»   » రేటింగ్ లే రేటింగ్ లు :టీవీ షో జడ్జి గా స్టార్ హీరోయిన్

రేటింగ్ లే రేటింగ్ లు :టీవీ షో జడ్జి గా స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జడ్జి అవతారం ఎత్తనున్నారు. టీవీ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ జూనియర్స్‌కి ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ విషయంపై 27ఏళ్ల సోనాక్షి ట్విట్టర్లో స్పందించారు.

బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు చేరువ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. దీంతో బుల్లి తెరపై సందడి చేస్తున్న బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ఖాన్‌, గోవింద తదితరుల సరసన సోనాక్షి కూడా చేరారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Sonakshi Sinha turns judge for Indian Idol Juniors

ఇక రీసెంట్ గా సోనాక్షి సిన్హా రజనీకాంత్ తో లింగా చిత్రం చేసింది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఆమె... ఇంతకీ మొదటి రోజు షూటింగ్‌లో రజనీకాంత్ ని చూశాక.. నటించలేకపోయాను తెలుసా! రజనీ సార్‌ కల్పించుకుని 'ఏమైందమ్మా..!' అన్నారు. 'మీలాంటి సీనియర్‌.. పైగా నాన్న ఫ్రెండ్‌ పక్కనే ఉంటే భయంగా ఉంది సార్‌!' అన్నాను. 'నా ఫ్రెండ్‌ కూతురితో లవ్‌ సీన్లలో నటిస్తున్నందుకు నేను కదమ్మా భయపడాలి!' అన్నారు వాతావరణాన్ని తేలిక చేస్తూ.

అందరం నవ్వేశాం. ఆ తర్వాత షూటింగ్‌లో ఎప్పుడూ ఆందోళనపడలేదు! 'లింగా' షూటింగప్పుడు నన్నందరూ బాలీవుడ్‌ నటిననే అంటూ వచ్చారు. 'లింగా' రిలీజయ్యాక నేను అసలైన భారతీయ నటిననే అంటారు చూడండి అంటూ మురిసిపోతూ చెప్పింది.

'దబాంగ్‌' తర్వాత నా కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయిన 'రౌడీరాథోర్‌'కి మూలం మీ 'విక్రమార్కుడు' సినిమానే. అలాగే 'సన్‌ ఆఫ్‌ సర్దార్‌'... తెలుగు 'మర్యాద రామన్న' రీమేక్‌. 'లింగా' తర్వాత నేనిప్పుడు నటిస్తున్న 'దేవర్‌'.. తెలుగులో చరిత్ర సృష్టించిన 'ఒక్కడు' కథ నుంచి అల్లినదే. అందుకే ఈ తెలుగు సినిమాలన్నీ మళ్లీమళ్లీ చూడాల్సొచ్చింది. భాష కూడా ఎంతోకొంత ఒంటపట్టింది అంటూ వివరించింది.

Sonakshi Sinha turns judge for Indian Idol Juniors

ఇక నాన్నా... రజనీసార్‌ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి 'అస్లీ నకిలీ' చిత్రంలో నటించారు. ఆ సినిమా రిలీజైన ఏడాదికి నేను పుట్టాను! నాన్న నటించిన చిత్రాల్లో అది నా ఫేవరైట్‌ కూడా! 'లింగా'లో నాకు అవకాశం వచ్చిందని చెప్పగానే నాన్న చాలా సంతోషించారు. రజనీకాంత్‌ గురించి గంటలు గంటలు చెప్పారు. చాలా సింపుల్‌గా, క్రమశిక్షణతో ఉంటారనీ... భక్తి ఎక్కువనీ చెబుతూ పోయారు.

'స్నేహితుడేగా... ఆ మాత్రం చెప్పకపోతే ఎలా' అంటూ నాన్నని ఆటపట్టించా. కానీ ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడే అసలు రజనీ అంటే ఏంటో అర్థమైంది! ఆయనపై ప్రేక్షకులకుండేది కేవలం అభిమానం కాదు.. ఓ పిచ్చి! సాధారణంగా పెద్ద హీరోలు 'ప్యాకప్‌' అన్నాక వెళ్లిపోతారు. కానీ సూపర్‌స్టార్‌ అలా కాదు.

