రజనీకాంత్ మూవీలో సిమ్రన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ.... వారి పాత్రలు ఇవేనా?
Recommended Video

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతి సినిమాలో మాజీ స్టార్ హీరోయిన్ హీరోయిన్ సిమ్రన్, ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన చేసింది. రజీనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ఈ ఇద్దరు సైన్ చేసినట్లు సన్ పిక్చర్స్ ట్వీట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

రజనీతో తొలిసారి
సిమ్రన్ గతంలో దక్షిణాది అగ్రహీరోలైన కమల్ హాసన్, చిరంజీవి లాంటి ఎందరో స్టార్లతో చేసింది. అయితే రజినీకాంత్ సినిమాలో నటించడం ఆమెకు ఇదే తొలిసారి. గతంలో రజనీ సినిమాల్లో ఆమెకు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సమయంలో డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల చేయలేక పోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సూపర్ స్టార్ మూవీలో చేసే అవకాశం దక్కడంతో వెంటనే ఓకే చెప్పిందట.

రజనీ భార్య పాత్రలో
ఈ చిత్రంలో సిమ్రన్... రజనీకాంత్ భార్య పాత్రలో కనపించబోతున్నారట. సిమ్రన్ వయసుకు తగిన విధంగా నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలో ఆమె కనిపించబోతోందని, ఎలాంటి గ్లామర్ షో ఉండబోదని సమాచారం.

దర్శకుల ముందు జాగ్రత్త
రజనీ గత చిత్రాల్లో రాధిక ఆప్టే, హ్యూమా ఖురేషి లాంటి గ్లామరస్ తారలు నటించినా... కథకు తగిన పాత్రల్లో సాధారణంగా కనిపించారే తప్ప గ్లామర్ షోకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రజనీ వయసుకు తగిన విధంగా దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలాంటి సీన్లు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. సిమ్రన్ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారట.

నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర ఏమిటి?
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విషయానికిస్తే.. ఈ చిత్రంలో ఆయన నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. మరి వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అసలు విలన్ ఎవరు? అనేది తేలాల్సి ఉంది.

సమ్మర్ రిలీజ్
సినిమా షూటింగ్ విశేషాల్లోకి వెళితే ఇప్పటికే డార్జిలింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. వచ్చే సమ్మర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











