Gunde Ninda Gudi Gantalu September 4th: అల్లుడి పెత్తనం చూపించిన సంజూ.. ఆడుకున్న బాలు, మీనా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక సెప్టెంబర్ 3వ తేదీ 502వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాల పెళ్లి రోజు ఉండటంతో ఇంట్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఎలాంటి ఏర్పాట్లు చేద్దామని అంతా చర్చించుకుంటూ ఉంటారు. ఇక వీరి పెళ్లి రోజుకు పెద్దగా ఏర్పాట్లు ఎందుకని ప్రభావతి అంటుంది. కానీ సత్యం, రవి, శృతి మాత్రం బాలు మీనాల పెళ్లికి మంచి ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఊర్లో నుంచి సుశీలమ్మ కూడా వచ్చి బాలు, మీనాల పెళ్లి రోజును ఘనంగా నిర్వహించాలని చెబుతుంది.
మరోవైపు బాలు మీనాల పెళ్లి రోజు ఉండటంతో మీనా వాళ్ల కన్న తళ్లి కూడా వాళ్ల ఇంటికి రమ్మని చెప్పడానికి వస్తుంది. ఈ సందర్భంగా మీనా వాళ్ల అమ్మ పార్వతిని అత్త ప్రభావతి నానా మాటలు అంటుంది. సూటి పోటు మాటలతో అవమానిస్తుంది. అయినా కూడా పార్వతమ్మ ఏమీ అనదు. ఇక మీనా మాత్రం తన తల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రభావతి మాటలకు తిరిగి కౌంటర్ ఇస్తుంది. దెబ్బకు ప్రభావతి నోరు మూసుకుంటుంది.

మీనా, బాలుల మొదటి పెళ్లి రోజు కావడంతో అందరికీ ఆహ్వానాలు వెళ్తుంటాయి. బాలు చెల్లెలు మౌనిక కూడా ఆహ్వానం అందగా.. ఆమె అత్తగారు సువర్ణ ఖచ్చితంగా పంపిస్తామని చెబుతుంది. అలా ఎందుకు ఒప్పుకున్నారు అత్తయ్య.. మా ఇంటికి రావడం మీ అబ్బాయికి ఇష్టం లేదని, ఆయన అక్కడికి వచ్చినా మా బాలు అన్నయ్యతో గొడవ పడతాడని అంటుంది మౌనిక. వాడు మిమ్మల్ని ఎంత బాధపెట్టాలని చూసినా నీ సహనమే గెలుస్తూ వస్తోందని, ఒకడికి చెడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా ఓడిపోతాడని.. నువ్వు ఫంక్షన్‌కి వెళ్లి మీ వాళ్లతో ఎంత సంతోషంగా ఉండాలో ఆలోచించు అని అంటుంది సువర్ణ. ఇంతలో సంజూ వచ్చి ఎవరికి సంతోషం, ఎందుకు సంతోషం అని అడుగుతాడు.
రేపు మీనా, బాలుల పెళ్లిరోజని మీ ఇద్దరినీ ఫంక్షన్‌కు రమ్మని పిలిచారని చెబుతుంది సువర్ణ. మనం వెళ్లి ఫంక్షన్‌లో పాటలు పాడి, డ్యాన్స్‌లు చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి రావాలని ఫీల్ అవుతున్నావు కదా అని మండిపడతాడు సంజూ. నువ్వు పిలవగానే తోక ఊపుకుంటూ రావాలా? వాళ్లు అసలు మనిషులేనా? నాకు ఫోన్ చేసి అల్లుడుగారు ఇది సంగతి, అమ్మాయిని తీసుకుని ఇంటికి రండి అనేది అసలైన మర్యాద అని అంటాడు. వాళ్లు ముందు నీకే ఫోన్ చేశారని నీ ఫోన్ కలవకపోవడంతో నాకు ఫోన్ చేశారని చెబుతుంది తల్లి. వాళ్లు ఎంతో మంచివాళ్లు కాబట్టే 16 రోజుల ఫంక్షన్ నాడు నువ్వు ఏం చేసినా వాళ్లు గౌరవంగానే ప్రవర్తించారని అంటుంది.