షూటింగ్‌ అయిపోయిన తర్వాత అంతదాకా అక్కడ శ్రమించిన కార్మికుల కోసం సమయం కేటాయిస్తారు. వారితో ఫొటోలు దిగి, యోగ క్షేమాలు కనుక్కుంటారు. ఆయన్ని చూశాక అర్థమైంది.. నాన్న ఆయన గురించి చెప్పింది తక్కువేనని.

నేను నేర్చుకున్న మొదటి దక్షిణాది భాష తెలుగే. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. నేను నటించిన వాటిలో చాలావరకూ తెలుగు సినిమాల రీమేక్‌లే కదా మరి అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి సిన్హా.

Sonakshi Sinha turns judge for Indian Idol Juniors

'దబాంగ్‌' కోసం నన్ను అడిగినప్పుడు సల్మాన్‌జీ ఎలాంటి షరతులూ చెప్పలేదు. ఒప్పుకున్న తర్వాతే అసలు సంగతి చల్లగా చెప్పాడు.. నేను 30 కిలోలు తగ్గాలని. సినిమా ఒప్పుకున్నాను కాబట్టి తప్పుతుందా! మా ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటుచేసుకున్నా. పగలూ రాత్రీ శ్రమించాను. ఆహారాన్ని సగానికి సగం తగ్గించాను. 40 రోజుల్లో 30 కిలోలు తగ్గాను! 'ఈ పట్టుదల చాలు! పెద్ద హీరోయినైపోతావ్‌..' అన్నాడు సల్మాన్‌.

ఏఆర్‌ మురుగదాస్‌ తీసిన 'తుపాకీ' హిందీ వెర్షన్‌ 'హాలిడే'లో నేనే హీరోయిన్‌ని. అందులో ఓ ఐదు నిమిషాలపాటు నేను బాక్సర్‌గా కనిపించాలి. తమిళంలో నటించిన హీరోయిన్‌ కన్నా చాలా బాగా చేయాలనుకున్నా. బాక్సింగ్‌లో మనదేశానికి ఒలింపిక్‌ స్వర్ణం సాధించిపెట్టిన వీరేంద్రసింగ్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా. ఆ సినిమాలో నేను కనిపించే పాత్ర కొన్ని నిమిషాలైనా చాలా పేరు తెచ్చిపెట్టింది.

బాలీవుడ్‌ లో కన్నా దక్షిణాదిలో షూటింగ్‌ శరవేగంతో చేస్తారు. ప్రభుదేవా, ఏఆర్‌ మురుగదాస్‌ సినిమాల్లో చేశాను కాబట్టి ఆ వేగం నాకు తెలుసు. 'లింగా' చిత్రాన్ని కేఎస్‌ రవికుమార్‌ ఆర్నెల్లలో పూర్తిచేయాలనుకున్నారు. అందర్నీ పరుగెత్తించేవారు. నాకు తమిళం, తెలుగు రాదు కాబట్టి షెడ్యూల్‌ని కాస్త పొడిగిస్తామన్నారు. నేను ఒప్పుకోలేదు. వారంలోనే రెండు భాషలూ నేర్చుకుని మాట్లాడటం మొదలుపెట్టా. అందరూ ఆశ్చర్యపోయారు. 'దక్షిణాది అమ్మాయిలాగే మాట్లాడుతోందే!' అన్నారు రజనీ సంబరంగా!

Sonakshi Sinha turns judge for Indian Idol Juniors

మూలంలోని హీరోయిన్స్ కంటే నేనెంత వైవిధ్యంగా చేయొచ్చో తెలుసుకోవడానికే కాదు.. అసలు హిందీ వెర్షన్‌లో నటించొచ్చా వద్దా... అని నిర్ణయం తీసుకోవడానికీ తెలుగు సినిమాలు చూసేదాన్ని. 'అదేమిటీ... ఆ నిర్ణయం మీ అమ్మానాన్నా తీసుకోరా..' అనుకుంటున్నారా! ఒక్క సినిమాల విషయమే కాదండోయ్‌.. మరే విషయానికైనా అమ్మానాన్నలపై ఆధారపడకూడదన్నది మా ఇంట్లో నియమం! మా నాన్న శత్రుఘ్న సిన్హా పెద్ద స్టారైనా.. ఆయన ద్వారా నేనెప్పుడూ అవకాశాల కోసం ప్రయత్నించకపోవడానికీ అదే కారణం.

