»   » డా.డి. రామానాయుడు గురించి నటి సీత, రాధిక

డా.డి. రామానాయుడు గురించి నటి సీత, రాధిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రామానాయుడు దేశం గర్వించదగ్గ నిర్మాత. ఆయన ప్రస్థానం మొదలైంది మాత్రం చెన్నపురిలోనే. ఆయనతో ఇక్కడ ఎంతో మందికి ఆత్మీయానుబంధం ఉంది. ఆయన లేరన్న వార్త చెన్నపురిలోని తెలుగువారికి దిగ్భ్రాంతి కలిగించింది. బాధాతప్త హృదయులైన పలువురు సినీప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సీత, సీనియర్‌ నటి మాట్లాడుతూ...

తెలుగు సినిమాల్లో నటించేటప్పుడు రామానాయుడు పేరే ఎక్కువగా వింటుంటా. చాలా క్రమశిక్షణతో ఉంటారని నా స్నేహితులందరూ చెబుతుంటారు. కానీ ఆయన బ్యానరులో నటించే అవకాశం దక్కలేదు. అయినా ఆయనంటే నాకు చాలా అభిమానం. గౌరవం కూడా. భారత చిత్ర పరిశ్రమ ఓ పెద్ద నిర్మాతను కోల్పోయింది. అలాంటి వ్యక్తులే చిత్రపరిశ్రమకు చాలా అవసరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.

రాధిక మాట్లాడుతూ...

Sita,Radhika about D. Ramanaidu

రామానాయుడు ఇక లేరనే వార్త తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన సినిమాల్లో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి. నేను నిర్మాణం, నటన తదితర అనేక బాధ్యతలు చేపడుతున్నానంటే స్ఫూర్తి నాయుడుగారే. ఇదే విషయం ఆయనతో ఇటీవల అన్నాను కూడా. ఆయన్ను ఒక రోజు పరిశీలిస్తే చాలు ఆ సమయంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

రాజశ్రీ మాట్లాడుతూ...

నాయుడుగారు నిర్మించిన సినిమాల్లో నేను హీరోయిన్‌గా చేసింది ఒక్క 'ప్రతిజ్ఞాపాలన'లోనే. 'స్త్రీజన్మ'లో ఒక పాటలో నటించాను. ఆయన బ్యానర్‌లో ఒక సినిమా చేసినా పది సినిమాలు చేసినంత. ఆయనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేం దాదాపు ఒకే ఈడువాళ్లం. నా సినిమాలు, ఆయన సినిమాలు ఒకే స్టూడియోలో పక్కపక్క సెట్లలోనే జరుగుతుండేవి. ఆయన ఎక్కడున్నా వాళ్ల ఇంటి నుంచి భోజనం వచ్చేది. నాకు బాగా గుర్తు వాహిని స్టూడియోలో ఒక పెద్ద డైనింగ్‌ టేబుల్‌ ఉండేది.

భోజన సమయంలో ఆర్టిస్టులందరూ తమ క్యారేజీలు అక్కడకు తేవాల్సిందే. నాయుడుగారి ఇంటి నుంచి వచ్చిన భోజనం మేం తినేస్తే ఆయన మా భోజనం పంచుకు తినేవారు. తాను ఓ గొప్ప నిర్మాత అనే గర్వం ఏమాత్రం కనిపించకుండా అందరితోనూ ఎంతో బాగా కలిసిపోయే మనిషి ఆయన. నన్ను ఎప్పుడూ 'మా పిక్చర్‌లో నటిస్తావా' అంటూ అడుగుతుండేవారు. హైదరాబాద్‌లో నా వివాహం జరిగినప్పుడు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు తీరిక చేసుకుని వచ్చి వెళ్లారు.