నువ్వు ఒక్కరోజైనా వాళ్లింట్లో ఉంటనే కదా, వాళ్ల మర్యాదలు ఎలా ఉంటాయో తెలిసేది.. కాళ్లు కడుక్కుని ఆ తడి ఆరిపోయేలోపు కాళ్లకి చక్రాలు కట్టుకుని తిరిగి వచ్చేస్తావని మండిపడుతుంది సువర్ణ. మనం ఎక్కడికి వెళ్లొద్దని, రావడం కుదరదని చెప్పేస్తానని అంటుంది మౌనిక. వాడు రాకపోతే ఏంటీ? నువ్వు వెళ్లు అని చెబుతుంది సువర్ణ. ఇది ఒక్కటే వెళ్లకూడదు..ఇది ఏడవాలి, ఆ బాలుగాడి పెళ్లిలో సంతోషాలు పోయి ఏడుపులు మిగలాలి అని అనుకుంటాడు సంజూ. మీ వాళ్లేదో గొప్పగా మర్యాదలు చేస్తారని అంటున్నారు కదా.. అవి ఎలా ఉంటాయో చూస్తానని అంటాడు సంజూ.
సుశీల, సత్యం, శృతి, రవిలు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ప్రభావతి వస్తుంది దాంతో ముగ్గురు సైలెంట్ అయిపోతారు. నన్ను చూడగానే ఎందుకు ఆగిపోయారని ప్రభావతి అడగ్గా.. నిన్ను చూస్తే నాకేం భయం, డైరెక్ట్‌గానే తిడతామని అంటుంది సుశీల. ఇంతలో మనోజ్ వచ్చి వీళ్లు ఇంత సైలెంట్‌గా మాట్లాడుకుంటున్నారు, నా గురించేనా అని తల్లిని అడుగుతాడు. ఇంతలో బాలూ వచ్చి కనీసం నాకైనా చెబుతావా అని అడగ్గా నీకేం చెప్పమని అంటుంది శృతి. ఇది ఏడ్చేవాళ్లకి, ఏడిపించేవాళ్లకి సర్‌ప్రైజ్ అని అంటాడు రవి. మనం ఇలాగే గుసగుసలు మాట్లాడితే మా ఆవిడ కడుపు బెలూన్‌లా పేలిపోతుందని అంటాడు సత్యం. బాలుగాడి పెళ్లిరోజుని గ్రాండ్‌గా చేయాలని ఖర్చు సంగతి నేను చూసుకుంటానని అంటుంది సుశీల.
మౌనికను తీసుకుని సంజూ.. బాలు ఇంటికి వస్తాడు. నువ్వు మీ వాళ్లను చూసుకుని ఆనందంగా ఉంటే పర్మినెంట్‌గా ఇక్కడే ఉంచేస్తానని వార్నింగ్ ఇస్తాడు. మౌనికను చూడగానే ఇంటిల్లిపాది ఆనందిస్తారు. అందరూ సంతోషంగా ఉండటంతో సంజూ రగిలిపోతాడు. ఆపండి అంటూ గట్టిగా అరిచిన సంజూ.. మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చానని గేటు దగ్గర వాచ్‌మెన్‌లా నిలబడ్డానని అంటాడు. ఇంతలో బాలు.. బావని డోర్ ముందు వాచ్‌మెన్‌లా నిలబెట్టామా చూసుకోలేదని సెటైర్లు వేస్తాడు. ప్రభావతి లోపలికి రమ్మని పిలవగా.. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ అమ్మాయిని పంపించండి, నేను ఇలాగే నిలబడతానని మండిపడతాడు సంజూ.
మీరు ఏం మాట్లాడినా మీకు ఎదురు చెప్పొద్దని మా అమ్మ వార్నింగ్ ఇచ్చిందని అంటాడు బాలు. అంటే గుమ్మం దగ్గరే ఉండిపోమంటారా? అంటాడు సంజూ. గొడవ పెద్దది అయ్యేలా ఉందని గ్రహించిన సత్యం.. అల్లుడికి నచ్చజెప్పి లోపలికి తీసుకొస్తాడు. సంజూ లోపలికి రాగానే అబ్బాయికి మంచినీళ్లు ఇవ్వమని మీనాకి ఆర్డర్స్ వేస్తుంది ప్రభావతి. కానీ మీనా మాత్రం సైలెంట్‌గా ఉండటంతో రగిలిపోతుంది. అల్లుడుగారికి మర్యాదలు తగ్గిపోయాయని అంటున్నారు.. మీ అల్లుడుగారికి మీరే మర్యాదలు చేసుకోమని అంటుంది శృతి. నేనే చేసుకుంటాను, అంత గొప్పింటి అబ్బాయి మనింటికి రావడమే గొప్ప కదా అని అంటుంది ప్రభావతి.