ఇప్పటికీ నా వాదన .. నటనకి అందం కంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం. నా చిత్రాలు కలెక్షన్లలో చరిత్ర సృష్టించినా.. రిలీజైన రోజే కనిపించకుండా పోయినా నన్ను కాపాడుతున్నది అదే! ఆ చిత్రాలన్నీ ఒక ఎత్త్తెతే దక్షిణాదిలో నా తొలి సినిమాలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పక్కన నటించే అవకాశమిచ్చిన 'లింగా' మరొకెత్తు!

మా అన్నలు లవ్‌, కుశ్‌. పేరుకు తగ్గట్టే ఇద్దరూ కవలలు. వాళ్లని విపరీతంగా ఆటపట్టిస్తుంటా. ఆ పంచాయతీ మా నాన్న దాకా వెళుతుంటుంది. అప్పుడు ఉత్తుత్తినే కన్నీళ్లు పెట్టుకుంటా! ఇంట్లో ఒక్కత్తినే ఆడపిల్లని కాబట్టి నాన్న నావైపే ఉంటారెప్పుడూ. ఇంటర్‌ తర్వాత ఫ్యాషన్‌ డిజైనింగే ఇక నా ప్రపంచం అనుకున్నా! అందులోనే డిగ్రీ చేశా. ఒకట్రెండు చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసినా.. బాలీవుడ్‌పై ఆసక్తి కలగలేదు. 2008, 2009లో వరుసగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌వాక్‌ చేశా!

'ఇంత బొద్దుగా ఉన్న అమ్మాయి ర్యాంప్‌ వాక్‌ ఎలా చేస్తుందబ్బా' అని ఆశ్చర్యపోయారందరూ. కానీ బొద్దుగా ఉన్న వాళ్లందరూ అందంగా, ఆకర్షణీయంగా ఉండరా... వాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండదా.. చెప్పండి! ఉంటుందని నిరూపించడానికే అలా చేశా. ఆ ర్యాంప్‌ వాక్‌ తర్వాతే సల్మాన్‌ 'దబాంగ్‌' నటించమని అడిగారు. 'జీరో సైజు' నాయికల హవా నడుస్తున్న కాలం అది. తటపటాయిస్తూనే ఒప్పుకున్నా.

దబాంగ్ చిత్రానికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాక 'అసలు హీరోయిన్ అంతలావుగా ఉండటమేంటీ... ఆ పెద్ద నుదురేమిటీ..' అనడం మొదలుపెట్టారు. అయితే సినిమా విడుదలై విజయం సాధించాక అందరి నోళ్లూ మూతపడ్డాయి. నా నటనలో కనపడ్డ ఆత్మవిశ్వాసం, ఈజ్‌ చూసి మెచ్చుకోనివారు లేరు.

నాన్న, అమ్మ ఇద్దరూ నటులైనా.. అవన్నీ సెట్‌ నుంచి వచ్చేదాకే. మా ఇంట్లో పనివాళ్లు చాలా తక్కువ. నిద్రలేచాక పక్క సర్దడం నుంచి.. మేం తిన్న పళ్లాలు కడగడం దాకా ప్రతిదీ మేమే చేయాలన్నది రూలు! వారాంతాల్లో మా రూమ్‌ మేమే శుభ్రం చేసుకుని తీరాలి. అమ్మ స్నేహితురాళ్లంతా 'ఎందుకిలా చేయిస్తున్నావు' అని అడిగితే 'ఇవన్నీ ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు ఉపయోగపడతాయి. మనకెన్ని ఆస్తులున్నా పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి ఇదే' అని చెప్పేది.

స్కూల్‌కి కూడా నేను నాన్న కారులో వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. బస్సులూ ఆటోల్లోనే నా ప్రయాణం. కాలేజీకొచ్చాక రైల్లో వెళ్లడం మొదలుపెట్టా. అదొక్కటే తేడా! అమ్మ నేర్పిన ఆ పాఠాలు ఎంత విలువైనవో, అవి నాకెంత ఆత్మవిశ్వాసాన్నిచ్చాయో సినిమాల్లోకి వచ్చాక, షూటింగ్‌ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు బాగా అర్థమవుతోంది నాకు.

English summary
Sonakshi Sinha will be one of the three judges in the panel for Indian Idol Junior, along with Vishal Dadlani and Salim Merchant. One of the prime reasons for taking this decision, according to the actress, is the fact that she is still a child at heart. She further expressed her love for such shows wherein she can meet wonderfully talented kids and considers it to be a perfect platform for her.
Please Wait while comments are loading...