Gunde Ninda Gudi Gantalu October 15th Episode: మరోసారి చిక్కుల్లో పడ్డ రోహిణీ.. మనోజ్ షాప్ లో బాలు రచ్చ..
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్‌లో భారతనాట్యం గురువుగా పేరు తెచ్చుకోవాలని, అందరికంటే తానే ఎక్కువ సంపాదించాలనే ఆశతో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది. కానీ ఆమె స్కూల్‌లో ఎవ్వరూ చేరకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. ఈ నిరాశే కోపంగా మారి కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతుంది. మీనాపై కూడా మాటల దాడి చేయడంతో సత్యం ఆమెకు అండగా నిలుస్తాడు. ఇదంతా చూసి బాలు బాధపడతాడు. తల్లి మనస్థితి చూసిన బాలు, "నా దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉంది" అంటూ మీనాతో కలసి తరువాత రోజు స్కూల్‌కి వస్తాడు. పండ్లు, పూలతో వచ్చిన వారిని చూసి ప్రభావతి షాక్ అవుతుంది. "మేము డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాం" అని మొదట నిరాకరిస్తుంది. కానీ, మీనాక్షి ఒప్పించడం, ఫీజు తీసుకున్న రావడంతో వారికి డ్యాన్స్ నేర్పించడానికి ఒప్పుకుంటుంది.
నటరాజ స్వామికి ప్రార్థనతో డాన్స్ క్లాస్ మొదలవుతుంది. అత్త-కోడలు పోటీపడుతూ నాట్యం మొదలుపెడతారు. ఉత్సాహంతో నాట్యం చేసిన ప్రభావతి ఒక్కసారిగా "అయ్యో నా మెడ!" అంటూ కేక వేస్తుంది. పరిస్థితి సీరియస్‌గా మారడంతో బాలు, మీనా ఆమెను ఇంటికి తీసుకువెళ్తారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే శ్రుతి పొరపాటున హాయ్ చెప్పడంతో ప్రభావతి కిందపడిపోతుంది. ప్రభావతి పరిస్థితి చూసి సత్యం ఆగ్రహంతో "ఈ వయసులో ఇలాంటి ప్రయోగాలేమిటి?" అంటూ మందలిస్తాడు. మీనాక్షి తెచ్చిన ఆయుర్వేద వైద్యురాలు చికిత్స చేసినా, ప్రభావతి ఇంకా అస్వస్థంగానే ఉంటుంది. ఈ గందరగోళం మధ్య బాలు తన తల్లి బాధ చూసి "నీ వల్లే మా అమ్మ ఇలా అయింది" అంటూ మీనాపై ఆవేశంగా ప్రవర్తిస్తాడు. దీంతో మరోసారి ప్రభావతి కుటుంబంలో ఉద్రిక్తత చెలరేగుతుంది. ఇక బుధవారం (అక్టోబర్ 15 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

మనోజ్ తన షాపుకి కస్టమర్లు రాకపోవడం, వచ్చిన వారిని కూడా సేల్స్ బాయ్స్ సరిగా పట్టించుకోకపోవడం అతనికి చిరాకు తెప్పిస్తుంది. "ఏమండీ, షాప్‌లో కస్టమర్లు ఉన్నా మీరు గేమ్స్ ఆడుతున్నారా? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అమ్మకాలు ఎలా పెరుగుతాయి?" అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత వారి లుక్ మీద కూడా కామెంట్లు చేస్తూ, "ఈ డ్రెస్ సెన్స్ చూసి ఎవరు వస్తారు షాప్‌కి? సేల్స్ బాయ్స్ అంటే ప్రెజెంటేషన్ ఉండాలి!" అని మందలిస్తాడు. తన స్టైల్లోనే సొల్యూషన్ కూడా ఇస్తాడు. "ఇకపై మీ అందరికీ నేను ఐరన్ బాక్స్ ఇస్తా. మీరు డైలీ నీట్ డ్రెస్సింగ్ తో కనిపించాలని చెబుతాడు. ప్రీగా ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి.. తర్వాత నెల సాలరీ నుండి కట్ చేస్తా," అని చెబుతాడు. ఒక్కసారిగా షాప్ కీపర్స్ షాక్ అయిపోతారు. ఈ సీన్ మొత్తాన్ని గమనించిన రోహిణి కూడా ఆశ్చర్యపోతుంది. "ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ అవసరమా మనోజ్? బిజినెస్ అంటే కస్టమర్ సర్వీస్, డ్రెస్ కాదు," అని మందలిస్తుంది.
