సీనియర్ హీరోయిన్ కుష్బూకు రోడ్డు ప్రమాదం.. ఆయన వల్లే ఇలా జరిగిందంటూ ట్వీట్
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సౌతిండియన్ బ్యూటీ కుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, దీని నుంచి ఆమె తప్పించుకున్నారు. ఆమెతో పాటు కారులో ఉన్న ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకురాలైన కుష్బూ వెల్‌యాత్రలో పాల్గొనేందుకు కడ్డలూరు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన ఓ కంటైనర్ ఆమె ప్రయాణిస్తున్న కారును తగులుకుంటూ వెళ్లింది. దీంతో ఎడమ వైపు ఉన్న డోర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఘటన జరగగానే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం కుష్బూ వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమెనే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.

ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత కుష్బూ వరుస ట్వీట్లు చేశారు. 'దేవుడి దయ వల్లే మాకు ఎటువంటి గాయాలు కాలేదు. నా భర్త దేవుడిపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది. నా గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. అందుకే నా ప్రయాణాన్ని కొనసాగించాను' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
ఇదిలాఉండగా, సినిమాలకు బ్రేకిచ్చిన తర్వాత కుష్బూ రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె... ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల అరెస్ట్ కూడా అయ్యారు.


Click it and Unblock the Notifications