అల్లుడుగారికి వెళ్లి కాళ్లు కడగమని మనోజ్‌తో అంటాడు బాలు. ఏం అవసరం లేదు నా కాళ్లు నేనే కడుక్కోగలనని, కనీసం కాఫీ, టీలైనా ఇస్తారా అని అడుగుతాడు సంజూ. ఆ మాటలతో ప్రభావతి.. మీనాకి సైగలు చేస్తుంది. ఇప్పుడే గొప్పింటి అబ్బాయి రావడం గొప్ప అని అన్నారు కదా.. వెళ్లి కాఫీ తీసుకురండి అని అంటుంది మీనా రివర్స్‌లో చెబుతుంది. మీ కోడళ్లికి నేను రావడం ఇష్టం లేదా? మీ వదినకు నాకు కాఫీ ఇవ్వడం కూడా ఇష్టం లేదా అని మౌనికను నిలదీస్తాడు సంజూ. ఎవరు చెబుతున్నా వినిపించుకోకుండా.. మీనాకు సత్యం నచ్చజెప్పి కాఫీ తీసుకురమ్మని అంటాడు.
మీనా కాఫీ తీసుకుని రాగానే సంజూ కాలు మీద కాలు వేసుకుని ఫోజులు కొడతాడు. మందు తాగి కారు నడిపితే పోలీసులు సీజ్ చేశారట అని సెటైర్లు వేస్తాడు సంజూ. దానికి సమాధానంగా మళ్లీ వీడియో తీసి అదే మీడియాలో పెట్టాను చూడలేదా అని అడుగుతాడు బాలు. అదంతా ఎవరో దొంగ వెదవ, మా ఆయన చేతుల్లో దెబ్బలు తిన్న సన్నాసి చేశాడని అంటుంది మీనా. వాడి పేరు నాకు తెలియడం లేదు కానీ, వడ్డీలకు డబ్బులు తిప్పుతాడు.. జైళ్లో చిప్పకూడు తింటున్నాడు, మా ఆయన జోలికి రాడని మీనా సెటైర్లు వస్తుంది. ఆ వెంటనే బాలుని తీసుకుని మీనా కిచెన్‌లోకి తీసుకెళ్తుంది. హాల్‌లో అంతమంది ఉంటే.. మనం కిచెన్‌లో ఉండటం బాగోదని అంటాడు బాలు.
వాడు మిమ్మల్ని కావాలనే రెచ్చగొడుతున్నాడని, మీరు కొంచెం వాడికి దూరంగా ఉండమని చెబుతుంది. నాకు కోపం ఎక్కువ, నీకు ఓపిక ఎక్కువ, వాడికి నోటి దురుసు ఎక్కువ, నా చేతికి స్పీడు ఎక్కువ అని అంటాడు బాలు. వాడు పెళ్లిలో జరిగింది మనసులో పెట్టుకుని అలా ప్రవర్తిస్తున్నాడని, మీరు సైలెంట్‌గా ఉండమని నచ్చచెబుతుంది మీనా. ఇంతలో ప్రభావతి వచ్చి ఆ నోరు కంట్రోల్‌లో ఉంటే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవని అంటుంది. వాళ్లు వెళ్లే వరకు ఏ గొడవ చేయొద్దని చెబుతుంది ప్రభావతి. అలాగే సంజూకి మంచి స్పెషల్స్ చేయమని మీనా చేతుల్లో పెద్ద లిస్ట్ పెడుతుంది. ఇంట్లో ఏ గొడవ జరుగుతుందోనని టెన్షన్‌గా ఉందని మీనా చెప్పగా.. ఏం కాదని మాటిస్తాడు బాలు.
తన బిజినెస్ గురించి సంజూకి చెబుతాడు మనోజ్. ఇంటికొచ్చిన అల్లుడికి కాఫీ మాత్రమే ఇస్తారా అని మండిపడతాడు సంజూ. మా మర్యాదలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారని అంటాడు బాలు. సంజూ వెనకాలే మనోజ్ తిరుగుతుండటంతో నువ్వేం కడిగినా రూపాయి కూడా ఇవ్వడని బాలు అంటాడు. ఇదంతా చూస్తోన్న రోహిణి రగిలిపోతుంది. సంజూ - మౌనికలకు ఎవరి బెడ్‌రూం ఇద్దామని అడుగుతాడు సత్యం. నీ గది బాగుంటుందని మనోజ్‌తో ప్రభావతి అనగా.. ఆయనకి ఆ గదిలో తప్పించి ఎక్కడా నిద్రపట్టదని అంటుంది రోహిణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










