For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోన్లు చేసి బెదిరించారు...కారు ఆపి తిట్టారు: టీవీ నటి హరిత

  By Srikanya
  |

  TV Artist Haritha reveals about her experiences
  హైదరాబాద్ : తమిళ్‌ సీరియల్‌లో నటించేటప్పుడు మొదట్లో దాదాపు చాలా వాటిల్లో విలన్‌ పాత్రలే పోషించా. అయితే అప్పట్లో జనాల మీద సీరియళ్ల ప్రభావం చాలా తక్కువ. దూరదర్శన్‌ కాక రెండుమూడు ఛానళ్లు మాత్రమే ఉండేవి. దాంతో నటీనటులను బాగా గుర్తు పెట్టుకొనేవారు. ఈ క్రమంలో నేను నటించిన ఓ ధారావాహిక బాగా హిట్‌ అయింది. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఎలాగంటే నా నంబరు కనుక్కొని మరీ ఇంటికి ఫోన్‌ చేసి బెదిరించేవారు. చెడ్డ పనులు చేస్తే ఊర్కోం అనీ, మళ్లీ అలా కనిపిస్తే బాగోదనీ హెచ్చరించేవాళ్లు. వాళ్లందరికీ సర్ది చెప్పుకొని.. సంజాయిషీ ఇచ్చుకొనే సరికి నా తలప్రాణం తోకకి వచ్చేదనుకోండి.

  రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా తీర్పునిస్తూ, సీరియల్స్ లో అత్తగారిలా పెత్తనం చేస్తూ తెలుగు టీవీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకొంది చిన్నతెర నటి హరిత. సినీనటి రవళి అక్కగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొంది. తన సహ నటుడు జాకీతో ఏడడుగులు నడిచి.. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా వడివడిగా అడుగులు వేస్తోన్న హరిత తన అనుభవాలు పంచుకుంటూ ఇలా స్పందించింది.

  అలాగే అలాంటి సంఘటనలు జరిగినప్పటినుంచీ...విలన్‌ పాత్రలంటే వెనకడుగు వేస్తున్నా. అయితే తెలుగులోకి వచ్చేసరికి అనుకోకుండా ఈటీవీ సంఘర్షణలో అలాంటి పాత్రే పోషించాల్సి వచ్చింది. అప్పుడు మరీ దారుణం నా పరిస్థితి. ఒకసారి హైదరాబాద్‌లో మా కుటుంబసభ్యులతో కలిసి పెళ్లికి వెళితే నేను వెళుతున్న కారు ఆపి మరీ.. ''ఇదిగో ఇదే పాపని ఏడిపించేది. అసలు నువ్వు ఆడదానివేనా. పసిపిల్లని అలా చేస్తావా?' అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారు. ఎలాగోలా తప్పించుకొని ఇంటికి వెళ్లాను. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉంటున్నా. ఇప్పటి వరకూ తెలుగులో ఇంటింటిరామాయణం, కథకాని కథ, అగ్నిపూలు, చదరంగం, ప్రియాంక.. ఇలా దాదాపు పాతిక సీరియళ్లలో నటించా అన్నారు.

  తన వివాహం గురించి చెప్తూ... ఈటీవీ కలిపిన బంధం అన్నారు. ఆ విషయమై మాట్లాడుతూ.... జానకీ రామ్‌ (జాకీ), నేనూ ఏళ్ల తరబడి ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నాం అని చాలామంది అనుకొంటారు. కానీ పెద్దలు అంగీకరించాక మేము ప్రేమలో పడ్డాం. జాకీ, మా అన్నయ్యా మంచి స్నేహితులు. తను తరచూ మా ఇంటికి వచ్చేవాడు. తన ప్రవర్తన అమ్మానాన్నలకి నచ్చి వాళ్లే పెళ్లి ప్రస్తావన తెచ్చారు. కాకినాడలో ఉన్న తన తల్లిదండ్రులకి కబురు పెట్టారు. వాళ్లూ ఒప్పుకొన్నారు. అప్పుడే 'మా ప్రేమ కద' మొదలైంది. ఆ తరవాత ఇద్దరం కలిసి 'చదరంగం' సీరియల్‌లో నటించాం. అలా పదమూడేళ్ల క్రితం మా పెళ్లయ్యింది. బాబు పుట్టాక ఏడెనిమిది నెలలకే ముఖానికి రంగు వేసుకొన్నా. పాప పుట్టాక మాత్రం నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకొన్నా అన్నారు.

  సినిమాల్లో తను నటించిన విషయం గుర్తు చేస్తూ... తమిళంలో నటిస్తూనే తెలుగులో 'చినరాయుడు'లో విజయశాంతిగారి చెల్లిగా, 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం'లో నాగార్జున చెల్లిగా... ఇవికాక మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఇక్కడ కూడా ఛానళ్ల హడావుడి మొదలైంది. అప్పుడు వెండి తెర నటీనటులు చిన్ని తెర మీద కనిపించడానికి ఆసక్తి చూపేవారు కాదు. దాన్ని అవకాశంగా తీసుకొని నేను తెలుగులో ప్రయత్నాలు చేశాను. అప్పుడే ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి నుంచి పిలుపు వచ్చింది. ఈటీవీ తొలినాళ్లలో 'సంఘర్షణ' అనే సీరియల్‌ మీకు గుర్తుండే ఉంటుంది. అందులో జాకీకీ జోడీగా ప్రధాన, ప్రతినాయిక పాత్రలో కనిపించా. మంచి ఆదరణ లభించింది అన్నారు.

  తన తల్లి కూడా సినిమాల్లో నటించిన విషయం చెప్తూ...మాది గుడివాడ. అన్నయ్య సినిమాల మీద ఆసక్తి చూపుతుంటే.. నాన్న మా కుటుంబాన్ని చెన్నైకి మార్చారు. అక్కడికి వెళ్లాక చదువు కొనసాగించలేదు. అనుకోకుండా అమ్మకి 'సూత్రధారులు' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సత్యనారాయణగారి భార్యగా అనారోగ్యంతో మంచంలో పడుకొని ఉండే పాత్రలో కనిపించింది మా అమ్మే. ఇక, నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా సంగీతం, నృత్యం నేర్చుకొనేదాన్ని. మిగతా సమయం అంతా టీవీ చూస్తుండేదాన్ని. నన్ను అలా చూసి విసిగిపోయిన అమ్మ.. 'నువ్వు టీవీ చూస్తూ ఉండే బదులు దాన్లో కనిపించే ప్రయత్నం చేయొచ్చు కదా!' అని సలహా ఇచ్చింది. నిజమే కదా అనుకొన్నా. అప్పుడు చెన్నైలోని అన్ని స్టూడియోల్లో నా ఆల్బమ్‌ ఇచ్చాను. కొన్ని రోజులకు సన్‌ నెట్‌వర్క్‌ వాళ్ల నుంచి ఫోన్‌. మొదటి అవకాశం వచ్చింది. అలా తమిళంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు ఎనభై సీరియళ్లలో నటించా అంటూ చెప్పుకొచ్చారు.

  English summary
  TV Artist Haritha says that that she has been receivied threatening phone calls from viewers. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X