తలలు నరికితే, జీఎస్టీ కట్ చేస్తారా? ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శ..!
స్వేచ్ఛగా ఉంటాను..
నేను కేరళలో ఏ కార్యక్రమానికి వచ్చిన స్క్రిప్టుతో హాజరుకాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అంక్షలు, ఎలాంటి భయాలు, సెన్సార్ నిబంధనలు ఉండవు కనుక. నాకు కేరళ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి భయం లేకుండా శ్వాస తీసుకోగలను. ఇక్కడే స్వేచ్ఛగా ఉండగలను
దుర్గ పేరుతో మద్యం షాపులు
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సెక్సీ దుర్గ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకున్నందుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. సెక్సీ దుర్గ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే వారికి దుర్గ పేరుతో ఉంటే బార్ షాపులు, మద్యం దుకాణాలు కనిపించవు.
నన్ను బెదిరించే వాళ్లను చూస్తే
నన్ను బెదిరించే వాళ్లను చూస్తే నాకు నవ్వు వస్తుంది. వారిపై జాలి కూడా కలుగుతుంది. అన్యాయాలు, అరాచకాలపై నన్ను మాట్లాడకుండా చేయడానికి వారు నానారకాలుగా ప్రయత్నిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా నన్ను గళాన్ని నిలువరించలేరు అని ప్రశాక్ రాజ్ అన్నారు.
నేను ఎవరికీ భయపడను..
ఎవరెన్నీ రకాలుగా భయపెట్టించినా నేను సామాజిక అంశాలపై గళం వినిపిస్తూనే ఉంటాను. ఓ కళాకారుడిగా నా గళాన్ని వినిపించడానికి భయపడను. నాకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు. ప్రభుత్వాలపై, అన్యాయాలు, అరాచకాలపై ప్రశ్నించకుండా అడ్డుకుంటున్నారు. ప్రశ్నించే భవిష్యత్ తరాలను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
హిట్లర్‌కు వారసులా?
ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండేవాళ్లు తలలు తెగనరికినా ఎలాంటి భయం లేకుండా సమాజంలో తిరుగుతున్నారు. అందుకు రాజస్థాన్‌లోని పరిస్థితులే కారణం. వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. వారు మేము హిట్లర్‌కు వారసులం అని ఫీలవుతున్నారు అని ప్రకాశ్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీపై మండిపాటు
కర్ణాటకలో హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వహించడంపై ప్రకాశ్ రాజ్ నిలదీసిన సంగతి తెలిసిందే. పద్మావతి చిత్రంపై కొందరు చేస్తున్న రాద్దాంతంపై కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఇలా కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తున్న ప్రకాశ్ రాజ్ మళ్లీ కేరళలో సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.