బిగ్‌బాస్‌లో స్వలింగ సంపర్కం లొల్లి.. ఇష్టం లేకపోతే వెళ్లిపో అంటూ హోస్ట్ వార్నింగ్
బిగ్‌బాస్ రియాలిటీ షోలో స్వలింగ సంపర్కం (Homophobic) అంశం తీవ్ర వివాదంగా మారింది. స్వలింగ సంపర్క బంధంలో ఉన్న ఇద్దరు సెలబ్రిటీలను మరో కంటెస్టెంట్ కించపరుస్తూ మాట్లాడటం షోను కుదిపేసింది. అయితే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కంటెస్టెంట్‌ను హోస్ట్ తీవ్రంగా మందలించి.. నీకు ఇష్టం లేకపోతే షో నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో తీవ్రమైన స్పందన కనిపిస్తున్నది. ఈ అంశంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అత్యంత చర్చనీయాంశమైన ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మలయాళ భాషలో బిగ్‌బాస్ 7వ సీజన్ రంజుగా నడుస్తున్నది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో అధీలా, నూరా అనే ఇద్దరు కంటెస్టెంట్స్ స్వలింగ సంపర్క బంధంలో ఉన్నారు. అయితే అలాంటి వారిని ఇలాంటి షోలోకి ఎలా అనుమతించారు? వారికి ఇలాంటి షోలోకి ఆహ్వానమా? ఇలాంటి రిలేషన్‌షిప్ ఉన్న వ్యక్తులను ఎవరూ కూడా ఇంట్లోకి రానివ్వ కూడదు అని లక్ష్మీ అనే కంటెస్టెంట్ దారుణంగా కామెంట్ చేసింది. అభ్యంతరకరమైన కామెంట్ చేసిన లక్ష్మీపై మోహన్‌లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం రోజున జరిగే వీకెండ్ ఎపిసోడ్‌లో మోహన్ లాల్ తీవ్ర పదజాలంతో లక్ష్మీని మందలించాడు. ఇంట్లోకి ఆహ్వానించకుండా ఉండటానికి అర్హత లేని వారు ఎవరు? అని ప్రశ్నించాడు. దాంతో ఆమె అంతే మొత్తంలో జవాబు ఇవ్వడానికి ప్రయత్నించడంతో ఆమెపై ఫైర్ అయ్యాడు. నేషనల్ ఛానెల్‌లో ఇలాంటి వివక్షను చూపి.. సమాజానికి ఎలాంటి సంకేతాలిస్తున్నావు అనే విధంగా మోహన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధీలా, నూరా నీ సంపాదనపై బతకడం లేదు. వారి జీవనం కోసం వారే ఉద్యోగాలు చేసుకొంటున్నారు. హుందాగా వారు బతుకుతున్నారు. వారి బంధాన్ని సమాజం ఆమోదించింది. మనం కూడా అంగీకరించాం. వారితో నీకు సమస్య ఉంటే.. ఈ షోకు రాకుండా ఉండాల్సింది. ఈ విషయం గురించి నీకు అభ్యంతరం ఉంటే.. ఈ షోలో పాల్గొనకుండా ఉండాల్సింది. ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? అలాంటి వారికి ఈ షోలో స్థానం కల్పించడం నాకు గర్వంగా ఉంది అని మోహన్ లాల్ అన్నారు.
అధీలా, నూరాను నీవు ఆహ్వానించకపోతే.. వారిని నేను నా ఇంటికి పిలుస్తాను. అలాంటి కామెంట్స్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాటలు మాట్లాడాలి. ఈ ఇంటిలో ఉండేందుకు నీకు ఉన్న అర్హత ఏమిటి? వారికి అండగా ఉండటం ఇష్టం లేకపోతే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపో. ఈ షో నుంచి తక్షణమే వెళ్లిపో అంటూ లక్ష్మీకి మోహన్ లాల్ వార్నింగ్ ఇచ్చాడు. హోస్ట్ మోహన్‌లాల్ తీసుకొన్న స్టాండ్.. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఆయన వాదనను సమర్ధిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సమాజంలో లెస్పియన్స్‌కు స్థానం లేదంటూ లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోను, సామాజిక కార్యకర్తల్లోను దుమారం సృష్టించాయి. ఈ సమాజంలో స్వలింగ సంపర్కులకు స్థానం లేదని ఎలా కామెంట్ చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై లక్ష్మీపై విమర్శలు తీవ్రస్థాయిలో కనిపించాయి. మోహన్‌లాల్ తీసుకొన్న నిర్ణయం సమంజసమే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications










