోరమ సినీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నటుడు కమల్ హాసన్ ఓ వీడియోను విడుదల చేశారు. సినీ ప్రస్థానంలో వివిధ దశల్లో ఆమెతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ.. ఆమెకు నివాళిగా ఈ వీడియోను కమల్ తన నిర్మాణ సంస్థ యూట్యూబ్ ఖాతాలో విడుదల చేశారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.
ప్రముఖ సినీ నటి మనోరమకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మనోరమ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
డీఎంకే అధినేత కరుణానిధి, పలువురు రాజకీయ నేతలు ఆమెకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆమె మరణ వార్త విని కడసారి చూపుకోసం ఆమె స్వగృహానికి తరలివచ్చారు. ప్రముఖ నటులు రజనీకాంత్, అజిత్, విజయ్, శింబు, నటి స్నేహ, కోవై సరళ తదితరులు ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

సీనియర్ నటి మనోరమ (78) చెన్నైలో శనివారం రాత్రి కన్నుమూశారు. తెలుగు, తమిళం ఇతర భాషల్లో వెయ్యికిపైగా చలన చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై పలు సీరియళ్లలోనూ నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు.

పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె తొలుత రంగస్థల నటిగా గుర్తింపు పొందారు. తర్వాత సినీరంగంలోకి వచ్చారు. 1937, మే 26న తమిళనాడులోని ఆమె తంజావూరులోని మన్నార్గుడిలో జన్మించారు జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2.

మనోరమ భౌతికకాయాన్ని టినగర్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. నేటి సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మనోరమ మృతికి వన్ ఇండియా తెలుగు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











