Gunde Ninda Gudi Gantalu September 24th: రోహిణి కొడుక్కి యాక్సిడెంట్.. బాలు, మీనాలకి దొరికిపోయిన పార్లరమ్మ
Photo Courtesy: JioHotstar
సత్యం దగ్గర బాలు, మనోజ్‌లు పడుకుంటారు. బాలు తెల్లార్లు కథలు చెబుతూ ఉండటంతో మనోజ్‌కి నిద్రపట్టదు. అటు ప్రభావతి, మీనా, రోహిణిలు ఒక గదిలో పడుకుంటారు. ఆ పూలు అమ్మేదానిని నా పక్కన పడుకోనివ్వనని ప్రభావతి అనడంతో మీనా బాధపడుతుంది. ఆ తర్వాత ప్రభావతి గురకల దెబ్బకి రోహిణికి నిద్రపట్టక హాల్‌లోకి వెళ్తుంది. అక్కడ అప్పటికే సోఫాలో నిద్రపోతున్న మనోజ్‌ను లేపుతుంది. ఇద్దరూ కలిసి ఏం జరిగిందో కనుక్కుంటారు. ఉదయాన్నే మీనా ఆలస్యంగా మేల్కొనడంతో ప్రభావతి రగిలిపోతుంది. వంట చేయకుండా ఇంతసేపు పడుకుంటావా? అంటూ గొడవకు దిగుతుంది ప్రభావతి.
నాకు ఆరోగ్యం బాలేదని.. అయినా రోజూ నేనే వంట చేయాలా? అని మీనా నిలదీస్తుంది. మనోజ్ - రోహిణి, శృతి - రవిలు బయట టిఫిన్ చేస్తామని వెళ్లిపోతారు. మీనాని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకుని వస్తుండగా రోహిణి కొడుకు చింటూకి యాక్సిడెంట్ అవ్వడంతో అతని అమ్మమ్మ ఆసుపత్రికి తీసుకొస్తుంది. ఏం జరిగిందని బాలు- మీనా అడగ్గా ఓ బైక్ మీద వచ్చిన వ్యక్తి గుద్ది వెళ్లిపోయాడని చెబుతుంది చింటూ అమ్మమ్మ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 24వ తేదీ, 517వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
చింటూకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని రోహిణికి చెప్పాలని అనుకుంటుంది ఆమె తల్లి. కానీ పక్కనే బాలు, మీనాలు ఉండటంతో ఆమె టెన్షన్ పడుతుంది. ఫర్నిచర్ షాపులో పడుకున్న మనోజ్.. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వచ్చే ఐడియా చెప్పమని రోహిణిని అడుగుతాడు. తక్కువ రకం క్వాలిటీ దానికి పాలిష్ చేసి మంచి క్వాలిటీది అని అమ్మేద్దామని మనోజ్ చెప్పడంతో రోహిణి మండిపడుతుంది. కస్టమర్ల ముఖాలు చూసి మాట్లాడొద్దని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతుంది. ఇంతలో రోహిణికి తన తల్లి ఫోన్ చేయడంతో ఆ విషయాన్ని చెబుతాడు మనోజ్.
అమ్మ ఫోన్ చేయడంతో రోహిణి షాక్ అవుతుది. నీకెన్ని సార్లు చెప్పాలి? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ ఎందుకు చేస్తున్నావని మండిపడుతుంది. అర్జెంట్‌గా చేయాల్సి వచ్చింది.. అందుకే చేశానని తల్లి చెబుతుంది. దీంతో ఏం కొంపలు మునిగాయని అడుగుతుంది రోహిణి. నీ కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడని తల్లి చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది. వాడు ఇంటి ముండు ఆడుకుంటుంటే ఎవరో బండి మీద వస్తూ యాక్సిడెంట్ చేశాడని చెప్పడంతో రోహిణి ఉలిక్కిపడుతుంది. కంటికి దెబ్బ తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించానని చెబుతుంది తల్లి.
అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పు , నేను వెంటనే బయల్దేరి వస్తానని చెబుతుంది రోహిణి. తొందరపడి రావొద్దని.. బాలు, మీనా ఇక్కడే ఉన్నారని తల్లి చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది. బాలు వెళ్లాక ఫోన్ చేస్తానని, పిల్లాడు స్పృహలో లేడని నాకు భయంగా ఉండని అంటుంది తల్లి. ఆమె ఫోన్ పెట్టగానే బాలు వెనకాలే ఉండటంతో ఆమె షాక్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావని బాలు అడగ్గా.. మా ఊరి డాక్టర్‌తో అని అబద్ధం చెబుతుంది రోహిణి తల్లి.
చింటూకి యాక్సిడెంట్ జరగడంతో పిల్లాడి పరిస్ధితి తలచుకుంటూ కుప్పకూలిపోతుంది రోహిణి. నేను తల్లిగా వాడికేం చేయలేకపోయాను, నేను తల్లిగా ఇలాంటి సమయంలోనైనా పక్కనే ఉండాలని బాధపడుతుంది. ఎలాగైనా పిల్లాడి దగ్గరికి వెళ్లాలని అనుకున్న రోహిణి.. వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్లి ఈ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు కేటల్స్ ఫ్రీగా వస్తే స్టాఫ్‌కి మన షాప్ గురించి తెలుస్తుందని చెబుతుంది. నేను ఆసుపత్రికి వెళ్లి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాల్సి వస్తానని చెబుతుంది రోహిణి. దాంతో ఎంతో సంతోషించిన మనోజ్.. ఆమెకు షాప్ కార్డ్ కూడా ఇచ్చి పంపిస్తాడు.
చింటూ ఆరోగ్యం గురించి వాడి అమ్మమ్మ టెన్షన్ పడుతుంది. చిన్న వయసులోనే వాడు కన్నవాళ్లకి దూరమయ్యాడని, ఇప్పుడు వాడికి ఏమైనా అయితే తట్టుకోలేనని చెబుతుంది. దాంతో మీనా ఆమెను ఓదారుస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి బాబు బాగున్నాడని, రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో చింటూ అమ్మమ్మ, బాలు, మీనాలు ఊపిరి పీల్చుకుంటారు. మీరిద్దరూ తోడుగా లేకపోవడంతో ఒక్కదాన్నే ఉక్కిరిబిక్కిరి అయ్యేదానిని అని రోహిణి తల్లి బాధపడుతుంది. నేను సమస్యల్లో ఉన్న ప్రతిసారి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడని, నీకు ఒంట్లో బాలేకపోయినా ఓపిక చేసుకుని ఉన్నావని మీనాకి థ్యాంక్స్ చెబుతుంది రోహిణి తల్లి.
బాబును నేను చూసుకుంటానని, ఇక మీరిద్దరూ వెళ్లండి అని ఆమె చెప్పగా.. డిశ్చార్జ్ గురించి కనుక్కున్నాక వెళ్తామని బాలు అంటాడు. బాలు, మీనాలు ఇప్పట్లో వెళ్లేలా లేకపోవడంతో రోహిణి తల్లి షాక్ అవుతుంది. ఆసుపత్రి మేనేజర్‌ను రోహిణి కలిసి తమ ఫర్నిచర్ షాపు గురించి చెప్పి వాటర్ కెటిల్స్ ఫ్రీగా ఇస్తానని చెబుతుంది. దానికి మేనేజర్ అనుమతి ఇవ్వడంతో చిల్డ్రన్ వార్డ్ వైపు వేగంగా వెళ్తుంది రోహిణి. ఆమెను బాలు, మీనాలు చూసి షాక్ అవుతారు. ఆసుపత్రిలో ఫ్రీ కెటిల్స్ ఇవ్వడానికి వచ్చానని రోహిణి చెప్పడంతో ఇలా చేస్తే మీ షాపు తొందరలోనే మూసేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు బాలు.
