Gunde Ninda Gudi Gantalu October 22th Episode: మీనా ఉగ్రరూపం.. దినేష్ గ్యాంగ్‌పై దాడి.. బయటపడ్డ రోహిణీ బాగోతం
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్‌లో ప్రభావతి ఇంట్లో దీపావళి సంబరాలు ప్రారంభమవుతాయి. ప్రభావతి స్వయంగా పూజ నిర్వహించగా, ఆమె కొడుకులు, కోడళ్ళు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొంటారు. పూజ అనంతరం కుటుంబ సభ్యులంతా ప్రభావతి-సత్యం దంపతుల ఆశీర్వాదం తీసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటారు. ఇంటంతా పండుగ హడావిడి అలుముకుంటుంది. ఇంతలో మీనా పాయసం చేసి ఇస్తుంది. ఆమె చేసిన స్వీట్ రుచి చూసిన సత్యం తన తల్లి వంటను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతాడు. బాలు కూడా సరదాగా, "షీలా డార్లింగ్ చేసిన పాయసం లాగా ఉంది" అంటూ ప్రసంశిస్తారు. ఇంతలో శృతి డబ్బింగ్ పూర్తి చేసుకొని కిందకి వస్తుంది. ఆమె మాట్లాడే గ్రాంథిక భాష అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. "నరకాసుర వధ" ఎపిసోడ్‌కి డబ్బింగ్ ఇచ్చానని చెప్పడంతో నవ్వులు పూస్తాయి. సత్యం "సత్యభామ నిజమైన సాహసవంతురాలు" అని చెప్పగా, బాలు సరదాగా "మీనా కూడా సత్యభామనే.. సత్యభామ బాణాలు వేస్తే, మీనా ఇటుకలు వేస్తుంది!" అంటూ నవ్వుల వర్షం కురిపిస్తాడు. ఇంతలో మీనాకి విద్య కాల్ చేస్తుంది. దీపావళి పండుగ కోసం పూలు తీసుకురమ్మని అడగడంతో మీనా అంగీకరిస్తుంది. బాలు "నేను చూసుకుంటాను" అంటూ పంపిస్తారు.
మరోవైపు రోహిణికి దినేష్ ఫోన్ చేస్తుంటాడు కానీ ఆమె కాల్ కట్ చేస్తుంది. వేరే నంబర్ నుంచి ఫోన్ చేయగా రోహిణి లిఫ్ట్ చేస్తుంది. దినేష్ "ఏంటి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావ్?" అని అడగగా, "ఆడపిల్లలను వేధించి పైసలు వసూలు చేయడం కరెక్టేనా?" అంటూ రోహిణి ప్రశ్నిస్తుంది. కోపంగా దినేష్ "నువ్వు చేసినవి కరెక్టేనా?" అని ఎదురుదాడి చేస్తాడు. అనుకోకుండా రోహిణి "పోలీసులతో కొట్టించా, గుండాలతో కొట్టించా..." అని జారిపోతుంది. దాంతో దినేష్‌కు అసలు విషయం అర్థమై, రోహిణిపై లక్ష రూపాయల పెనాల్టీ డిమాండ్ చేస్తాడు. చెల్లించకపోతే "మీ అత్తగారింటి దీపావళి చివరిది అవుతుంది" అంటూ బెదిరిస్తాడు. భయంతో రోహిణి విద్యను కలవాలని నిర్ణయిస్తుంది. ఇలా రోహిణి విద్యా ఇంటికి చేరుకోగా, దినేష్ మనుషులు ఆమెను ఫాలో అవుతారు. అదే సమయంలో మీనా పూలు తీసుకుని విద్యా ఇంటికి వస్తుంది. రోహిణి అక్కడ ఉండడంతో మీనా ఆశ్చర్యపోతుంది. విద్య కవరింగ్ చేయగా, మీనా పూలు ఇచ్చి బయలుదేరుతుంది. బాలు ఫోన్ చేయడంతో "వస్తున్నా" అంటుంది. అయితే రోహిణి, మీనా ఇద్దరూ రెడ్ కలర్ సారీలు కట్టుకోవడంతో రౌడీలు తప్పుగా మీనాను కిడ్నాప్ చేస్తారు. మీనా అరవడం విని బాలు షాక్ అవుతాడు. వెంటనే విద్యా ఇంటికి చేరి పరిస్థితిని పరిశీలిస్తాడు. మీనా ఫోన్ రోడ్డుపై మోగుతుండగా, బాలు ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి ఉత్కంఠ పెరుగుతుంది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

మీనా కనిపించకపోవడంతో బాలు తీవ్రంగా కంగారు పడతాడు. చుట్టూ వెతుకుతాడు. కానీ ఎక్కడా కనిపించదు. ఇదే సమయంలో మీనా తనకు ఏదైనా ప్రమాదం ఎదురవుతుందనే భయంతో దారి వెంబడి పూలను క్లూలా వేసుకుంటూ వెళుతుంది. ఆ పూల ఆధారంగా బాలు మీనా వెతకడానికి బయలుదేరుతాడు. మరోవైపు దినేష్ మనుషులు రోహిణిని టార్గెట్ చేస్తూ ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు రోహిణి ఎరుపు చీర కట్టుకోవడం, మీనా కూడా ఎర్ర చీర కట్టుకోవడంతో పొరపాటు జరుగుతుంది. రోహిణి బదులుగా వారు మీనాను కిడ్నాప్ చేస్తారు.
రూమ్‌లో బంధించి, ఆ విషయం దినేష్‌కు చెబుతారు. "ఈరోజు రోహిణి చెవులు, ముగ్గులు కట్ చేసి సూర్పలకగా తయారు చేస్తా.. జీవితమే నరకమైపోయేలా చేస్తా" అని దినేష్ క్రూరంగా డైలాగులు వేస్తాడు. అయితే రూమ్‌లోకి వెళ్లిన తర్వాత మీనా కనిపించడంతో షాక్ అవుతాడు. "నేను ఎవరిని తీసుకురమ్మంటే, మీరు ఎవరిని తెచ్చారు!" అంటూ తన మనుషుల మీద కోపంతో విరుచుకుపడతాడు. వారు "ఇది రోహిణి కాదు, బాలుగాడి భార్య మీనా. పోలీసులకు అప్పగించిన వాడి భార్య" అని చెబుతాడు. సరేలే .. ఇలాగైనా బాలుపై పగ తీర్చుకోవడానికి అవకాశం వచ్చిందని ఫీల్ అవుతాడు.
ఇదిలా ఉండగా.. రోహిణి మాత్రం దినేష్ నుండి వస్తున్న బెదిరింపులతో అల్లాడుతుంది. అతడికి డబ్బులు ఇవ్వడానికి మార్గాలు వెతుకుతుంది. మనోజ్ వద్దకు వెళ్లి "విద్య వాళ్ల నాన్నకు యాక్సిడెంట్ అయింది, వెంటనే 50,000 కావాలి" అని అబద్ధం చెబుతుంది. మనోజ్ వద్ద డబ్బు లేకపోవడంతో "రేపు ఉదయం సెట్ చేస్తాను" అని మాటిస్తాడు. దినేష్ వరుసగా ఫోన్ చేస్తూ, "లక్ష రూపాయలు ఇవ్వకపోతే సాక్ష్యాలతో సహా నీ రహస్యం బయటపెడతా" అని వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. రోహిణి ఎయిర్ బడ్స్ పెట్టుకుని ఆ వాయిస్ వినిపించకుండా వింటుంది. ఆ బెదిరింపు ఆమెను మరింత కంగారుపడేలా చేస్తుంది. "దినేష్ నిజంగానే ఇంటికి వచ్చి బాగోతం బయటపెడతాడేమో" అని భయంతో రోహిణి మనోజ్‌కు అబద్ధం చెబుతూ బయటకు బయలుదేరుతుంది.
మరోవైపు.. దినేష్, మీనాతో మాట్లాడుతాడు. ఈ క్రమంలో మీనా.. 'ఎవర్రా నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? ' అని ప్రశ్నిస్తుంది. దీంతో దినేష్ ఈ రాజ్యానికి నేను రాజుని అంటూ వెటకారంగా సమాధానం ఇస్తాడు. అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చావని మీనా ప్రశ్నించగా.. నీ మొగుడు నాకు బాకీ ఉన్నాడు అందుకే నేను తీసుకొచ్చా'అని అంటారు. మీనా ధైర్యంగా "నా మొగుడు వస్తే నీ కాళ్లు విరగొట్టేస్తాడు. మర్యాదగా చెబుతున్నా - నన్ను విడిచిపెట్టు" అని హెచ్చరిస్తుంది. దినేష్ మాత్రం "రానివ్వు! వచ్చాక చూస్తా" అంటాడు. మీనా ఆగ్రహంతో "నీ చావు మా ఆయన చేతులనే వస్తుంది" అంటుంది.
ఇంతలో దినేష్ మనుషులు వచ్చి "బాలు వస్తున్నాడు" అని చెబుతారు. దినేష్ ఆశ్చర్యపోతాడు. బాలు చేరుకున్నాక రౌడీలు అతన్ని చుట్టుముట్టుతారు. "నా భార్యను ఎందుకు కిడ్నాప్ చేశారూ?" అని బాలు ప్రశ్నిస్తాడు. దినేష్ "నీకు నాకు పాత బాకీ ఉంది, ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి. అప్పుడే నీ భార్య సురక్షితంగా ఉంటుంది" అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకు బాలు ఆగ్రహంతో దినేష్ గ్యాంగ్ పై దాడి చేస్తాడు. బాలు ఒక్కరే గ్యాంగ్ మొత్తాన్ని చితకబాదుతాడు. ఇంతలో ఒక రౌడీ వెనుకనుంచి బాలు తలకు గట్టి దెబ్బ కొడతాడు. బాలు స్పృహ కోల్పోతాడు.
అదంతా చూసిన మీనా ఆవేశంతో తాళ్లు తెంపేసుకుంటుంది. "బాలు ప్రాణం కోసం నేనే పోరాడతా!" అని వీరనారిలా గుండాలపై దాడి చేస్తుంది. ఆమె చేతికి దొరికిన ప్రతి వస్తువు ఆయుధంగా మారుతుంది. మీనా చూస్తే.. అమ్మవారే దిగివచ్చినట్టు అనిపిస్తుంది. బాలుకి అయితే.. సత్యభామను చూసినట్టు అనిపిస్తోంది. తన భార్యనేన ఇలా కొడుతుందని షాక్ అవుతాడు బాలు.
ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. "ఏంటి బాలు! నీ భార్యను కిడ్నాప్ చేశారని ఫోన్ చేశావు, కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది!" అని పోలీస్ ఆఫీసర్ చెబుతాడు. బాలు జరిగిన విషయం మొత్తాన్ని చెప్పేస్తాడు. "ఈ దినేష్ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేసే వాడు" అని వెల్లడిస్తాడు. దినేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. దీంతో తన విషయం బయటపడిందనీ రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పోలీసులు వెళ్లిన తర్వాత మీనా "ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పకూడదు" అని బాలు దగ్గర మాట తీసుకుంటుంది.
మరోవైపు రోహిణి తీవ్రంగా మానసికంగా కుంగిపోతుంది. తన తప్పిదం వల్ల ఈ కిడ్నాప్ డ్రామా జరిగిందని బాధపడుతుంది. తర్వాత రోహిణి విద్య ఇంటికి వెళ్తుంది. "ఇక నా జీవితం ముగిసిపోయింది, నా రహస్యం బయటపడింది" అంటూ ఏడుస్తుంది. విద్య "ఇంతవరకు నువ్వు దాచినందుకే ఇంత దారుణం జరిగింది. ఇప్పుడు అయినా నిజం చెప్పి ధైర్యంగా ఎదుర్కో" అని హితవు పలుకుతుంది. ఇంతలో ప్రభావతి మనోజ్‌కు వరుసగా ఫోన్ చేస్తూ ఉంటుంది. రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. "ఇక ఎక్కడికీ దాగలేను, నా పాపం బయటపడుతుంది" అనే భయంతో సతమతమవుతుంది.


Click it and Unblock the Notifications










