బిగ్‌బాస్ తెలుగులో సరికొత్త చరిత్ర... ఫస్ట్ టైం హౌస్‌కి ఇద్దరు కెప్టెన్లు, ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 ఆరో వారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. గత వారం చివరి రోజున హౌస్‌లోకి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులు ప్రవేశించారు. వీరి రాకతో గేమ్ పూర్తిగా మారిపోయింది. వివాదాస్పద వ్యక్తులు, ఫైర్ బ్రాండ్స్ ఉండటంతో వీరి మధ్య ఆట ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా బిగ్‌బాస్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతివారం లాగే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్‌లకు బిగ్‌బాస్ శ్రీకారం చుట్టగా.. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ జరగని ఘటన హౌస్‌లో జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
6వ వారంలో ఆరుగురు నామినేట్
సోమవారం హౌస్‌లో నామినేషన్ల కార్యక్రమానికి బిగ్‌బాస్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులను మాత్రం నామినేషన్స్ నుంచి మినహాయించాడు. అయితే పాత కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసే పవర్ మాత్రం వీరికే ఇచ్చారు. దాంతో 6వ వారం బిగ్‌బాస్ తెలుగులో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు దివ్య నిఖిత, పవన్ డిమోన్, భరణి శకంర్, రాము రాథోడ్, తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి. వీరిలో ఒకరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఈ వారం హౌస్‌ను వీడనున్నారు.

బిగ్‌బాస్‌లో దివ్వెల మాధురి రూలింగ్
నామినేషన్స్ కార్యక్రమం ముగిసిన తర్వాత పాత కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల మధ్య పరిచయాలు పెంచుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దివ్వెల మాధురి.. బిగ్‌బాస్ రూల్స్ పక్కనపెట్టేసి అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. దాంతో రీతూ చౌదరి ఈ రూల్స్ తప్పుపట్టింది. ఈ విషయంపై హౌస్‌లో గందరగోళం, గొడవలు జరుగుతుండగానే... ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌కు బిగ్‌బాస్ శ్రీకారం చుట్టారు. నామినేషన్స్ చేసే పవర్‌ని ఇచ్చినట్లుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులను నేరుగా కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. అలాగే వీరు పాత ఇంటి సభ్యులలో ఐదుగురిని ఎంచుకుని వారితో గేమ్ ఆడి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కాపాడుకోవాలని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ దారుల దెబ్బ
దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులు కూర్చొని డిస్కష్ చేసుకుని సంజన, భరణి, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, తనూజలని కెప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ చేశారు. దీంతో వారికి బాల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరిని రెండు టీమ్‌లుగా విడదీసి ఫుట్‌బాల్ గ్రౌండ్ రెడీ చేసి ప్రత్యర్ధి టీమ్‌లో గోల్ కొట్టాలని... అప్పుడు ప్రత్యర్ధి టీమ్‌లో ఒకరిని ఎలిమినేట్ చేస్తూ రావాలి.. టాస్ ముగిసేసరికి ఎవరి వైపు ఎక్కువమంది సభ్యులు ఉంటారో వారే రేసులో నిలుస్తారని కండీషన్ చెప్పాడు బిగ్‌బాస్. గేమ్ మొదలవ్వగానే... పాత కంటెస్టెంట్స్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన భరణిని రమ్య అడ్డుకోవడంతో సాయి, గౌరవ్‌లు వరుసగా ప్రత్యర్ధి టీమ్‌లో గోల్స్ చేశారు. చివరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల దెబ్బకి పాత టీమ్‌లో సుమన్ శెట్టి ఒక్కడే మిగిలాడు
బిగ్‌బాస్ తెలుగులో కొత్త చరిత్ర
దాంతో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులు, సుమన్ శెట్టి కలిసి మొత్తం ఆరుగురు కెప్టెన్సీ రేసులో మిగిలారు. వీరికి బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చి ఈ వారం కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయనున్నాడు. అయితే బిగ్‌బాస్ లైవ్‌లో ఇప్పటికే కెప్టెన్సీ టాస్క్ పూర్తవ్వగా.. 6వ వారానికి గాను సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలు కెప్టెన్లుగా గెలిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే హౌస్‌కి ఇద్దరు కెప్టెన్లు లేరు. ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక టఫ్ ఫైట్‌లో కెప్టెన్‌గా గెలిచిన సుమన్ శెట్టి... తాను నీతిగా, నిజాయితీతో పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేశాడు.


Click it and Unblock the Notifications