మీరు పిల్లల వార్డ్ నుంచి వస్తున్నారేంటీ? అని రోహిణి అడుగుతుంది. మాకు తెలిసిన బాబుకి దెబ్బ తగిలితే చూడటానికి వచ్చామని చెబుతుంది మనోజ్. ఆ మాటలు విన్న రోహిణి.. ఆ బాబుకి ఎలా ఉందని కంగారు పడుతుంది. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావ్ పార్లరమ్మ అని బాలు అడగటంతో రోహిణికి టెన్షన్ పెరిగిపోతుంది. దాంతో రోహిణి తల్లి గురించి మీనా గుర్తుచేస్తుంది. నీ ఫర్నిచర్ షాప్‌తో పాటు నా కారు గురించి కూడా స్టిక్కర్ అతికించమని రోహిణికి చెబుతాడు బాలు.
చింటూని ఆసుపత్రి బెడ్‌పై చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది రోహిణి. నీకు మంచి తల్లిని కాలేకపోయానని, కళ్లు తెరిచి నన్ను చూడమని అంటుంది. నిన్ను నమ్మి నీ దగ్గర వదిలేస్తే.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా? అని తల్లిపై మండిపడుతుంది రోహిణి. పిల్లాడిని ఎన్ని రోజులని ఇంట్లో బంధించను, వాడికి కూడా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుందని చెబుతుంది రోహిణి తల్లి. కాస్తలో తప్పిపోయిందని, లేదంటే కన్నే పోయేదని.. నా బంగారు తండ్రికి ఎన్ని కష్టాలోనని బాధపడుతుంది రోహిణి. రెండ్రోజుల్లో కట్లు విప్పేస్తామని డాక్టర్ గారు చెప్పారని అంటుంది తల్లి.
ఇన్నాళ్లు నా భర్త, నా కాపురం అంటూ నా జీవితం కాపాడుకోవడానికి ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నానని.. ఒక్కోటి దాటేసి ఒడ్డుకు చేరుకుంటున్నానని, ఇంతలోనే చింటూకి ఇలా అయ్యిందని బాధపడుతుంది రోహిణి. నా కొడుకుతో అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నానని, చింటూ గుర్తొస్తే గుండెల్లో సూదులతో గుచ్చినట్లుగా ఉంటోందని అంటుంది. బాలు, మీనాలు ఇప్పటిదాకా నాతోనే ఉండి ధైర్యం చెప్పారని.. చింటూని వాళ్లిద్దరూ చాలా ప్రేమగా చూసుకుంటారని చెబుతుంది. కానీ వాళ్లకి ఎక్కడ నిజం తెలుస్తుందోనని భయంగా ఉందని.. బాలుకి దేనిమీదైనా అనుమానం వస్తే దాని అంతు చూసేదాకా వదిలిపెట్టడని భయపడుతుంది రోహిణి.
ఇంతకుముందులా అన్ని పనులు చేసుకోలేకపోతున్నానని, ఏ పని చేసినా అయాసం వస్తోందని.. నాకు ఏదైనా అయితే నీ కొడుకు అనాథ అయిపోతాడని తల్లి చెప్పడంతో రోహిణి బాధపడుతుంది. నువ్వే వీలైనంత త్వరగా వీడి గురించి బయటపెట్టమని తల్లి అడుగుతుంది. ఇంకా ఎన్నాళ్లు ఈ నిజం దాచాలో అర్ధం కావడం లేదని, బాలు మళ్లీ వస్తే చాలా ప్రమాదమని రోహిణి వెళ్తానని చెబుతుంది. మీనా కోసం బాలు టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. నాకు వెళ్లడానికి మనసు రావడం లేదని, చింటూకి అలా ఉంటే బాబుని పెద్దావిడ ఎలా చూసుకుంటుందోనని బాధగా ఉందని అంటుంది మీనా. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుని వస్తానని బాలు లోపలికి వెళ్తుండగా రోహిణి ఎదురవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