హైదరాబాద్‌లో ఆ మధ్య ఏఎన్‌ఆర్‌గారు నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు చివరిసారిగా రామానాయుడుగారిని కలిశాను. చాలా సహాయగుణం ఉన్న వ్యక్తి. నేనూ, కాంతారావు, మరికొంతమంది ఆర్టిస్టులం కలిసి సేలంలో షూటింగ్‌కని రైళ్లో వెళుతున్నప్పుడు పై బెర్తులో నిద్రించడం వల్ల కాబోలు నాకు వెన్నులో నొప్పిగా అనిపించింది.

నాయుడుగారు వెంటనే నన్ను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించి నా ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలను ఆయన ఒక యజ్ఞంలా తీస్తారు. అలాంటి మంచి మనిషి మరణ వార్త వినాల్సి రావడం నాకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చెప్పుకొచ్చారామె.

కాంచన మాట్లాడుతూ...

ఎందుకనో తెలియదు కానీ నాకు నాయుడిగారితో అన్నేళ్ల పరిచయం ఉన్నా నేను ఆయన సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం లభించలేదు. 'న్యూఢిల్లీ' సినిమాలో నన్ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. శ్రీకృష్ణతులాభారం సినిమాలోనూ కృష్ణుడి అష్ట భార్యల్లో ఒకరిగా నా చేత నటింపజేయాలిన ప్రయత్నించినా అది కూడా వీలు కాలేదు. అయితే ఆయన సినిమా 'సెక్రటరీ'లో అక్కినేని సరసన అతిథి పాత్రలో నటించాను.

అలా రామానాయుడు బ్యానర్‌లో నటించే అవకాశం కలిగింది. ఆయన సినిమాల్లో నటించకపోయినా ఆ ఫీలింగ్‌ మనకు ఉండదు. తన సినిమాలో నటించారా లేదా అనేది ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఒక వ్యక్తి ఇన్నేళ్లు, ఇన్ని సినిమాలు తీయాలంటే అయ్యేపని కాదు. ఒక నాగిరెడ్డి, జెమినీ వాసన్‌, ఏవీఎం వారికో అది సాధ్యమవుతుంది, కారణం అవి సంస్థలు, కానీ నాయుడుగారు ఒక వ్యక్తిగా నడక ఆరంభించి, సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ఇంత స్థాయికి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు.

ఆయన సినిమాకు సంబంధించి ఏ ఫంక్షన్‌ జరిగినా సరే 'ఏమండీ కాంచనగారు మీరు తప్పకుండా రావాలి' అని పిలిచేవారు. ఒక మంచి మనిషి, ఒక మంచి నిర్మాత. ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

శారద మాట్లాడుతూ...

ప్రయోగాలకు పెద్ద పీట వేసే నిర్మాత ఎవరంటే నాయుడుగారి పేరే ముందు చెబుతాను. ఎందుకంటే ఆయన రూపొందించిన సినిమాలన్నీ అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్లుగానే మిగిలాయి. 'ప్రతిధ్వని'లో నా చేత పోలీసు అధికారి వేషం వేయించారు. పోలీసు ప్యాంటు, చొక్కాలతో ఉన్న నన్ను చూసి చాలా మంది 'నాయుడుగారు ఇలా వర్కవుట్‌ అవుతుందా?.. ఈ అమ్మాయిని జనం చూస్తారా?' అని రామానాయుడిని అడిగారు.

'చూస్తారా కాదు... హిట్‌ చేస్తారు కూడా' అని నాయుడుగారు సమాధానమిచ్చేవారు. నిజంగానే ఆ సినిమా పెద్ద హిట్‌. ఒక సినిమాపైన, దాని కథా బలంపైన ఆయనకున్న నమ్మకం అలాంటిది. ఒక సినిమా ప్రారంభమైందంటే పూర్తయ్యేంత వరకూ నిద్రపోరు. సెట్స్‌లో ఆయన ఒక నిర్మాతగా మనకు కనిపించరు. అన్ని పనులూ చేస్తారు. అలాంటి మంచి మనిషి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన గుండెల్లో నిత్యం జీవించే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అన్నారు.

English summary
Radhika has expressed her deep condolences for the death of Veteran producer Dr D Ramanaidu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu