Gunde Ninda Gudi Gantalu Weekly: శృతి తల్లి క్రూరమైన కుట్ర.. బాలు కుటుంబంలో చీలికలు, మీనా కంటతడి
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సెప్టెంబర్ 15వ తేదీ 510వ ఎపిసోడ్‌లో..
ఈ వారం వంతు ప్రకారం హాల్‌లో పడుకోవాలని రోహిణి చెప్పడంతో మనోజ్ నా వల్ల కాదంటాడు. కింద నేను పడుకోలేనని, ఏసీ లేదు, దోమలు కూడతాయని, నాకు నిద్రపట్టదని రకరకాల వంకలు చెబుతాడు. మనోజ్ - రోహిణిలు ఎంతకీ కిందకి రాకపోవడంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దాంతో పైకి వెళ్లి తలుపులు బాదటంతో రోహిణి - మనోజ్‌లు మండిపడతారు. నువ్వే నా కొడుకుని ఉసిగొలిపావా? అని మీనాని ప్రభావతి ప్రశ్నిస్తుంది. నాకు అదొక్కటే పని.. అయినా ఇన్నాళ్లు కింద పడుకున్నది ఎవరు అని మీనా కౌంటర్ వేయడంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. మీనా వదిన వద్దు అంటున్న వినకుండా బాలు అన్నయ్యే పైకి వెళ్లాడని శృతి, రవిలు ఏం జరిగిందో చెబుతారు.
ఈ గొడవతో సత్యం కిందకి వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటాడు. పెద్దవాళ్లుగా వంతులు వేసిన తర్వాత పిల్లలు దానిని పాటించి తీరాల్సిందేనని అంటాడు సత్యం. దాంతో చేసేది లేక రోహిణి - మనోజ్‌లు హాల్‌లోనే పడుకుంటారు. బాలు- మీనాలను ప్రశాంతంగా పడుకోనివ్వకూడదని అనుకున్న మనోజ్ పదే పదే తలుపులు కొడుతూ బాలుని విసిగిస్తాడు మనోజ్. నిద్రపట్టక అటు ఇటు తిరిగిన మనోజ్.. ఉదయాన్నే తల్లి దగ్గరికి వెళ్లి నా రూమ్ నాకు కావాలని మారాం చేస్తాడు. దీంతో ప్రభావతి వారం రోజులు ఆగితే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తామని సర్దిచెబుతుంది. ఉదయాన్నే టిఫిన్ చేస్తుండగా డైనింగ్ టేబుల్ మీదే పడుకుంటాడు మనోజ్. షాప్ ఓపెనింగ్‌కి ఏ సెలబ్రిటీని పిలుస్తున్నావని మనోజ్- రోహిణిలను శృతి ప్రశ్నించగా.. ఎవరో ఎందుకు అమ్మ చేతుల మీదుగానే షాప్ ఓపెనింగ్ చేయాలని అంటాడు బాలు.

సెప్టెంబర్ 16వ తేదీ 511వ ఎపిసోడ్‌లో..
నువ్వు పార్క్‌లో పడుకున్నా, గుడి మెట్ల మీద అడుక్కుతిన్నా, నువ్వు ఎన్నో తప్పులు చేసినా నిన్ను అమ్మ కాపాడి వెనకేసుకొచ్చిందని గుర్తుచేస్తాడు బాలు. అలాంటి అమ్మ చేత్తో కాకుండా ఎవరో సెలబ్రిటీ చేత్తో నీ ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయిస్తావా? అని మండిపడతాడు బాలు. కుటుంబ సభ్యులంతా ఏకగ్రీవంగా ఒప్పుకోవడంతో తన తల్లి చేతుల మీదుగా షాప్ ఓపెన్ చేయించడానికి మనోజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. షాప్ ఓపెన్ సందర్భంగా ఓ చీఫ్ గెస్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పి అందరినీ వెయిట్ చేయిస్తుంది ప్రభావతి. ఇంతలో శృతి తల్లి కారు దిగి వస్తుంది. షాప్ ఓపెనింగ్ తర్వాత తొలి బోణి మీరే చేయాలని ప్రభావతి అడగటంతో అన్నింటిలోకి కాస్ట్ లీ సోఫా అడుగుతుంది శృతి తల్లి.
దాంతో మనోజ్, రోహిణిలు లక్షన్నర విలువ చేసే సోఫాను చూపిస్తారు. ఆ వెంటనే మరో ఆలోచన లేకుండా శృతి తల్లి డబ్బు కట్టలు ఇవ్వడంతో ప్రభావతి, కామాక్షిలు షాక్ అవుతారు. ఇంతలో ఇంట్లోకి మిక్సర్ కొనాలని మీనా చూస్తుండగా.. ప్రభావతి వచ్చి అవమానిస్తుంది. షాప్ ఓనర్ వచ్చి మనోజ్‌కు డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఇంత తక్కువ రేట్‌కి షాప్ అమ్మడానికి కారణం నీ తమ్ముడు బాలు అని చెప్పి వెళ్లిపోతాడు. మీనా కుటుంబాన్ని షాప్ ఓపెనింగ్‌కి పిలవకపోవడంపై ప్రభావతికి క్లాస్ పీకుతాడు సత్యం. పాత స్టాఫ్‌ని పిలిపించిన మనోజ్.. వాళ్లందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేసి కుర్రాళ్లను పెట్టుకుంటాడు. మనోజ్ నిర్ణయంతో రోహిణి షాక్ అవుతుంది.
సెప్టెంబర్ 17వ తేదీ 512వ ఎపిసోడ్‌లో..
తమను ఉన్నపళంగా రోడ్డు మీదకి నెట్టేయొద్దని, ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డామని చెబుతారు పాత ఉద్యోగులు. మీరు ముసలి వాళ్లు అయిపోయారని, టేబుల్ కూడా జరపలేకపోతున్నారని చెబుతాడు. ఒకసారి ఆలోచించమని రోహిణి చెప్పినా మనోజ్ పట్టించుకోడు. వయసు పెరిగిందంటే అనుభవం కూడా వచ్చిందని, అసలే కొత్త షాప్ పెట్టారని మీకు మా అనుభవం ఉపయోగపడుతుందని చెబుతారు ఉద్యోగులు. మమ్మల్ని నడిరోడ్డు మీద నిలబెట్టావని, నువ్వు ఎలా షాప్ నడుపుతావో చూస్తామని బెదిరించి వెళ్లిపోతారు.
ఫర్నిచర్ షాపులో రోజంతా కష్టపడి, బాగా అలిసిపోయి ఇంటికి వచ్చిన మనోజ్ - రోహిణిలకు ప్రభావతి దిష్టి తీస్తుంది. ఒక్కరోజుకే వీడి పని ఇలా అయిపోయిందని బాలు, సత్యంలు సెటైర్లు వేస్తాడు. బాగా అలిసిపోయిన మనోజ్.. హాల్‌లోకి వెళ్లి పడుకోవాలన్న సంగతి కూడా మరిచిపోయి రోహిణి ఎంత నిద్రలేపినా బెడ్‌రూంలోనే పడుకుంటాడు. మనోజ్ గాడు ఎంతకీ రాకపోవడంతో బాలు వచ్చి తలుపులు బాదడంతో సత్యం వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. వాడు రూమ్ ఖాళీ చేయడం లేదని చెబుతాడు. నువ్వు, మీనా మా గదిలో పడుకోండి.. నేను, మీ అమ్మ హాల్‌లో పడుకుంటామని సత్యం అంటాడు. మీరు ఈ వయసులో కష్టపడొద్దన్న బాలు.. మీనాని తీసుకుని వెంటనే మేడ మీద పడుకుంటాడు. తన వల్ల నువ్వు నేల మీద పడుకోవాల్సి వస్తుందని, మనకి డబ్బు లేదని మనల్ని వేరుగా చూస్తున్నారని బాధపడతాడు బాలు. మనోజ్ ఉదయాన్నే ఎంతకీ నిద్రలేవకపోవడంతో ప్రభావతి కొడుకుని నిద్రలేపుతుంది.
సెప్టెంబర్ 18వ తేదీ 513వ ఎపిసోడ్‌లో..
మనోజ్ నిద్రలేవకపోవడంతో బాలు వచ్చి ముఖాన నీళ్లు కొట్టడంతో మనోజ్ ఉలిక్కిపడి లేస్తాడు. నువ్వు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే చివరికి ఫర్నిచర్ షాప్ కూడా మిగలదని బాలు వార్నింగ్ ఇస్తాడు. తన కారు క్లీన్ చేసుకుంటూ ఉండగా ఇంటి ముందు సోఫా డెలివరీ చేయడానికి కొందరు మనుషులు వస్తారు. మీ ఇంటికి సురేంద్ర గారు సోఫాని పంపించారు అని వారు చెప్పడంతో వెంటనే శృతి తల్లికి బాలు ఫోన్ చేసి మీరు పంపించిన సోఫాను మీరే తీసుకెళ్లండని చెబుతాడు. బాలు చేసిన పనిని అడ్డం పెట్టుకుని శృతిని, రవిని ఇంటికి తెచ్చుకోవడానికి సురేంద్ర దంపతులు కుట్ర చేస్తారు. షాప్ మొత్తం కస్టమర్లతో కళకళలాడుతుండగా ఆనందంగా ఉన్న సమయంలో శృతి తల్లి వచ్చి సోఫాను రిటర్న్ చేస్తున్నట్లు చెప్పడంతో మనోజ్, రోహిణిలు షాక్ అవుతారు. ఆమె జరిగినదంతా చెప్పి బాలు మీద లేనిపోనివి చెబుతుంది. శృతి తల్లికి డబ్బులు ఇవ్వడం కోసం తన తాళిబొట్టు తాకట్టు పెడుతుంది రోహిణి. షాపులో తనకు జరిగిన అవమానం గురించి మనోజ్ ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడు.
సెప్టెంబర్ 19వ తేదీ 514వ ఎపిసోడ్‌లో..
బాలు సోఫా రిటర్న్ చేయడంపై ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఇకపై నాకు చెప్పకుండా నీ బోడి పెత్తనం చేస్తే ఊరుకోనని బాలుకి వార్నింగ్ ఇస్తాడు మనోజ్. దాంతో రగిలిపోయిన బాలు.. మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. రౌడీయిజం చేస్తున్నావా అని రవి అనడంతో ఏంట్రా నైటీలు వేసుకునేవాడా నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయి నన్ను అంటావా? అంటూ రవి కాలర్ పట్టుకుంటాడు బాలు. ముగ్గురు అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు దూసుకెళ్తుంటారు. దాంతో సత్యం బాలుపై కోప్పడి తప్పు నీదేనని చెప్పడంతో బాలు బాధపడతాడు. బాలు కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో శృతి బాధపడుతుండగా ఆమెను ఓదారుస్తాడు రవి. మనింట్లో జరిగిన గొడవకి కారణం శృతి తల్లేనని బాలుకి మీనా చెబుతుంది. బాలు- శృతిలను ఇంట్లో నుంచి పంపించేయాలని సత్యంతో చెబుతుంది ప్రభావతి. జరిగిన దానికి మీనాపై నిందలు వేస్తుండటంతో ప్రభావతిపై సీరియస్ అవుతుంది శృతి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