అంతలో విద్య షాప్‌కు చేరుతుంది. వచ్చి రాగానే మనోజ్‌తో జోకులుగా మొదలుపెట్టి, ఇద్దరి మధ్య చమత్కారాలు చెలరేగుతాయి. "నీ ఫర్నిచర్‌లా నీ ఐడియాలు కూడా సాలిడ్‌గా ఉంటాయ్ గానీ.. కస్టమర్లు కాస్త తక్కువే," అంటూ విద్య సెటైర్ వేస్తుంది. కానీ ఆ సరదా మాటల్లోనే టాపిక్ కాస్త సీరియస్ అవుతుంది. మనోజ్ వాదన మొదలవడంతో రోహిణి జోక్యం చేసుకుని, "డీలర్స్ తో మాట్లాడు " అంటూ బయటికి పంపిస్తుంది. మనోజ్ వెళ్లగానే విద్య.. రోహిణికి ఓ దేవుడి పటాన్ని గిఫ్ట్‌గా ఇస్తుంది. "రోజూ దీన్ని పూజ చేస్తే ధనాకర్షణ వస్తుంది," అని చెబుతుంది. దానికి రోహిణి నవ్వుతూ, "పూజ చేయడం అంటే నాకు చాలా బద్ధకం. ఇంట్లో కూడా నేను చెయ్యను, మీనా మాత్రమే చేస్తుంది," అంటుంది. వెంటనే విద్య స్పందిస్తూ "అయితే పూలు తీసుకుని మీనాను రమ్మంటే చాలు.. మీనా వచ్చి పూజ చేస్తుంది కదా!" అని సలహా ఇస్తుంది. రోహిణి వెంటనే మీనాకు ఫోన్ చేసి, "పూలు తీసుకురా షాప్‌కి," అని చెబుతుంది.
ఇదిలా ఉండగా మీనా పూలు తీసుకుని వస్తున్న క్రమంలో దారిలో "మటన్ మాణిక్యం" అలియాస్ "మలేషియా మామయ్య" కనిపిస్తాడు. మీనా అతడిని పిలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మలేషియా మామయ్య తనని పట్టుకుంటే అసలు విషయం బయటపడిపోతుందనే భయంతో బైక్ ఎక్కి పారిపోతాడు. మీనా మాత్రం, "ఎందుకు తప్పించుకుంటున్నాడు? ఏదో ఉంది!" అనుకుంటూ అతని వెంటపడుతుంది. మాణిక్యం బైక్ వేగం పెంచి తప్పించుకుంటాడు. అలా తప్పించుకుని చివరికి రోహిణి షాప్‌కు చేరుకుంటాడు మలేషియా మామయ్య. అతడిని చూసిన రోహిణి, విద్య ఇద్దరూ షాక్ అవుతారు. "ఏమిటి ఇలా వస్తున్నావ్? ఎందుకు ఇంత కంగారు?" అని అడుగుతారు.
" తనని మీనా నన్ను వెంబడిస్తోంది.. అందుకే దాక్కోవడానికి ఇక్కడికి వచ్చా," అని సమాధానం ఇస్తాడు మాణిక్యం. "మీనా కూడా ఇక్కడే వస్తుంది. మాణిక్యంను చూస్తే.. తన బాగోతం బయటపడిపోతుంది," అని రోహిణి ఆందోళన వ్యక్తం చేస్తుంది. మాటల్లో మీనా షాప్‌కు చేరుకుంటుంది. విద్య వెంటనే మాణిక్యాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఓ బీరువాలో పెట్టి తాళం వేస్తుంది. మీనా పూలు ఇస్తూ, "ఈరోజు మంచి రోజు.. ఈరోజే పూజ చేద్దాం," అని చెబుతుంది. రోహిణి కూడా అంగీకరిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత మీనా చెబుతుంది "నేను వస్తున్నప్పుడు మలేషియా మామయ్యను చూశాను!" అని చెబుతుంది.
వెంటేనే రోహిణి "ఏమిటి మీనా, మా మామయ్య మలేషియాలో ఉన్నాడు. నువ్వు ఎవరో చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటావ్," అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీనా నమ్మకంగా, "లేదు.. నేనే చూశా.. ఆయనే," అంటుంది. రోహిణి వెంటనే టాపిక్ మార్చి, "అతను ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నాడు అనుకుంటా," అంటూ ఆ టాపిక్ మార్చేస్తుంది. ఇంతలో బాలు తన ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి మనోజ్ షాప్‌కు వస్తాడు. "ఓ బీరువా కొనాలి," అంటాడు. మనోజ్ వారిని చూసి వెటకారంగా, "కొనడానికి వచ్చారా? లేక ఏసీలో కూల్ అవ్వడానికి వచ్చారా?" అని అంటాడు. దానికి రాజేష్ చురుకైన రిప్లై ఇస్తూ, "కొనడానికి వచ్చాం.. ఏసీ కావాలంటే మా కారులో కూడా ఉంది," అంటాడు.
మనోజ్ "సరే సరే, ఏ బీరువా కావాలో సెలెక్ట్ చేసుకోండి," అంటాడు. రాజేష్ ఆ గ్రీన్ కలర్ బీరువా చూపిస్తూ, "ఇది నచ్చింది.. ఇదే కావాలి," అంటాడు. కానీ ఆ బీరువాలో మాణిక్యం దాక్కున్నాడు. ఆ విషయాన్ని విద్య వెంటనే రోహిణికి మెల్లగా చెబుతుంది. "అది తీసుకుంటే అంతే, మనం దొరికిపోతాం.". దీంతో రోహిణి కంగారుగా, "ఆ బీరువా అమ్ముడు అయిపోయింది, వేరే ఒకటి తీసుకోండి," అంటుంది. కానీ రాజేష్ మొండిగా, "నాకు ఆ గ్రీన్ కలర్ బీరువానే కావాలి," అంటాడు. రోహిణి కంగారుగా "విద్య ఇప్పటికే దానికి పేమెంట్ ఇచ్చింది," అని సాకులు చెబుతుంది.
దీంతో బాలు కోపంతో "ఏంటి ఇలాగంటావ్? కస్టమర్‌ని ఇలా అవమానిస్తారా?" అంటూ షాప్‌లో ఉన్న ఫర్నిచర్ కింద పడేస్తాడు. "నీ షాప్ వద్దు.. నీ బీరువా వద్దు " అంటూ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. మనోజ్ కూడా విసిగిపోయి రోహిణి దగ్గరకి వెళ్లి, "ఒక సేల్ మిస్ అయింది " అంటాడు. రోహిణి కూడా ఆగ్రహంగా, "డీలర్‌తో మాట్లాడి స్టాక్ తెప్పించమని చెప్తా.. నీ వల్ల బిజినెస్ దెబ్బతింటుంది!" అంటుంది. దీంతో మనోజ్ నిరాశగా షాప్ నుండి బయలుదేరిపోతాడు. అందరూ వెళ్లిపోయాక విద్య తాళం తీసి బీరువా ఓపెన్ చేస్తుంది. లోపల గాలి లేక మాణిక్యం ఉక్కిరిబిక్కిరి అవుతాడు. 'చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు'గా మారుతుంది. కాస్తా తేరుకున్న తరువాత మాణిక్యం కోపంతో "నాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పింది అబద్ధం కదా!" అంటూ నిలదీస్తాడు.
రోహిణి మాటలు తడబడతాయి. మాణిక్యం సీరియస్‌గా, "మీ ఊరికి వచ్చాక నాకు అన్నీ అర్థమయ్యాయి. మీరు ఏదో చిక్కులో ఉన్నారు, అందుకే నేను మలేషియా మామయ్యగా నటించాను. కానీ ప్రతి సారి ఇలాగే తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఒకరోజు మాత్రం దొరికిపోతారు," అని హెచ్చరిస్తాడు. రోహిణి వేడుకుంటూ, "ఈ విషయం ఎవరికి చెప్పవద్దు," అంటుంది. మాణిక్యం, "నేను అలాంటివాడు కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య వస్తే, నాకు చెప్పండి. నేను అండగా ఉంటా," అని మాట ఇస్తాడు. చివరగా, "ఒక కళాకారుని నమ్మకంతో ఇలా ఆడుకోవడం తగదు. అవకాశం పేరుతో అబద్ధాలు చెప్పకండి. ఆ అబద్ధాలలో మీరు బ్రతికేస్తారేమో కానీ, మనలాంటి వాళ్లు చస్తారు," అంటూ ఎమోషనల్ అవుతాడు మటన్ మాణిక్యం.
ఇక ఇంటికి వచ్చిన మీనా మాత్రం మటన్ మాణిక్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. "ఎందుకు తప్పించుకున్నాడు? మలేషియాలో ఉన్నాడంటే రాజమండ్రిలో ఎలా ఉన్నాడు?" అని తనలోతానే ఆలోచించికుంటుంది. బాలు ఎంత మాట్లాడినా ఆమె స్పందించదు. కంగారుగా, ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











